శాంపిల్‌.. కిల్‌!

ABN , First Publish Date - 2022-01-22T06:52:38+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు వందల్లో వస్తున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా పాజిటివ్‌లు పడగలెత్తుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో అనుమానిత వ్యక్తుల నుంచి వైద్యఆరోగ్య శాఖ వేలల్లో స్వాబ్‌ శాంపిళ్లను సేకరిస్తోంది.

శాంపిల్‌.. కిల్‌!
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ పరీక్షలు

  • జిల్లాలో వేలాది కొవిడ్‌ శాంపిళ్లు వృథా
  • పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో సేకరించిన స్వాబ్‌ శాంపిళ్లన్నీ రోజుల తరబడి వదిలేస్తున్న వైనం
  • కాకినాడ వైరాలజీ ల్యాబ్‌కు రావలసినవన్నీ రాకుండాపోతున్న వైనం
  • బిల్లులు మంజూరవక శాంపిల్‌ కలెక్షన్‌ వాహనాలు నిలిపివేతే కారణం
  • అయిదు నెలలపాటు రూ.30 లక్షల వరకు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం బాకీ
  • దీంతో 16 వాహనాలకు 8 నిలిపివేత.. మిగిలినవీ అంతంతమాత్రంగానే రవాణా
  • ఏజెన్సీలో సేకరించే శాంపిళ్లకు దిక్కేలేదు

జిల్లాలో కొవిడ్‌ కేసులు వందల్లో వస్తున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా పాజిటివ్‌లు పడగలెత్తుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో  అనుమానిత వ్యక్తుల నుంచి వైద్యఆరోగ్య శాఖ వేలల్లో స్వాబ్‌ శాంపిళ్లను సేకరిస్తోంది. వీటన్నింటిని కాకినాడ  వైరాలజీ ల్యాబ్‌కు తరలించి సాధ్యమైనంత వేగంగా పరీక్షించి పాజిటివా? కాదా?  నిర్ధారించాలి.. కానీ ఆచరణలో ఏం జరుగుతోందో తెలుసా.. సేకరిస్తున్న స్వాబ్‌ శాంపిళ్లు రోజుల తరబడి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లోనే ఉండిపోయి పాడైపో తున్నాయి. ఇక్కడి నుంచి కాకినాడకు వీటిని తరలించే ప్రత్యేక వాహనాలు ఆగిపోవడమే కారణం. ఎందుకంటారా... వాహనాల కాంట్రాక్టర్‌కు అయిదు నెలల నుంచీ ప్రభుత్వం రూ.30 లక్షల బిల్లు బకాయిలు చెల్లించడం లేదు. ఇంకేముంది సదరు కాంట్రాక్టర్‌ వాహనాలను సగానికి సగం కుదించేశాడు. ఉన్నవి కూడా 40 గ్రామాలకొకటి తిరగలేక పడకేశాయి.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కోట్లలో నిధులు ఇస్తోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా వైద్యానికి అవసరమైన నిధులు కలెక్టర్‌ల వద్ద పుష్కలంగా ఉన్నాయని చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. ప్రభుత్వ నిర్వాకంతో కేసులు పెరిగిపోయే ప్రమాదం తలెత్తుతోంది. చివరకు సామాన్యుల నుంచి కొవిడ్‌ అనుమానితుల వరకు ప్రభుత్వ తీరుతో బెంబేలెత్తుతున్నారు. ఇందుకు నిదర్శనమే కొవిడ్‌ శాంపిళ్ల సేకరణ వాహనాల తీరు. ఇవి నిలిచిపోవడంతో శాంపిళ్లు ఎక్కడివక్కడే రోజులతరబడి ఉండిపోతు న్నాయి. దీంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. వాస్తవానికి కొవిడ్‌ మహమ్మారి ఉధృ తంగా ఉన్న నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌ నుంచి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో అనుమానితుల నుంచి కొవిడ్‌ స్వాబ్‌ శాంపిళ్లు సేకరిస్తోంది. నిత్యం ఒక్కో సెంటర్‌ నుంచి వందల సంఖ్యలో వీటిని సేకరిస్తున్నారు. వీటిని అదే రోజు లేదా మరుసటి రోజు ప్రత్యేక వాహనాల్లో కాకినాడ వైరాలజీ ల్యాబ్‌కు తరలిస్తున్నారు. ఇందుకు 16 వాహనాలు జిల్లా అంతటా తిరుగుతున్నాయి. ఒక్కో వాహనానికి 20 గ్రామాల వరకు అప్పగించా రు. ఆయా ప్రాంతాల్లో సేకరించిన శాంపిళ్లను భద్రతంగా కాకినాడకు తీసుకురావాలి. అక్కడ వీటిని పరీక్షించి కొవిడ్‌ సోకిందా? లేదా? నిర్ధారించి సదరు స్వాబ్‌ సేకరించిన వ్యక్తికి సమాచారం చేరవేస్తారు. కానీ గడచిన కొన్ని నెలలుగా ఇలా జిల్లావ్యాప్తంగా సేకరించిన స్వాబ్‌ నమూనాలు రోజుల తరబడి సేకరించిన చోటే ఉండిపోతున్నాయి. కొన్నిసార్లు ఆరు రోజులు దాటుతున్నా అవి కాకినాడకు చేరడం లేదు. దీనికంతటికి ప్రధాన కారణం వాహనాలు నిలిచిపోవడమే. వీటిని తిప్పు తున్న కాంట్రాక్టర్‌కు అయిదు నెలల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో బకాయి లు రూ.30 లక్షల వరకు పేరుకుపోయాయి. అధికారులేమో అసలు పట్టించుకోవడమే మానేశారు. దీంతో చేసేదిలేక సదరు కాంట్రాక్టర్‌ ఇటీవల ఎనిమిది వాహనాలను నిలిపివేశారు. దీంతో శాంపి ళ్లు ఎక్కడికక్కడే ఉండిపోతున్నాయి. మిగిలిన ఎనిమిది వాహనాలకు శాంపిళ్లు సేకరించాల్సిన గ్రామాల సంఖ్య 40 వరకు పెంచేశారు. దీంతో ఇవి కూడా భారం భరించలేక సరిగ్గా తిరగడం లేదు. ఫలితంగా పలు పీహెచ్‌సీల్లో ఇప్పుడు స్వాబ్‌లు సేకరించడం మానేశారు. కష్టపడి తీసుకున్నా తీసుకువెళ్లేవారు లేక ఎందుకొచ్చిందని వైద్యసిబ్బంది ఆ ఊసే మర్చిపోయారు. కాకినాడ, పెద్దాపు రం, కోనసీమ, రాజమహేంద్రవరం డివిజన్ల పరిధిలో పలు చోట్ల శాంపిళ్లు తీసుకున్నా ఫలితాలు రాక జనం స్థానిక వైద్యసిబ్బందిని నిలదీస్తుండడంతో శాంపిళ్లు సేకరించడం నిలిపివేశారు. మరోపక్క శాంపిళ్లు కాకినాడకు తరలించే వాహనాల్లో వైద్యసిబ్బంది కూడా ఒకరిద్దరు ఉండేవారు. ఇప్పుడు ఒక్క డ్రైవర్‌నే కొనసాగిస్తుండడంతో ఆ బాధ్యత సరిగ్గా నిర్వహించడంలేదు. ఏజెన్సీలో అయితే పరిస్థితి మరీ దారుణం. శాంపిళ్లు ఎక్కడికక్కడే వారాల తరబడి పడి ఉం టున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ బాధ్యతా రాహి త్యంతో కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకున్నవారికి ఫలితాలు తెలియడం లేదు. దీంతో కొందరు బయట తిరిగేస్తున్నారు. 

కేసుల కల్లోలం

జిల్లాలో కొవిడ్‌ కేసుల విశ్వరూపం

శుక్రవారం 816 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

మంత్రి వేణుకు మళ్లీ కొవిడ్‌

వీఆర్‌ పురం జడ్పీ హైస్కూళ్లో 8 మంది ఉపాధ్యాయులు, 15 మంది విద్యార్థులకు కూడా

కూనవరం తహశీల్దార్‌కూ కరోనా వైరస్‌

జిల్లాలో కొవిడ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజూ వందల్లో నమోదవుతూ బెంబేలెత్తిస్తున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 816 మందికి పాజిటివ్‌  సోకింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌లు 2,99,987కు చేరుకున్నాయి. వివిధ ఆసుపత్రులు, హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 4,673కు చేరింది. కాగా కాకినాడ జీజీహెచ్‌కు క్రమేపీ బాధితులు పోటెత్తుతున్నారు. వారం రోజుల నుంచి శ్వాస, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఒకరకంగా చెప్పాలంటే రోజుకు 20 మంది వరకు వచ్చి చేరుతున్నారు. శుక్రవారం నాటికి జీజీహెచ్‌లో కొవిడ్‌ బాధితుల సంఖ్య 71కి చేరింది. కాగా మంత్రి వేణుకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఈయనకు వైరస్‌ సోకడం ఇది రెండోసారి. ఇటీవల సంక్రాంతి సంబరాలను భారీ జన సందోహం మధ్య ప్రారంభించారు. ఈనెల 17న కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా నెగిటివ్‌ వచ్చింది. కానీ కేబినెట్‌ సమావేశానికి వెళ్లేందుకు గురువారం మళ్లీ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది.  సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి హాజరైనవారు కంగారుపడాల్సిన అవసరం లేదని, తర్వాత కలిసిన        వారు మాత్రం పరీక్షలు చేయించుకోవాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. అటు వీఆర్‌పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు, 15 మంది విద్యార్థులకు వైరస్‌ సోకింది. ఈ మండలంలో ఒక్కరోజే 44 కేసులు నమోదయ్యాయి. ఎటపాక మండలం గౌరీదేవీపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులకు కొవిడ్‌గా తేలింది. కూనవరం తహశీల్దార్‌ అనసూయకు కూడా కరోనా నిర్ధారణ అయింది. పి.గన్నవరం మండలం కె.ముంజవరంలో ఓ మహిళా ఉపాధ్యాయురాలికి పాజిటివ్‌ సోకింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. తొండంగి మండలం లో 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.



Updated Date - 2022-01-22T06:52:38+05:30 IST