ఛార్జర్‌తో సహా మీరు కోరుకునేవన్నీ ఇస్తాం.. యాపిల్‌కు శామ్‌సంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2020-10-16T00:30:35+05:30 IST

టెక్ దిగ్గజం యాపిల్ రెండు రోజుల క్రితం ఓ వర్చువల్ ఈవెంట్ నిర్వహించి ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను..

ఛార్జర్‌తో సహా మీరు కోరుకునేవన్నీ ఇస్తాం.. యాపిల్‌కు శామ్‌సంగ్ కౌంటర్

టెక్ దిగ్గజం యాపిల్ రెండు రోజుల క్రితం ఓ వర్చువల్ ఈవెంట్ నిర్వహించి ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ఐఫోన్ 12 సిరీస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన వారంతా యాపిల్ ఈ ఫోన్లను విడుదల చేయడంతో ధర, ఫీచర్స్, బాక్స్‌లో ఏమేం ఉంటాయన్న వివరాలను తరచితరచి చూశారు. అయితే.. వారికి ఓ విషయం షాకిచ్చింది. ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లు కొన్నవారికి ఆ బాక్స్‌లో ఛార్జర్స్, ఇయర్‌ప్యాడ్స్ లేవన్న సంగతి తెలిసి ఈ ఫోన్లు కొనడానికి ఉత్సాహం చూపిన వారంతా కంగుతిన్నారు.


ఐఫోన్ 12 సిరీస్‌లో 64జీబీ ఫోన్ ధర రూ.79,900, 128జీబీ ఫోన్ ధర 84,900, 256జీబీ ఫోన్ ధర రూ.94,900. ఐఫోన్ 12 ప్రో సిరీస్‌ ఫోన్ ధర లక్ష పైమాటే. ఇంత ఖరీదైన ఫోన్లకు కొన్నప్పటికీ ఛార్జర్‌ను బాక్స్‌లో ఇవ్వకపోవడంపై యాపిల్ కంపెనీపై విమర్శలొచ్చాయి. అంత డబ్బు పోసి మళ్లీ విడిగా ఛార్జర్, ఇయర్‌ప్యాడ్స్ కొనుక్కోవడం ఏంటని నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.


తాజాగా.. యాపిల్‌‌తో ఎప్పుడూ పోటీ పడుతూ ఉండే శామ్‌సంగ్ సంస్థ కూడా ఐఫోన్ 12 సిరీస్‌ ఫోన్లకు ఛార్జర్ ఇవ్వకపోవడంపై యాపిల్ సంస్థకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. మీరు ఎదురుచూసే వాటన్నింటినీ శామ్‌సంగ్ గెలాక్సీ ఇస్తుందని.. ఫోన్‌కు కనీసం ఇవ్వాల్సిన ఛార్జర్‌తో సహా ఉత్తమ కెమెరా, బ్యాటరీ, మెమొరీ, 120హెచ్‌జెడ్ స్ర్కీన్‌తో గెలాక్సీ ఫోన్ మీకు అందుబాటులో ఉంటుందని యాపిల్‌పై శామ్‌సంగ్ పంచ్ వేసింది. అంతేకాదు, ఓ బ్లాక్ ఛార్జర్‌తో ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ఫేస్‌బుక్‌లో శామ్‌సంగ్ పోస్ట్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఆసక్తకిర కామెంట్లతో స్పందిస్తున్నారు.

Updated Date - 2020-10-16T00:30:35+05:30 IST