ఇసుక.. ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2021-09-03T06:07:00+05:30 IST

కృష్ణానదికి వరద రాక ముందే ఇసుక ఒడ్డుకు చేర్చి నిల్వ ఉంచిన డిపోల నుంచి ఇసుక అమ్మకాలు కొనసాగిస్తామని మైనింగ్‌ శాఖ ప్రకటించింది.

ఇసుక.. ఇష్టారాజ్యం
వేమూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ఇసుక లారీలు

 రెండు, మూడు చోట్ల అమ్మకాలతో కృత్రిమ కొరత

గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు

లారీలన్నీ ఆ రీచ్‌ల దగ్గరే బారులు... 

కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

వేమూరు యార్డు గంటలకొద్దీ ట్రాఫిక్‌ ఇబ్బందులు

యార్డులో నాలుగు నెలలైనా ఖరారు కాని అద్దె

ఇసుక తరలిపోతున్నా పట్టించుకోని మార్కెటింగ్‌ శాఖ

అద్దె చెల్లించకపోయినా వే బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు

   

రాష్ట్రంలో ఇసుక అమ్మకాల అనుమతులు పొందిన జయప్రకాష్‌ పవర్‌ సెక్యూర్స్‌ కంపెనీ కింది స్థాయి సిబ్బంది నిర్వాకం, అధికారుల ఉదాశీనతతో జిల్లాలో ఇసుక కష్టాలు తీరకపోగా, మరింత జటిలమవుతున్నాయి. చివరకు ఇసుక రీచ్‌లు, డంపింగ్‌ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్‌, సబ్‌కలెక్టర్‌లు ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 38 ఇసుక రీచ్‌లను ఓపెన్‌ చేయకుండా వరద సాకులతో ఇసుక తీసే అవకాశం ఉన్న రీచ్‌లనూ మూసేశారు. కేవలం రెండు, మూడు రీచ్‌లను, డంపింగ్‌ కేంద్రాలను మాత్రమే తెరచి, అధిక రేట్లకు ఇసుక గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు.  రేపల్లె-తెనాలి ప్రధాన రహదారి వెంటున్న వేమూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద ఇసుక లారీలతో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఇదిలా ఉంటే... వేమూరు మార్కెట్‌ యార్డులో ఇసుక నిల్వ ఉంచుకునేందుకు అవసరమైన అద్దె ఖరారు ఒప్పందం చేయకుండానే యధేచ్ఛగా ఇసుక అమ్మకాలు చేస్తుండటం యార్డు ఆదాయాన్ని ప్రశ్నార్ధకంగా మార్చింది.

 

తెనాలి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి వరద రాక ముందే ఇసుక ఒడ్డుకు చేర్చి నిల్వ ఉంచిన డిపోల నుంచి ఇసుక అమ్మకాలు కొనసాగిస్తామని మైనింగ్‌ శాఖ  ప్రకటించింది. ఆయా డిపోల్లో అమ్మాల్సిన ఇసుక టన్ను ధరలను కూడా నిర్ణయించింది. దీని ప్రకారం జిల్లాలో వేమూరు, అత్తలూరివారిపాలెం, అన్నవరం, బాపట్ల, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, చౌడవరం, ధరణికోట, ఓర్వకల్లు, కోనూరు, దుర్గి డిపోల నుంచి ఇసుక అమ్మకాలను ప్రైవేటు సంస్థ కొనసాగించాలి. కానీ వీటిలో వేమూరు, పల్నాడు ప్రాంతంలో మరోచోట మాత్రమే ఇసుక అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అవికూడా అంతంతమాత్రమే. దీనితో ఆయా రీచ్‌ల దగ్గర లారీలు వందల సంఖ్యలో బారులుతీరుతున్నాయి. 


సిబ్బంది చేతివాటంతోనే..

కొల్లూరు మండలంలోని గాజుల్లంక, భట్టిప్రోలు-రేపల్లె మండలాల మద్యనున్న ఓలేరు-పెనుమూడి మధ్య నీటిలో ఇసుక తవ్వకాలు నేటికీ అనధికారికంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ జె.పి సంస్థ కాకుండా ఆ సంస్థకు సంబందించిన కొందరు సిబ్బంది చేతివాటంతో ఇచ్చిన అనుమతులతో స్థానిక నేతలే ఇసుక మాఫియాకు తెరలేపారు. ఇదే పరిస్థితి పల్నాడు ప్రాంతంలోనూ కొన్నిచోట్ల కొనసాగుతూనే ఉంది. వీటిదగ్గరయితే జిల్లా కలెక్టర్‌ సూచించిన రేట్లు కాకుండా అధిక రేట్లకు అమ్మకాలు సాగిస్తున్నారు. వీరు ప్రాంతాలను పంచుకుని చివరకు జె.పి సంస్థ దగ్గర ఇసుక కొని ఒరిజనల్‌ బిల్లుతో లారీలు వెళితే దౌర్జన్యంగా కేసులు పెట్టించి లారీలను ఆపేయటం వంటివి కోకొల్లలే. అయినా జె.పి సంస్థ సిబ్బంది మాత్రం నోరు మెదపకుండా డబ్బు దండుకుని మాకు సంబందంలేదన్నట్టు వదిలేస్తున్నారు. ఇటువంటి లోపాలతోనే అసలు సమస్యలు వస్తున్నాయనేది అధికారుల మాటే.


అద్దె ఖరారు కాకుండానే..

ఇసుక తోలేందుకు జె.పి సంస్థ తరఫున వారి సిబ్బంది మే నెలలో వేమూరు మార్కెట్‌ యార్డు స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇసుక తోలి ఉంచారు. అయితే ఇంతవరకు అద్దె ఖరారు కాలేదు. సాధారణంగా ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు వ్యాపారం చేయదలచుకుంటే ముందుగా అద్దె ఒప్పందం పూర్తి చెయ్యాలి. అయితే ఇసుక విషయంలో జిల్లాస్థాయి అధికారులు ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అద్దె ఒప్పందం ఖరారు కాకున్నా ఇసుక నిల్వలకు అనుమతివ్వాలని సిఫార్సు చేశారు. అయితే రోజుల వ్యవఽధిలో వీటిని పూర్తిచేసుకునే అవకాశంఉన్నా ఆ సంస్థ ప్రతినిధులు మాత్రం అధికార అండతో బెదిరింపులకు దిగటం విశేషం. ఏకంగా నాలుగు నెలలు దాటిపోతున్నా అద్దె చెల్లించకుండానే ఇసుక నిల్వలను అమ్మేసుకుంటున్నారు. నెలకు రూ.3.93 లక్షల వరకు అద్దె చెల్లించాలని మార్కెటింగ్‌ శాఖ లెక్కలు కడితే, అంత చెల్లించేదిలేదని, మేం ఉన్నతాధికారులతో మాట్లాడుకుంటామని చెప్పి నెలలు గడుస్తున్నా అతీగతీలేదు. రేపు అద్దె చెల్లించకుండానే మొత్తం అమ్మేసుకుని ఆ సంస్థ మొండిచెయ్యి చూపితే మార్కెటింగ్‌ శాఖ ఆదాయానికి గండిపడ్డట్టే. ఇదిలా ఉంటే... అద్దె ఖరారు విషయంలో పట్టించుకోని అధికారులు ఆ సంస్థ యార్డులోనే వే బ్రిడ్జి నిర్మించుకునేందుకు ఆఘమేగాలమీద తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేయటం విశేషం. ప్రైవేటు సిబ్బంది నిర్మాణ పనులుకూడా మొదలుపెట్టేశారు. 


అంతా ’బల్క్‌’ మయం.. 

జిల్లాలో ప్రస్తుతం వేమూరు, అత్తలూరివారిపాలెం, చౌడవరం వంటి డిపోల్లో ఇసుక అమ్మకాలు జరుగుతుంటే, వీటిలో ఒక్క వేమూరు మినహా మిగిలిన చోట బల్క్‌ అమ్మకాల పేరుతో దోచేస్తున్నారు. చౌడవరంలో ఒకే సంస్థకు పదివేల టన్నులు బల్క్‌న ఇచ్చేశారనే ప్రచారం సాగుతోంది. ఇక్కడ టన్ను ఇసుకను రూ.920కి అమ్మాల్సి ఉంటే, ఆ సంస్థ కొనుగోలు చేసిందే రూ.1,030కి అని చెబుతున్నారు. అంటే లాభం లేకుండా వారు అమ్మరు కనుక ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక దొరకటం కల్లే. ఇక్కడ కేవలం ఆ సంస్థకు చెందిన 25 లారీలకు మినహా బయటి లారీలకు లోడింగ్‌ లేదు. కొల్లిపర మండలం అత్తలూరివారిపాలెంలో అధిక ధరలకు అమ్మకాలు జరుపుతున్నారన్న కారణంతో ఇటీవల స్థానికులు ఆందోళన చేయటంతో అమ్మకాలు ఆపేశారు. గురువారం ఇక్కడ అమ్మకాలు మొదలుపెట్టినా వారుకూడా బల్స్‌ ఆర్డర్స్‌ పేరుతో తమకు సంబందించిన లారీలకే ఇసుక పోసి పంపారని చెబుతున్నారు. డిపోలో పనిచేస్తున్న జె.పి సంస్థకు చెందిన తమిళ సిబ్బందే 12 టైర్ల లారీలు తీసుకొచ్చి వాటిలో 35 నుంచి 40 టన్నుల వరకు ఇసుక పోసుకెళ్లి అధిక ధరకు అమ్మేస్తున్నారనేది ఆరోపణ. దీనికితోడు మరో వ్యక్తికి చెందిన 10 లారీలకూ ఇక్కడ బల్క్‌ పేరుతో అవకాశం ఇచ్చారు. ఈ లారీలు మినహా మిగిలిన లారీలకు లోడింగ్‌ చేయకపోవటం విశేషం. దీంతో వేమూరు మార్కెట్‌ యార్డు దగ్గరకే లారీలు బారులుతీరుతున్నాయి. ఇక్కడ కూడా బయటి లారీలకు రెండు, మూడు రోజులకు ఒక లోడు అందుతుంటే, స్థానికుల లారీలకు మాత్రం రోజుకే మూడు లోడులు అందటం విశేషం. ఇటీవల తెనాలి సబ్‌కలెక్టర్‌ నిధిమీనా యార్డులో తీరును పరిశీలించి, రోజుకు 300 లారీలకు తగ్గకుండా లోడింగ్‌ చెయ్యాలని, సీరియల్‌ ప్రకారం కాకుండా ఏ లారీకీ లోడ్‌ చేయరాదని ఆదేశాలిచ్చినా సిబ్బంది మాత్రం బేఖాతరన్నారు. 


ట్రాఫిక్‌కు అంతరాయం..

అనధికారికంగా వస్తున్న లారీలు అడ్డురావటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాలకు లారీలు రోడ్డు కిందికి జారిపోయి ఇరుక్కుపోతుండటంతో క్రేన్‌లను తెప్పించి లాగుతున్నారు. రోజుకు కనీసం 8 గంటలకుపైగా ట్రాఫిక్‌ సమస్య విడతలవారీగా ఏర్పడుతోంది. అనారోగ్యంతో ఈ దారిలో ఆస్పత్రికి వెళ్లాలనుకునేవారికి చుక్కలు కనపడుతున్నాయి. ఇటువంటి చోట ప్రైవేటు సంస్థ సిబ్బందే ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలి.  జనం బాధ చూడలేక పోలీసులు బందోబస్తు ఉన్నా సమస్యకు పరిష్కారం మాత్రం లభించటంలేదు. నేతల సిఫార్సులతో అడ్డువస్తున్న లారీలను వదిలేయాల్సిన పరిస్థితి. వేమూరులోనే కాకుండా మిగిలిన రీచ్‌లలో బల్క్‌ పేరుతో చేస్తున్న దోపిడీని అడ్డుకుని, అన్ని లారీలకు అవకాశం కల్పిస్తే ఈ సమస్య తీరుతుంది. 


Updated Date - 2021-09-03T06:07:00+05:30 IST