పర్యాటక కేంద్రంగా మొసళ్ల అభయారణ్యం

ABN , First Publish Date - 2020-07-09T10:41:15+05:30 IST

శివ్వారంలోని మొసళ్ల అభయారణ్యం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు.

పర్యాటక కేంద్రంగా మొసళ్ల అభయారణ్యం

ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌


జైపూర్‌, జూలై 8: శివ్వారంలోని మొసళ్ల అభయారణ్యం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని శివ్వారం ఎల్‌మడుగు ను సందర్శించారు. ఈ సందర్భంగా మొసళ్ల అభయారణ్యాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.


అనంతరం వేళాల, కిష్టాపూర్‌ లలో రైతు వేధిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. కుందారం గ్రామంలో బొమ్మెన సమ్మిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్‌ పాం మొక్కలు నాటారు. అనంతరం కుందారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ  చైర్మన్‌ ప్రవీణ్‌, ఎంపీపీ గోదారి రమాదేవి, జడ్పీటీసీ మేడి సునీత, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడీవో కే. నాగేశ్వర్‌ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మార్కు గ్లాడ్‌ సన్‌ పాల్గొన్నారు. 


చెక్‌డ్యాం నిర్మాణంతో అభివృద్ధి..

చెన్నూర్‌: చెక్‌డ్యాం నిర్మాణంతో చెన్నూర్‌ మండలం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. బుధవారం మండలంలోని సుబ్బరాంపల్లి వాగు వద్ద రూ. 5.89కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యాం నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ చెక్‌డ్యాం నిర్మాణంతో జోడు వాగుల వరకు నీరు నిలచి ఉంటుందన్నారు. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా కిష్టంపేట వద్ద ఏర్పాటు చేయనున్న అంబేద్కర్‌ అర్బన్‌ పార్కుకు ఈ చెక్‌ డ్యాం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. టూరిస్టుల కోసం పార్కు లో బోటింగ్‌ ఏర్పాటు, రిసార్ట్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెక్‌డ్యాం నిర్మాణాన్ని పూర్తి నాణ్యతతో నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు.


పార్కు నిర్మాణం కోసం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం వైస్‌ ఎంపీపీ బాపురెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్‌ మొక్కలను నాటారు. కార్యక్రమములో ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్‌ ఎంపీపీ బాపురెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ఎంపీడీఓ మల్లేష్‌, ఇరిగేషన్‌ ఎఈ దామోదర్‌, సర్పంచ్‌ తోట మధూకర్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


ఆయుల్‌పాం సాగుతో అధిక లాభాలు..


కోటపల్లి: ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలను సాధించవచ్చని రైతులు ఈ దిశగా దృష్టి సారించాలని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. మండలంలోని సర్వాయిపేట గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బైస ప్రభాకర్‌ తన ఐదెకరాల పొలంలో ఆయిల్‌పాం సాగుకు ముందుకు రాగా, బుఽధవారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే సుమన్‌ ఆయిల్‌ ఫాం మొక్కలు నాటారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్‌ ఫాం సాగుకు బైస  ప్రభాకర్‌ ముందుకు రావడం సంతోషకరమని, మిగతా రైతులంతా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయిల్‌పాంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందుకోసం నియోజకవర్గంలో 10 వేల ఎకరాల సాగుకు లక్ష్యం పెట్టుకున్నామన్నారు.  అనంతరం గ్రామంలో డంపింగ్‌యార్డ్‌ పనులను ప్రారంభించారు. 


కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య, సర్పంచ్‌ వసంత కుమారి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండి. అస్గర్‌, ఎంపీడీఓ లక్ష్మయ్య, సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్‌, ఏఓ మహేందర్‌, వైస్‌ ఎంపీపీ వాలా శ్రీనివాసరావు, సింగిల్‌ విండో చైర్మన్‌ పెద్దపోలు సాంబాగౌడ్‌, నాయకులు గట్టాగౌడ్‌, శశిపాల్‌ రెడ్డి, సమ్మయ్య నాయక్‌, ధనుంజయ్‌, రాళ్ళబండి శ్రీనివాస్‌లతో పాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


సచివాలయం కూల్చివేత సరైనదే..

మందమర్రి టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం కూల్చివేతపై తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రజలకు మరింత పరిపాలన అందించేందుకు నూతన సచివాలయం నిర్మిస్తామని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తెలిపారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ పాత సచివాలయం శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ఆలోచించి అన్నిశాఖలు ఒకే చోట ఉండేవిధంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీంతో పనులు త్వరగా పూర్తవుతాయని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు లేని పోని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. నూతన సచివాలయంతో రాజదానికి కొత్త రూపు రేఖలు వస్తాయని తెలిపారు. 

Updated Date - 2020-07-09T10:41:15+05:30 IST