Abn logo
Dec 3 2020 @ 00:17AM

ఇసుక దందా

పగలు తవ్వకాలు.. రాత్రిళ్లు తరలింపు

బిల్లుల్లేవ్‌.. అనుమతులతో పని లేకుండానే ...

టైరు బళ్లపై యథేచ్ఛగా ఇసుక తరలింపు

బల్క్‌ బుకింగ్‌ అనుమతి  పత్రాలను సృష్టించి తవ్వకాలు

రీచ్‌లో అక్రమంగా ఏపీఎండీసీ మాజీ ఉద్యోగి  పాగా

బేరం కుదరితే ఒకే.. లేదంటే లారీలపై ఎస్‌ఈబీ కేసులు


 రూ.30 వేలు కడతా ఒక్క లారీ ఇసుక ఇప్పించండని సామాన్యుడు ప్రాధేయ పడుతున్నా.. ఇసుక కొరతతో ఉపాధి కరువైన కార్మికులు అల్లాడు తున్నా.. ఇసుక విధానంలో ఎన్ని మార్పులు చేసినా ఫలితం ఉండటంలేదు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే మూడు రోజుల్లో ఇంటికే ఇసుక వస్తుందని ఏపీఎండీసీ అరిగిపోయిన రికార్డునే వినిపిస్తుంటే, సామాన్యుడికి మాత్రం లారీ ఇసుక దక్కాలంటే నల్లబజారులో  రూ.45 వేలు చెల్లించాల్సినపరిస్థితులున్నాయి. అందరికీ అందాల్సిన ఇసుక అక్రమార్కులకే అందుతోంది. ఇసుక దందాతో అక్రమార్కులు చెలరేగి పోతున్నా.. పట్టించుకునే వారే లేరు. అక్రమాలను అరిక ట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా ఉండటంతో సామాన్యు డికి ఇసుక దక్కడం గగనంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.


తెనాలి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిలో మొత్తం 31 రీచ్‌లు ఉంటే, వీటిలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి ఎగువన ధరణికోట, చింతపల్లి, బ్యారేజి దిగువన ఓలేరుకు మాత్రమే అనుమతులిచ్చారు. గాజుల్లంక, బొమ్మువానిపాలెం, క్రోసూరు మండలం కె.వి.పాలెం, మున్నంగి రీచ్‌లలో తవ్వకాల కోసం నదిలో రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. మైనింగ్‌ లెక్కల ప్రకారం ఈ రీచ్‌లలో కాకుండా మరే రీచ్‌లోనూ ఇసుక తవ్వకాలకుఅనుమతిలేదు. అయితే గతంలో ఉన్న అన్ని రీచ్‌లలో పగలు ఇసుకను తవ్వి ఒడ్డున పోయటం, రాత్రి సమయంలో బిల్లులు లేకుండా బహిరంగంగానే లారీల్లో తరలించేసి అమ్ముకోవటం పరిపాటిగా మారిం ది. గడచిన నెల నుంచి ఇదే తంతు నడుస్తుంటే, ఎస్‌ఈబీ అధికారులు మాత్రం వా రం నుంచి దాడులకు దిగుతున్నారు. రీచ్‌ల అనుమతులు తీసుకున్న కాంట్రాక్టర్లే ఇసుక ను బహిరంగంగా అమ్మేసుకుంటున్నారు. సాధారణ బుకింగ్‌లు ఇవ్వని ఏపీఎండీసీ బల్క్‌ బుకింగ్‌లకు పచ్చ జెండా ఊపిందంటూ ఏ ఉత్తర్వులు లేకుండా ఇష్టమొచ్చిన అనుమతి పత్రాలను సృష్టించి ఇసుక తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టైరుబళ్ల ద్వారా ఉచితంగా నదికి ఐదు కి.మీ టర్ల దూరంలోని గ్రామాల వారు ఇసుక తెచ్చుకోవచ్చు. అయితే ఇసుక కొరతతో కొల్లిపర, పెదకొండూరు, చిర్రావూరు నుంచి మంగళగిరికి, చిలుమూరు, కొల్లూరు నుంచి తెనాలికి టైరుబళ్లు 20 కిమీటర్ల దూరం తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కో బండి ఇసుక ధర రూ.వెయ్యి నుంచి రూ.1500 ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 


మామూళ్లిస్తే రైట్‌.. రైట్‌

నిన్నటి వరకు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎస్‌ఈబీ ఇసుక వాహనాన్ని పట్టుకుంటే, వాటిపై కేసు నమోదు చేసి కోర్టుకు పెట్టాల్సిందే. అంత కచ్చితంగా వ్యవహరించిన ఈ శాఖ ఇప్పుడు మామూళ్ల మత్తులోకి జారిపోతోందనే ఆరోపణలున్నాయి. ముందస్తుగా మామూళ్లు చెల్లించిన లారీలను నెం బర్ల ఆధారంగా వదిలేసి మిగిలిన వాటిని పట్టుకుని కేసులు పెడుతున్నారని సమా చారం. ఓలేరు రీచ్‌లో వరదల ముందు నుంచే బిల్లు లేకుండా, ఒకే బిల్లుపై రెండు నుంచి నాలుగు ట్రిప్పుల ఇసుక తోలుకుపోతుంటే కనీసం అటువైపు ఎస్‌ఈబీ అధికారులు చూడలేదని మిగిలిన రీచ్‌ల కాంట్రాక్టర్లే ఫిర్యాదులకు దిగిన సందర్భాలున్నాయి. అన్నవరం, బొమ్మువానిపాలెం, జువ్వలపాలెం, తూర్పుపాలెం, మున్నంగి, కొల్లిపర, అత్తలూరివారిపాలెం, పెదకొండూరు, చిర్రావూరు, ప్రాతూరుల దగ్గర ఏ అనుమతులు లేకుండా నదిలోనే ఎక్స్‌కవేటర్లు పెట్టి తవ్వేస్తు న్నా అటు మైనింగ్‌ శాఖ, రివర్‌ కన్జర్వేటరీ అధికారులు అడ్డుకున్న దాఖలాలే లేవు. పది రోజుల్లో కొన్ని అనధికార రీచ్‌లలో తవ్వకాలకు అనధికార అనుమతుల కోసం అన్ని శాఖలతో మామూళ్ల ఒప్పందం జరుగుతోందని సమా చారం. ఇందులో ఎస్‌ఈబీ సిబ్బంది కూడా ఉన్నారనే ఆరోపణలు న్నాయి. గతంలో ఎస్‌ఈబీ దాడులకు వస్తుంటే ఎవరికీ తెలిసేదికాదు. ప్రస్తుతం ఈ శాఖలోనూ దళారులు తయారై దాడుల సమాచారాన్ని ముందస్తుగానే అక్రమార్కులకు అందిస్తున్నట్లు పలువురు ఆరో పిస్తున్నారు. తాజాగా అన్నవరం రీచ్‌ నుంచి  ఇసుక తవ్వుకొస్తున్నారని బుధవారం తెల్లవారుజామున ఆరు లారీలను పట్టుకుని కొల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. అయితే వీటిని పట్టుకోవడానికి ముందు బేరసారాలు సాగాయని, ఒప్పందం కుదరకే కేసులు నమోదు చేశారని యజమానులు చెప్పటం కొసమెరుపు.


రీచ్‌ల వద్ద యథేచ్ఛగా అక్రమాలు

చీరాలలో ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక తోలేందుకు ఓ కాంట్రాక్టరు అధికారికంగా అను మతి  తెచ్చుకున్నారు. ఆ వ్యక్తి తన లారీలను ఓలేరు రీచ్‌కు పంపితే అక్కడి సిబ్బంది 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు ఇసుక పోసుకువెళ్లాలని, లేకపోతే బిల్లుపై తాము చెప్పి నట్లు రెండు ట్రిప్పులు వేసిరావాలని షరతులు పెట్టారు. దీంతో ఆ కాంట్రాక్టర్‌ తనకు కూడా ఓవర్‌ లోడ్‌ అవసరం లేదని, ప్రభుత్వ నిర్మాణాలకే కనుక లారీకి 18 టన్నుల ఇసుక పోస్తే సరిపోతుందని చెప్పారు. 18 టన్నులు పోసుకు వెళ్లినా అదనంగా మరో 7 టన్నులకు టన్నుకు రూ.1300 చొప్పున లారీకి రూ.9,100 అదనంగా కడితేనే లోడ్‌ చేస్తామని తెగేసి చెప్పటంతో అతను కాంట్రాక్టు వదిలేసి వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జువ్వలపాలెం రీచ్‌కు అనుమతి ఇవ్వలేదని మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీ ఎండీసీ ఉద్యోగం వదిలేసిన ఓ వ్యక్తి ఇసుక కాంట్రాక్టర్‌ అవ తారమెత్తి తనకు అనుమతి ఇచ్చా రంటూ ఇసుక దందాకు తెరలేపారనే ఆరోపణలున్నాయి. అందువల్లే అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తైనా చూడ టంలేదని సమాచారం. ఇక్కడ ఇసుకను ఒడ్డున పోసి  రాత్రి సమయంలో అక్రమంగా తరలించేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.


నది సమీప పట్టణాల్లో రూ.45,000

సామా న్యుడు ఇసుక కావాలంటే ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌తో అవస్థలు ప డుతున్నాడు. ఉదాహరణకు నదికి రెండు కిలోమీటర్లలోని కొల్లిపర, కొల్లూరు మండల గ్రామాల్లో ఇసుక అవసరమైతే ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే 65 కి.మీటర్ల నుంచి ఇసుక పంపుతుండటంపై నిర్మాణదారులు ఆశ్చర్యపోతున్నారు.  ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి లారీ ఇసుక బుక్‌ చేస్తే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి పంపి రూ.38 వేలు పిండేశారు. కృష్ణా నదికి 15 కి.మీటర్ల దూరంలోని తెనాలిలో లారీ ఇసుక రూ.45 వేలు పలుకుంతుంటే, పది కిలోమీటర్ల దూరం కూడా లేని మంగళగిరిలో 39,000 పలుకుతుండటం విశేషం. అదికూడా ఆన్‌లైన్‌ బుకింగ్‌ వల్ల దొరుకుతున్నది కాదు. అక్రమం గా తరలిస్తున్న వారి దగ్గర నుంచి కొనుగో లు ధర. 


అరవింద వారధి పక్కనే టైరుబళ్లలో ఇసుక నింపుతున్న వైనం

తొమ్మిది రీచ్‌లకు అనుమతి  

జిల్లాలో 31 రీచ్‌లుంటే వాటిలో మూడు రీచ్‌లు ప్రస్తుతం నడుస్తున్నాయి. మరో ఆరు రీచ్‌లకు అనుమతులొచ్చాయి. కొల్లూరు మండలం జువ్వలపాలెం రీచ్‌కు అనుమతి ఇవ్వలేదు. గాజుల్లంక, ఓలేరు రీచ్‌లలో మాత్రమే తవ్వకాలు జరపాలి. ఎగువన బొమ్మువానిపాలెం, మున్నంగికి మాత్రమే అనుమతి ఉంది. ఇంకెక్కడ తవ్వకాలు జరిపినా అక్రమ మైనింగ్‌ కిందికే వస్తుంది. ఇసుక తవ్వకాలు, ఎంత పరిమాణంలో తవ్వారో, ఇంకెంత పరిమాణం తవ్వాలి.. కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లింపులన్నీ జిల్లా శాండ్‌ అధికారి చూస్తారు.

 - విష్ణువర్థనరావు, ఏడీ మైనింగ్‌ శాఖ, గుంటూరు


అక్రమాలకు ఎస్‌ఈబీదే బాధ్యత

జిల్లాలో అనుమతించిన రీచ్‌ల్లోనే తవ్వకాలు జరుపుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా అక్ర మ తవ్వకాలు జరుపుతుంటే ఎస్‌ఈబీ దాడులు చేస్తుంది.  అక్రమ క్వారీయింగ్‌ నదిలో జరుగుతుంటే వారే దాడులు చేస్తారు. బల్క్‌ బుకింగ్‌కు ప్రత్యేక అనుమతులేమీ ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వ పనులకు మాత్రమే అనుమతులిచ్చాం. ప్రైవేటు పనులకు బల్క్‌ బుకింగ్‌ అనుమతి ఉందని ఎవరైనా చెబితే అది అక్రమమే. రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల వద్ద ఇసుక నిల్వ చెయ్యాల్సి ఉంది. కాంట్రాక్టర్లు  తోలకపోవటంవల్లే ఆన్‌లైన్‌లో చూపలేదు. ఎక్కడైనా నిల్వ ఉంచితే అది మా లెక్కలో లేనిదే. అక్రమ నిల్వలే.

 -  వెంకటేశ్వరరెడ్డి, జిల్లా శాండ్‌ ఆఫీసర్‌, గుంటూరుAdvertisement
Advertisement
Advertisement