24న తెరపైకి సముద్రఖని ‘రైటర్‌’

అటు దర్శకత్వంతో పాటు ఇటు నటుడుగా బిజీగా మారిన సముద్రఖని నటించిన చిత్రాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఈనెల 3వ తేదీన ఆయన నటించిన ‘చిత్తిరై సెవ్వానం’ చిత్రం జీ-5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. స్టంట్‌ మాస్టర్‌ సిల్వా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రఖనితో పాటు రీమా కల్లింగల్‌, హీరోయిన్‌ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్‌ నటించారు. ప్రముఖ దర్శకుడు ఏఎల్‌.విజయ్‌, దర్శకుడు సిల్వా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలావుంటే, సముద్రఖని నటించిన మరో చిత్రం ‘రైటర్‌’ విడుదలకు సిద్ధమైంది. ఫ్రాంక్లిన్‌ జాకబ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రలో సముద్రఖనితో పాటు హరి కృష్ణన్‌, ఇనియ, లిజీ ఆంటోనీ, మహేశ్వరిలు ప్రధాన పాత్రలను పోషించారు.

గోవింద్‌ వసంత సంగీత స్వరాలు సమకూర్చగా, ఇందులో హీరో సముద్రఖని పోలీ్‌సస్టేషన్‌లో రైటర్‌ పాత్రను పోషించారు. ఇందులో సముద్రఖని గతంలో చూడని పాత్రలో నటించారు. ఈ  సినిమాని డిసెంబరు 24వ తేదీ శుక్రవారం థియేటర్లలో విడుదలచేయనున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ తన సొంత బ్యానర్‌ నీలమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై లిటిల్‌ రెడ్‌ కార్‌ ఫిల్మ్స్‌, గోల్డెన్‌ రేషన్‌ ఫిల్మ్స్‌ సహకారంతో నిర్మించారు. గతంలో పా.రంజిత్‌ నిర్మాతగా ‘పరియేరుం పెరుమాళ్‌’, ‘ఉలగపోరిన్‌ కడైసిగుండు’ వంటి చిత్రాలను నిర్మించారు.

Advertisement