వనవాస దుఃఖం

ABN , First Publish Date - 2020-05-16T10:49:02+05:30 IST

లోకంలో ఒక వ్యక్తికి కష్టాలు వస్తే అతడు దుఃఖిస్తాడు. ఆపై అతని తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, తోబుట్టువులు కూడా దుఃఖిస్తారు. కష్టాలను పొందిన వ్యక్తి సజ్జనుడైతే, ఉపకార స్వభావం కలవాడైతే

వనవాస దుఃఖం

లోకంలో ఒక వ్యక్తికి కష్టాలు వస్తే అతడు దుఃఖిస్తాడు. ఆపై అతని తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, తోబుట్టువులు కూడా దుఃఖిస్తారు. కష్టాలను పొందిన వ్యక్తి సజ్జనుడైతే, ఉపకార స్వభావం కలవాడైతే అతని కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు బంధుమిత్రులు, పరిచితులు కూడా.. ‘‘అయ్యో! ఇంత మంచివాడికి ఈ కష్టాలేమిటి?’’ అని ఆవేదన చెందుతారు. ఉదాహరణకు.. శ్రీరామచంద్రుడు తన భార్య సీతతో,  సోదరుడైన లక్ష్మణునితో కలిసి వనవాసానికి వెళ్తుంటే చిన్న, పెద్ద, స్త్రీ, పురుష భేదం లేకుండా అయోధ్యవాసులంతా దుఃఖించారు. అంతులేని దుఃఖంతో తమ పనుల్ని మానేశారు. ఏ ఒక్కరికీ ఆహారముపైకి కానీ ఆటపాటలపైకి కానీ మనసే పోలేదు.


రాజమార్గంలో జనులందరి ముఖాలూ కన్నీటితో నిండిపోయాయి. ఎవరి ముఖంలోనూ సంతోష రేఖలే లేవు. శ్రీరాముని హితులు, సన్నిహితులు, మిత్రులు, ఆత్మీయులు దుఃఖ భారంతో మూర్ఛపోయారు. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, శీలవృద్ధులు, వేదవేదాంగ పండితులు, నిత్యాగ్ని హోత్రులు, తపోధనులు తమ తమ జపతపాలను, హోమాలను వదిలారు. ప్రజలెందరెందరో శ్రీరాముని రథాన్ని అనుసరిస్తూ పరుగులు తీశారు. అయితే, సీతారామ లక్ష్మణులు ఏ మాత్రం దుఃఖానికీ లోను కాకుండా కర్తవ్య దీక్షతో వనవాసానికి బయల్దేరారు. రాముడు తమసానదీ తీరంలో రథాన్ని నిలిపించి.. ‘‘ప్రజలు దుఃఖిస్తూ ఉండగా నేను ఆహారాన్ని స్వీకరించలేను.


ఈనాటి రాత్రి కేవలం మంచినీటినే తీసుకొంటాను’’ అని లక్ష్మణుడితో అన్నాడు. తెల్లవారుజామున.. తమసా నదీ తీరంలో చెల్లాచెదురుగా నిద్రిస్తున్న ప్రజలు లేవక ముందే సుమంత్రుని ఆజ్ఞాపించి రథం సిద్ధం చేయించి అరణ్యంలోకి వెళ్లిపోయారు. రాముడు లేని అయోధ్యలో ప్రజలే కాదు.. ప్రకృతి కూడా దుఃఖించిందట! ఆ విషయాన్ని వాల్మీకి మహర్షి సుమంత్రుడి ముఖతః దశరథుడికి ఇలా చెప్పించాడు..


విషయే తే మహారాజ రామ వ్యసన కర్శితాః శ్రీ

అపి వృక్షాః పరిమ్లానః సపుష్పాంకురకోరకాః శ్రీశ్రీ

ఉపతప్తోదకా నద్యః పల్వలాని సరాంసిచ శ్రీ

పరిశుష్క పలాశాని వనాన్యుప వనానిచ శ్రీశ్రీ


‘‘అయోధ్యలో ఇదివరకు పూలతో, ఆకులతో, పండ్లతో ఉండే చెట్లు శ్రీరాముని వనవాస దుఃఖాన్ని సహించలేక వాడిపోయి, ఎండిపోయి కనిపించాయి. నదులు, చిన్న చిన్న నీటిగుంటలు, ఎక్కువ నీళ్లున్న సరస్సులు కూడా వేడెక్కి సలసలా మరుగుతున్నాయి.


పెద్ద పెద్ద వనాలు, చిన్న చిన్న తోటలు కూడా ఎండిపోయాయి. వాడిపోయిన ఆకులు నేలరాలాయి. జంతువులు కదలకుండా నిలిచిపోయాయి. ప్రజలెవ్వరూ నాతో మాట్లాడ లేదు. కన్నెత్తి చూడలేదు. శ్రీరాముడు లేని రథాన్ని చూసి వేడి నిట్టూర్పులను విడుస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రకృతి, ప్రాణులు అన్నీ శ్రీరాముని వనవాస దుఃఖంలో మునిగాయి ప్రభూ’’ అని సుమంత్రుడు దశరథునికి విన్నవించాడు. మంచివారి కష్టం లోకానికంతటికీ దుఃఖకారకం అని తెలిపే ఘట్టమిది.


 సముద్రాల శఠగోపాచార్యులు, 9059997267

Updated Date - 2020-05-16T10:49:02+05:30 IST