సమూహ సంతకాల ‘యాకూబ్‌’ ఒఖడే

ABN , First Publish Date - 2021-03-15T09:34:26+05:30 IST

అతనొక పాట పాడుతున్నాడు. అత నొక మాట మాట్లాడు తున్నాడు. ఒకే వాక్యాన్ని అతను మళ్ళీమళ్ళీ రాయాలనే రాస్తున్నాడు. అతను పాడుతున్న పాట,...

సమూహ సంతకాల ‘యాకూబ్‌’ ఒఖడే

అతనొక పాట పాడుతున్నాడు. అత నొక మాట మాట్లాడు తున్నాడు. ఒకే వాక్యాన్ని అతను మళ్ళీమళ్ళీ రాయాలనే రాస్తున్నాడు. అతను పాడుతున్న పాట, ఆడు తున్న మాట, రాస్తున్న వాక్యం మనిషి కోసం జీవంతో అల్లాడుతున్నది. ఆ జీవం నిండా పురాతన మానవీయ స్వరం ఒకటి తొణికిస లాడుతుంటుంది. తరాలుగా తన వాళ్ళూ, తన లాంటి వాళ్ళూ కోల్పోయిన ప్రపంచం తాలూకు భాష, వేదనా అతని పాటలూ, మాటలూ, వాక్యాల నిండా అలరారుతుంటుంది. ఇందు కోసమే అతను కవిత్వం అవుతాడు. ఒక్కోసారి తన వేదనని మళ్ళీ వాక్యంగా మలిచినప్పుడు అతను వ్యాసం అవుతాడు. తన చేతివేళ్ళ నుంచి వచ్చే అతని వాక్యమంతా ప్రపంచ పీడిత స్వరాన్ని అక్కున చేర్చుకునే అమ్మలా ఆప్యాయంగా అల్లుకు పోతుంది. ఆ అతను యాకూబ్‌. ఆ యాకూబ్‌ను చూసినప్పుడల్లా ‘ఏడుతరాల’ నవలలోని ‘కుంటా కింటే’ని దాటొ చ్చిన అలెక్స్‌ హెలీ’లా కనిపిస్తాడు. ఆ యాకూబ్‌ సృష్టించిన సాహిత్యమంతా ఇందు కోసమే అనిపిస్తుంది. అనిపించటమే కాదు, సరిగ్గా అందుకోసమే. కాకుంటే కుంటా కింటే లాంటి తన తాతల జ్ఞాపకాలన్నీ కవిత్వపు అవార్డులుగా ఎందుకు సిద్ధం చేస్తాడు. 


‘చివరగా ఊపిన చేతుల వెనక అందనంత దూరం ఉంది’ అంటూ ఎప్పుడూ డిగ్రీ రోజుల్లో తన ‘ప్రవహించే జ్ఞాపకం’ కవిత్వం చదువుకుని యాభ య్యవ యేట కూడా గుర్తుపెట్టుకోదగినట్టుగా ఉండి పోయిన ఆయన వాక్యాల మహత్తు గురించి చర్చించే ప్రస్తావన ఇది కానప్పటికీ, యాకూబ్‌ సాహిత్య వ్యక్తి త్వాన్ని గురించి ఒక ఆత్మీయ స్పర్శగా ఈ నాలుగు మాటలు ఉండిపోతే చాలనిపిస్తుంది. 


ఆయన కవిత్వ వాక్యాల్లో జీవన స్పర్శ హృదయంలోకి నేరుగా పాకుతుంది. మళ్ళీ మళ్ళీ తన కవిత్వపు నదిలో ఈదులాడేలా చేేస ఆయన కవిత్వ స్వరం మెల్లిగా ఇతరుల కవి త్వంలోకి పాకుతుంది. అదే కవిగా యాకూబ్‌ గొప్పతనం. ‘నదీ మూలం లాంటి ఇల్లు, తీగల చింత’ వంటి కవిత్వాల్లో ఈ జీవన స్పర్శతోనే అతను ప్రపంచంతో సంభాషిస్తాడు. ప్రపం చంతో మాట్లాడేటపుడు అతను అమ్మ అవుతాడు. ద్వేషం కురిసే నేల మీద అతను ప్రేమ కోసం పలవరిస్తాడు. విద్వేష రక్తపు చీకటి ముసిరే నేలమీద అతను మానవీయ వెలుగుల కోసం పలకరిస్తాడు. ఊరికి దూరంగా విసిరే యబడ్డ ఒక నిరుపేద ముస్లిం స్వరంతో అతను ప్రపంచాన్ని పలకరించటమే కాదు, తనలా పలకరించే అనేకమంది మనుషుల్ని తయారు చేస్తూ ఒక మానవీయ కర్మాగారం అవుతాడు. 


చాలామందికి మల్లే యాకూబ్‌ తెలుగు సాహిత్య ఉపన్యాసకుడు. కానీ, ఆ చాలా మందికి మల్లే ఆ ఉపన్యాసకుడనే పాత్రకే పరిమితం కానివాడు. తరగతి గదిని ఉద్దీపితం చేసే ఉపన్యాసకుడు తరగతి గదిని విశాలం చేస్తాడు. సరిగ్గా యాకూబ్‌ తన తరగతి గదిని విశాలం చేశాడు. చాలామందికి మల్లే అతడు తరగతి గదిని కేవలం జీవిక కోసం జీతం రాళ్ళిచ్చే వాహికగా మాత్రమే భావించలేదు. జీవనర వళిని వినిపించే సజీవ నదిగా మలచుకు న్నాడు. అందుకే యాకూబ్‌ పాఠాలు విన్న ఒక తరం మొత్తం సాహిత్యోపజీవులుగా మారి పోతారు. 


సాహిత్యపు ఆత్మను పట్టుకున్నవాడు యాకూబ్‌. తనకూ, తన లాంటి వాళ్లకూ సాహిత్యం ద్వారా ఏం కావాలో తెలుసు కున్నవాడు. సాహిత్యం ఏం చేస్తుందో తెలుసుకుని సాహిత్యం చేసే మ్యాజిక్‌ని మ్యూజిక్‌గా వినిపిస్తూ తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆ లోకంలోకి నడిపించిన వాడు. నిజానికి రాయటం తెల్సినవాడె వ్వడూ రాతకు విరామం ఇవ్వడు. రాత పరమార్థం తెల్సినవాడెవ్వడూ రాతని తప్పుదారి పట్టించడు. ఇలా రాతకి విరామం ఇవ్వకుండా, రాత పరమార్థం విస్మరించకుండా నిరంతరం రాయాల్సిన దానికోసమే రాతని ఉపయోగిస్తున్న యాకూబ్‌ ఆ రాతను విశాలం చేసే కరవాలంగా ‘కవి సంగమం’ ను ఉంచుకున్నాడు. ఈ క్రమంలో అతని ప్రతి అడుగులో అండగా నిలబడిన కవయిత్రి, రచయిత్రి ‘శిలాలోలిత’ పాత్రని ఎవ్వరూ విస్మరించలేరు. నిజానికి వీళ్ళిద్దరూ ఆధునిక తెలుగు సాహిత్య సమాజంలో ఒక పరిశోధనా కేంద్రం వంటి వారు. తమ ఉనికిలో ఉన్న కాలాన్ని వైయక్తికం కాకుండా సామూహికం చేస్తూ ఒక సాహిత్యాన్ని ఒక సమూహగానం చేసిన వాళ్ళు యాకూబ్‌-శిలాలోలితలు. 


నిజానికి యాకూబ్‌ మనకాలపు తిక్కన అనిపిస్తారు నాకు. తనను తాను రక్తమాంసాలున్న మనిషిగా, ఆత్మాభిమాన ప్రతీకగా తిక్కన సృష్టించిన ద్రౌపదిలో ఉన్న మానసిక దృఢత్వం, పట్టుదల, తాను సాధించాలనుకున్న లక్ష్యం పట్ల ఉండే ఏకాగ్రత, యాకూబ్‌లో కనిపిస్తుంది. ఇంకోవైపు తిక్కన చాటిన సాహిత్య ఆదర్శంతో యాకూబ్‌ను పోల్చాలనిపిస్తుంటుంది. నిజానికి కవి తన సమకాలంలోనే కాదు, తన తర్వాతి కాలంలో కూడా బతికే ఉంటాడు. ఇది అతను చాటిన ఆదర్శం చేత సాధ్యమవుతుంది. 


నన్నయ్య ‘భారతానువాదం’లో కోల్పోతున్న ‘తెలుగు’ అస్తిత్వపు ఉనికిని పసిగట్టి తిక్కన తన పదిహేను పర్వాల భారతమంతా ‘తెలుగు అస్తిత్వాన్ని’ బతికించటం కోసం పడిన తపన సరిగ్గా యాకూబ్‌లో నాకు కనిపిస్తుంది. అంతే కాదు, విద్వేషాల కాలంలో మనిషి అంతరించి పోతున్న ప్పుడు మనిషిని బతికించటం కోసం తిక్కన సాధించిన ‘హరి హరాద్వైత సమన్వయం’ వం టిదే యాకూబ్‌ అనేక సందర్భాల్లో సాధించాడు. ముస్లిం, మైనారిటీ, సాహిత్య వాద వివాదాలు చెలరేగి లక్ష్యానికి దూరంగా చర్చోపచర్చలు సాగిపోతున్న ప్పుడు కూడా ఇటువంటి సమన్వయమే సాధించి కవులు, రచయితలు చేరుకోవాల్సిన సత్య తీరాలను చూపుడువేలితో చూపించిన వాడు యాకూబ్‌. నిజానికి నిండైన సాహిత్య వ్యక్తిత్వం ఉన్న మనిషి చాటాల్సిన సత్యం యిదే. 


యాకూబ్‌ చాలాసార్లు నాకు ‘యాకోబు’గా అనిపిస్తాడు. వేదనని కవిత్వంగా వ్యక్తీకరించే టప్పుడు నా చిన్నప్పుడు తప్పిపోయిన నా అన్నెవరో మళ్ళీ నన్ను వెతుక్కుని వచ్చినట్టుగా అగుపిస్తాడు. అక్షరాలని పొదివిపట్టుకుని నడిపిస్తూ పొదిగిట్లో పిల్లల్లా వాటిని దాచుకునే తీరుని అతను జీవితంలోనూ విస్మరించకుండా నడిపించుకుంటూ వచ్చాడు. అతను నడు స్తూనే కవిత్వాన్ని నడిపించాడు. ఇందుకోసమే కవి సమాజాన్ని ‘రొట్టమాకు రేవు’ వైపు నడిపించాడు. అతను రాస్తూనే సాహిత్య విమర్శను, పరామర్శను నడిపించాడు.


40ఏళ్లకు పైగా సాహిత్య అధ్యాపనంలో రాటుదేలిన ఉపన్యాసకుడు యాకూబ్‌ ఈ నలభై ఏళ్లల్లో ఎందరినో సాహిత్యకారులుగా తీర్చిదిద్దాడు. ఇంకోవైపు నిత్య నిరంతర సాహిత్య పిపాసిగా ‘కవి సంగమం’ ద్వారా ఎందరో యువ కవులకు తమ స్వరాన్ని వినిపించే వెసులుబాటునిచ్చాడు. కవిత్వం కోసం ‘కవి సంగమం’ పదేళ్లుగా కృషి చేస్తూనే ఉంది. ఈ పదేళ్ళలో కొన్ని వందల కవులకి ఒక కర్మాగారంలా ‘కవి సంగమం’ ఉపకరించింది. 


కవిత్వం అంటే ఏమిటి? కవిత్వం ఎందుకు రాయాలి? ఎవరి కోసం రాయాలి? కవిత్వంలో వస్తువుతో శిల్పం సాధించే సమన్వయం ఏమిటి? అసలు కవి సంస్కారం ఏమిటి? అసలు కవిత్వం సాధించే ప్రయోజనం ఏమిటి? కవి ఎవరి పక్షం వహించాలి? ఏ పక్షం వహించేటప్పుడు ఏయే వస్తువులు స్వీకరించాలి? వస్తువుని కవిత్వం చేసేప్పుడు సాధించాల్సిన ప్రమాణా లేమిటి? వంటి అనేక ప్రశ్నలకు యాకూబ్‌ జీవితం ఒక కొలమానంలా అగుపిస్తుంది. 


‘కవి సంగమం’ ద్వారా వందలాదిమంది కవులను, అనేకమంది సాహిత్య విమర్శకులను సంసిద్ధం చేసిన ‘ఉభయ కవిమిత్రుడు యాకూబ్‌’ అటు కవులకు, ఇటు సాహిత్య విమర్శకులకు ఒక ఆవాస కేంద్రంగా కవి ఇస్మాయిల్‌ ‘చిలుకలు వాలిన చెట్టు’గా అమరాడు. 


యాకూబ్‌ ఒక ప్రయోగ వాది. ఒక ఆచరణ వాది. ఒక సమ న్వయవాది. సంక్షోభాలను దాటి సమన్వయం వైపు ప్రయాణించే ఒక ఆశావాది. సమసమాజం మీద అతని విశ్వాసం గొప్పది. అందుకోసం ఆయన చేసే ప్రయాణం మరొకరికి సాధ్యపడనిది. ఈ క్రమంలో ఆయన మీద సంకుచిత మనస్త త్వంతో విమర్శలు చేయొచ్చుగాక. కానీ, అతనా విమర్శల రాళ్ళతో ఒక వంతెన నిర్మించుకుని ప్రయాణం సాగిస్తూనే ఉంటాడు. ఇటువంటి వంతెనలే కవి సంగమం ద్వారా పొయిట్రీ యూట్యూబ్‌ ఛానల్‌ చేయటం. కవిత్వాన్ని శ్వాసించే యాకూబ్‌లో కవిత్వ రచన విషయంలో రాజీపడని తనంలో దాచిన ప్రేమ ఎందరో యువ కవులకు పెద్దన్నని చేసింది. ఒక సాహిత్యోద్యమం చేసే పనిని యాకూబ్‌ చేశాడు. దీనిని కొందరు అంగీకరించకపోవచ్చు. కానీ, తాను నడిచినంతమేరా అతను కవిత్వపు విత్తనాలను చల్లుతూనే ఉన్నాడు. ఇందుకోసం ఊరూరా తిరిగాడు. ఆయన చేసిన ప్రయా ణాలన్నీ సాహిత్య ప్రయాణాలే. వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి ఎదుగుతున్న తన బిడ్డ భవిష్యత్తుని ఊహించుకుంటూ సాగించే జీవితంలా సాహిత్యం కోసం ఆయన నేల నాలుగు చెరగులా అలానే తిరిగాడు. తిరుగుతున్నాడు కూడా. యాకూబ్‌ మనకాలపు సాహిత్య పరివ్రాజకుడు. దర్పం ప్రదర్శించని మనిషి. గర్వం దరిజేరని ఆయన వ్యక్తిత్వం ముచ్చటేస్తుంది. 


భాష, సాహిత్యాల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన ఒక విశ్వవిద్యాలయం చేయాల్సిన పనిని అతను చేశాడు. అతన్ని కమ్యూనిస్టని ఆయన కృషిని అవమానించారు. ఇంతకు ముందు చెప్పినట్టు అతను ముస్లిం అని అనేక సందర్భాల్లో పక్కనపెట్టారు. అతను యువతను కవిత్వంలోకి, సాహిత్యంలోకి తెస్తున్నాడని ఇంకొన్ని సందర్భాల్లో వివక్ష చూపారు. ఇదుగో ఈ అవమానాలను, ఈ పక్కన పెట్టడాలని, ఈ వివక్షని ఒక్క చిరునవ్వుతో తొలగించుకుని అతను చేసే ప్రయాణం ఈ చూపులు చూసే వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సాగిపోతున్నది. కాలంలో వస్తున్న ప్రతి సాంకేతిక మార్పునీ సంవదించుకుంటూ సాహిత్యం కోసం యాకూబ్‌ చేస్తున్న ప్రయాణం అనితర సాధ్యమైనది. కవిత్వం, సాహిత్య విమర్శ, కవిత్వ పరామర్శ... కవి సంగమం, రొట్టమాకు రేవు అవార్డులు. కొత్త కవులకు తోడ్పాటు, మాత్రమే కాదు, సాహిత్యాన్ని వ్యాప్తి చేయటం కోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించు కోవటంలో యాకూబ్‌ మార్క్‌ మరొకరు అనుసరించలేకపోయారు. ఇలా ఇన్నిందాలా ఆధునిక సాహిత్యం మీద ఒక సమూహ సంతకం చేసిన యాకూబ్‌ ఒఖడే. ఈ ఒక్కడు మనకాలం మీద చేసిన ప్రేమ సంతకం పదికాలాలపాటు పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అనుకుంటాను. 


డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌

98481 87416

మార్చి 21న హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌ హాల్‌లో ‘కవి యాకూబ్‌ః 60’ సందర్భంగా


Updated Date - 2021-03-15T09:34:26+05:30 IST