లాక్‌డౌన్‌లో 20 వేల బంతులు ఎదుర్కొన్నా: శాంసన్

ABN , First Publish Date - 2020-09-24T23:11:43+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ ఇప్పుడు రాజస్థాన్

లాక్‌డౌన్‌లో 20 వేల బంతులు ఎదుర్కొన్నా: శాంసన్

దుబాయ్: ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు ఆశాదీపంగా మారాడు. 32 బంతుల్లో 74 పరుగులు చేసి పీయూష్ చావ్లా, రవీంద్ర జడేజా వంటి సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.


శాంసన్ అంతలా రాటుదేలడం వెనక అతడి అపారమైన కృషి ఉంది. లాక్‌డౌన్ సమయంలోనూ ఖాళీ లేకుండా ప్రాక్టీస్ చేశాడు. రోజూ ఆరేడు గంటలు చెమటోడ్చేవాడు. ఆ సమయంలో ఏకంగా20 వేల బంతులను ఎదుర్కొన్నాడు. 


శాంసన్ మెంటార్ రైఫి గోమెజ్ తిరువనంతపురంలోని తన ఇంటి టెర్రస్‌ను నెట్ ప్రాక్టీస్‌కు అనువుగా మార్చేశాడు. అక్కడ శాంసన్ నిరంతరం సాధన చేసేవాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత శాంసన్ ఫేస్‌బుక్ ద్వారా తన మెంటార్ గోమెజ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. గోమెజ్ తన కోసం గత ఆరు నెలలుగా ఎంతో కష్టపడ్డాడని పేర్కొన్నాడు. ‘‘లాక్‌డౌన్ సమయంలో మీ అందరి ప్రేమపూర్వక సందేశాలకు ధన్యవాదాలు. ముఖ్యంగా రైఫి గోమెజ్‌కు. లాక్‌డౌన్‌లో అతడు నాకు 20 వేల బంతులు సంధించాడు’’ అని శాంసన్ పేర్కొన్నాడు. 


గోమెజ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో శిక్షణ కోసం ఎక్కువ సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో మా టెర్రస్‌ మీదే శిక్షణ మొదలుపెట్టాం. నేనే బాల్స్ వేశా. విభిన్న రకాల డెలివరీలను శాంసన్ ఎదుర్కొన్నాడు. బౌన్సర్లు, యార్కర్లు సహా పలు రకాల బంతులను ఎదుర్కొన్నాడు’’ అని పేర్కొన్నాడు. ప్రతి రోజు ఆరేడు గంటలు శిక్షణలోనే గడిపేవారమని గోమెజ్ వివరించాడు. 

Updated Date - 2020-09-24T23:11:43+05:30 IST