Abn logo
Jun 17 2021 @ 23:44PM

తవ్వుకో.. దోచుకో..

శ్రీకాకుళం క్వారీలో ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక లోడ్‌ చేస్తూ..

జేపీ వెంచర్స్‌ అడ్డగోలు ఇసుక తవ్వకాలు

కృష్ణా నదీగర్భంలో మూడడుగులే తవ్వాలని నిబంధన

అతిక్రమించి 12 అడుగుల మేర తవ్వేస్తున్న సంస్థ

భూగర్భ జలాల లభ్యతపై ప్రభావం పడే అవకాశం

ఏ రీచ్‌లోనూ ధర్మకాటాలు లేకుండానే తరలింపు

మాన్యువల్‌ బిల్లులతో ఇష్టానుసారంగా దోపిడీ

పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న వందల లారీల ఇసుక

పట్టించుకోని అధికారులు

జేపీ వెంచర్స్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని రీచ్‌ల్లో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుతున్నారు. పేరుకేమో       టన్నుల లెక్కన ఇసుక అమ్మకాలు సాగిస్తుంటారు కానీ, క్వారీల్లో భూతద్దం వేసి వెతికినా వేబ్రిడ్జిలు కనిపించవు. భూగర్భ జలాలకు ప్రమాదం ఏర్పడకుండా మూడడుగుల మేర మాత్రమే తవ్వాల్సి ఉండగా, 9 నుంచి 12 అడుగుల లోతు తవ్వేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

విజయవాడ, ఆంధ్రజ్యోతి/అవనిగడ్డ టౌన్‌/ఘంటసాల : విజయవాడకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో విజయవాడ-అవనిగడ్డ కరకట్ట రహదారిని ఆనుకుని ఉన్న శ్రీకాకుళం క్వారీలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుతున్నారు. అయినా మైనింగ్‌ అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ పట్టించుకోవట్లేదు. జేపీ సంస్థకు పైస్థాయిలో ఆశీస్సులు ఉండటమే ఇందుకు కారణం. ఇసుక రీచ్‌ల్లో యంత్రాలను వినియోగించకూడదు, 10 టైర్ల లారీలను నదీ గర్భంలోకి తీసుకురాకూడదన్నది నిబంధన. అవేమీ ఇక్కడ అమలు కావడం లేదు. పర్యావరణ చట్టాల ప్రకారం భూగర్భ మంచినీటి వనరులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, కేవలం మూడు అడుగుల లోతున మాత్రమే ఇసుక తవ్వుకోవాలి. జేపీ వెంచర్స్‌ ఆ నిబంధన పాటించట్లేదు. నదిలోని 175 సర్వే నెంబర్‌ వద్ద 22 ఎకరాల్లో ఇసుక తవ్వుకునేందుకు జేపీ సంస్థకు కేటాయింపులు జరిపారు. అయితే, పై పొరలో గండ్ర ఇసుక పాళ్లు తక్కువ ఉండటంతో దాదాపు 9 అడుగుల మేర తవ్వేస్తున్నారు. ఈ స్థాయిలో ఇసుకను తవ్వేస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతంలోని భూగర్భ జలవనరుల పాయలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

వేసిందే లెక్క..!

టన్నుకు రూ.475 చొప్పున ఇసుక విక్రయిస్తున్నారు. కానీ, ఏ రీచ్‌లోనూ ధర్మకాటాలు లేకుండానే లోడింగ్‌ ప్రక్రియ సాగిపోతోంది. 10 టైర్ల లారీకి 18 టన్నులుగా, ట్రాక్టర్‌కు 4 టన్నులుగా లెక్కకట్టి వసూలు చేస్తున్నారు. కొన్ని లారీలకు దాదాపు 25 టన్నులకు పైగా ఇసుకను లోడ్‌ చేస్తుండటం గమనార్హం. 25 టన్నులకు డబ్బు వసూలు చేసి బిల్లుల్లో మాత్రం 18 టన్నులే చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలా అధిక లోడ్‌తో వెళ్లే వాహనాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఓవర్‌ లోడ్‌పై అధికారులు కనీసం దృష్టి సారించటం లేదు.  

ఇష్టారాజ్యంగా తవ్వకాలు

జేపీ పవర్‌ వెంచర్స్‌కు మే 17 నుంచి ఇసుక తవ్వకాలను అప్పగించారు. తొలి విడత జిల్లాలో 13 ఇసుక రీచ్‌లను కేటాయించారు. ఈ సంస్థ ఎంత ఇసుక తవ్వుతుంది, ఎంత విక్రయిస్తుందనే దానికి లెక్కాపత్రం లేదు. కంప్యూటరైజ్‌డ్‌ బిల్లింగ్‌కు ఈ సంస్థ ఆమడ దూరంలో ఉంటుంది. సొంత వే బిల్లులను మాన్యువల్‌గా ఇస్తోంది. ఇలా చేయడం వల్ల జేపీ పవర్‌ వెంచర్స్‌ ఎంతమేర ఇసుక తవ్వకాలు చేస్తుందనే దానికి వివరాలు ఉండవు. జిల్లాలో 35 లక్షల టన్నుల ఇసుక లభ్యత ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా అవస రాలకు 16 లక్షల టన్నులు సరిపోతోంది. కానీ, జేపీ వెంచర్స్‌ ఎంతమేర తవ్వకాలు జరుపుతున్నది తెలియదు. ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేసి పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఇంతలో ఎంత మార్పు..!

టీడీపీ హయాంలో ఒక లారీ నిండుగా ఇసుక లోడ్‌ చేసినందుకు కూలీలకు రూ.400 నుంచి రూ.600 మేర చెల్లించేవారు. కావాల్సిన వారు ట్రాక్టర్ల నిండుగా తీసుకెళ్లేవారు. రవాణా ఖర్చులతో కలిపి, దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ ఇసుక రూ.1,800 నుంచి రూ.2,800కు లభ్యమయ్యేది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నూతన ఇసుక పాలసీలో టన్ను ఒక్కింటికి రూ.475 మేర ధరను నిర్ణయించటంతో ఒక ట్రక్కు ఇసుక కావాలంటే అనుమతి పొందిన సంస్థకు ట్రాక్టర్‌ యజమానే రూ.1,900 మేర చెల్లించాలి. దీంతో సమీప గ్రామానికి ఇసుక వెళ్లాలంటేనే కిరాయి, ఇసుక లోడింగ్‌ ఖర్చులు, వెయిటింగ్‌ చార్జీలు మొత్తం కలుపుకొని రూ.3,100 నుంచి రూ.5,000 మేర ఖర్చవుతుంది. టీడీపీ హయాంలో ఘన పరిమాణంలో ఇసుక విక్రయాలు జరిగేవి. మూడు క్యూబిక్‌ మీటర్లు ఒక యూనిట్‌గా పరిగణించి విక్రయించేవారు. సుమారు 20 టన్నుల లారీ రవాణా చార్జీలతో కలిపి రూ.3వేల నుంచి రూ.5వేలకు లభించేది. వైసీపీ సంస్కరణల ఫలితంగా అదే ఇసుకను టన్ను రూ.375 చేశారు. రవాణా చార్జీలతో కలిపి 20 టన్నుల లారీ రూ.10వేల నుంచి రూ.15వేలకు చేరింది. ప్రస్తుతం ప్రైవేట్‌ సంస్థ టన్ను ఇసుకను మరో వంద పెంచి రూ.475కి విక్రయిస్తోంది. అంటే.. అదే 20 టన్నుల లారీకి ఇప్పుడు రవాణా చార్జీలతో కలిపి రూ.13వేల నుంచి రూ.20వేలు చెల్లించాల్సి వస్తోంది. 


క్వారీలో లారీ ఓనర్లకు బిల్లులు ఇస్తూ..


చోడవరం రీచ్‌లో మాన్యువల్‌గా ఇచ్చిన బిల్లు