భారత్‌పై ఆంక్షలు విధించాలనే యోచన అత్యంత అర్థరహితం : అమెరికన్ సెనేటర్ క్రుజ్

ABN , First Publish Date - 2022-03-08T20:51:04+05:30 IST

అమెరికా ప్రత్యర్థులను ఆంక్షల ద్వారా ఎదుర్కొనే చట్టం (CAATSA)

భారత్‌పై ఆంక్షలు విధించాలనే యోచన అత్యంత అర్థరహితం : అమెరికన్ సెనేటర్ క్రుజ్

వాషింగ్టన్ : అమెరికా ప్రత్యర్థులను ఆంక్షల ద్వారా ఎదుర్కొనే చట్టం (CAATSA) ప్రకారం భారత దేశంపై ఆంక్షలు విధించడం అత్యంత అర్థరహితం, అవివేకం అవుతుందని రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రుజ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను హెచ్చరించారు. అమెరికాకు భారత దేశం అత్యంత ముఖ్యమైన మిత్ర దేశమని చెప్పారు. ఇరాన్, ఉత్తర కొరియా, రష్యాలతో ముఖ్యమైన లావాదేవీలను నిర్వహించే దేశాలపై ఈ చట్టం ప్రకారం అమెరికా ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. రష్యా నుంచి ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొన్నందుకు భారత దేశంపై ఆంక్షలు విధించేందుకు సమాలోచనలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 


2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్యాకు వ్యతిరేకంగా CAATSAను అమెరికా ప్రయోగిస్తోంది.  రష్యా నుంచి  మేజర్ డిఫెన్స్ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేసే దేశాలపై ఈ చట్టం ప్రకారం ఆంక్షలు విధిస్తుంది. 


శక్తిమంతమైన సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సమక్షంలో సెనేటర్ టెడ్ క్రుజ్ మాట్లాడుతూ, భారత దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని, అటువంటి దేశంపై CAATSA ఆంక్షలను విధించేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, అదే నిజమైతే, ఇది అత్యంత అర్థరహితం, అవివేకంతో తీసుకున్న నిర్ణయమవుతుందని తాను భావిస్తున్నానని తెలిపారు. గడచిన వారంలో భారత దేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయని ఆరోపించారు. అనేక రంగాల్లో భారత దేశం అమెరికాకు చాలా ముఖ్యమైన సన్నిహిత దేశమని తెలిపారు. ఇటీవలి సంవత్సరాల్లో అమెరికా-భారత దేశం మధ్య సత్సంబంధాలు విస్తరించాయన్నారు. అయితే జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో ఈ సంబంధాలు వెనుకంజ వేస్తున్నాయన్నారు. ఐక్య రాజ్య సమితి సాధారణ సభలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానంపై ఓటింగ్‌కు గైర్హాజరైనది కేవలం భారత దేశం మాత్రమే కాదన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ ఓటింగ్‌కు దూరంగా ఉందని గుర్తు చేశారు. 



Updated Date - 2022-03-08T20:51:04+05:30 IST