నా నటనకు...రచనకు సంబంధం లేదు!

ABN , First Publish Date - 2021-04-11T05:30:00+05:30 IST

సంపత్‌ రాజ్‌... నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే! అయితే, ఆయనలో రచయిత కూడా ఉన్నారు. గతంలో రెండు లఘు చిత్రాలకు కథ అందించారు

నా నటనకు...రచనకు సంబంధం లేదు!

సంపత్‌ రాజ్‌... నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే! అయితే, ఆయనలో రచయిత కూడా ఉన్నారు. గతంలో రెండు లఘు చిత్రాలకు కథ అందించారు. అందులో ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధం చేశారు. వ్యక్తిగత జీవితంలోకి వెళితే... సింగిల్‌ పేరెంట్‌!  ఆయనకో కుమార్తె. నటన, రచన, అమ్మాయి ఆలనాపాలనా... ‘నవ్య’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంపత్‌ రాజ్‌ పలు విషయాలు పంచుకున్నారు.


  • నేను హాఫ్‌ తెలుగు అనుకోండి! నాన్నది నెల్లూరు అయితే... అమ్మది తమిళనాడులోని ట్రిచీ దగ్గర్లో శ్రీరంగం అనే ఊరు. నేను ఉత్తరప్రదేశ్‌లో జన్మించా. మా పెద్దమ్మ కర్నూలులో ఉంటారు. తిరుపతి, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో నాన్నగారి బంధువులు ఉన్నారు. నాన్న ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలు తిరిగి చివరకు, బెంగళూరులో సెటిలయ్యాం.
  • అమ్మ ఎనిమిది భాషలు మాట్లాడేవారు. అయితే, నాన్నతో తెలుగులోనే  మాట్లాడేవారు. బహుశా... నేను ఇన్ని భాషలు మాట్లాడటానికి కారణం అమ్మ ఏమో!!


మా నాన్నగారిది నెల్లూరు!

మా నాన్న ఆర్మీలో పని చేశారు. ఆయన జన్మించిందీ, చదివిందీ నెల్లూరులో! మరణించేవరకూ తెలుగు పుస్తకాలు, మ్యాగజైన్లు చదివారు. మా ఇంట్లో పెద్ద రూమ్‌ ఉండేది. అందులో చాలా పుస్తకాలు ఉండేవి. బ్రదర్‌, సిస్టర్‌, నేను - మాకు కామన్‌గా ఓ కోడ్‌ ఉండేది. పేజి నెంబర్‌ 24ను మార్క్‌ చేసేవాళ్లం. ఎందుకు 24 ఎంపిక చేసుకున్నామో తెలియదు. కానీ, ఆ నంబర్‌ మార్క్‌ చేసిన పుస్తకం నాన్న చదివేశారని అర్థం. ఓ టైమ్‌కి రూమ్‌లో పుస్తకాలన్నీ నాన్న చదివేశారు. మళ్లీ చదవడం ప్రారంభించారు. అప్పుడు మేం 23 మార్క్‌ చేయడం మొదలుపెట్టాం. సగం పుస్తకాలు మళ్లీ చదివారు. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రీకరణ చేసేటప్పుడు త్రివిక్రమ్‌గారికి ఈ విషయం చెప్పా. ‘సంపత్‌ ఎక్ట్సాడినరీ ఐడియా. నేను వాడుకోవచ్చా?’ అన్నారు. ‘అంతకంటే సంతోషం ఏముంటుందండీ!’ అన్నాను. 


లాక్‌డౌన్‌ మీ జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది?

మార్చిలో తొలి లాక్‌డౌన్‌ ప్రకటించారు. తర్వాత రెండో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు... ఎక్కువ రోజులు కొనసాగేలా కనిపించింది. నా కూతురుతో ‘మనిద్దరం ఎక్కువ రోజులు ఇంట్లోనే ఉండాలి. పనిమనిషి రాదు. మన పని మనమే చేసుకోవాలి. చిన్నప్పట్నుంచీ నా పని చేసుకోవడం అలవాటే. నాకది సమస్య కాదు. అయితే, ఇద్దరం ఇలాగే ఎక్కువ రోజులు ఉంటే గొడవలు వస్తాయి. అందుకని, నువ్వే పని చేస్తావో చెప్పు. నేను మిగతా పనులు నేను చేస్తా’ అని డీల్‌ మాట్లాడుకున్నాం. మీరు నమ్మరు... లాక్‌డౌన్‌కి ముందు కుకింగ్‌ మీద తనకు అంత ఇంట్రెస్ట్‌ లేదు. ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే... చక్కటి భోజనం వండి పెడుతుంది. భవిష్యత్తులో తనకు ఇదొక అడ్వాంటేజ్‌. చదువు కోసం బయట దేశానికి వెళ్లినప్పుడు తన పని తాను చేసుకోవచ్చు. ప్రతి నెగెటివ్‌లోనూ ఓ పాజిటివ్‌ ఉంటుంది కదా! అది ఇదేనేమో!! లాక్‌డౌన్‌లో అమ్మాయితో ఎక్కువ రోజులు టైమ్‌ స్పెండ్‌ చేశా. నటుడిగా పెద్ద బ్రేక్‌ వచ్చిందీ లాక్‌డౌన్‌లోనే.


సింగిల్‌ పేరెంట్‌గా అమ్మాయి బాగోగులు చూసుకుంటున్నారు. ఈ అనుభవం గురించి...

విడాకులు తీసుకున్నాక మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నా కూతురు కస్టడీ నేనే తీసుకున్నా. నా చేతుల్లో వచ్చేటప్పటికి తనకు 4 ఏళ్లు. ఇప్పుడు 22. భార్యాభర్తలు వేరుపడినప్పుడు... తల్లికైనా, తండ్రికైనా బిడ్డల బాగోగులు చూసుకోవడం కొత్త అనుభవమే. అమ్మాయి ఓ వయసుకు వచ్చినప్పుడు అవసరాలు మారతాయి. బయోలాజికల్‌ మార్పులు వస్తాయి కనుక... పేరెంట్స్‌ సహనంతో మెలగాలి. నా కూతురు విషయంలో నేను ఆ సహనం నేర్చుకున్నా. మెడికల్‌ షాప్‌ నుంచి అమ్మాయికి శానిటరీ ప్యాడ్స్‌ కొనడానికి ఎటువంటి ఇబ్బంది పడలేదు. నాకు అది సమస్యగా అనిపించదు. దాని గురించి ముందే చదివేశా. అమ్మాయితోనూ డిస్కస్‌ చేయగలను. మేమిద్దరం స్నేహితుల్లా ఉంటాం. మా మధ్య దాపరికాలు ఉండవు. అమ్మాయిని పెంచి పెద్ద చేసే విషయంలో అన్నావదిన, సోదరి, స్నేహితులు ఎంతో మద్దతుగా నిలిచారు. మా అమ్మాయి సైకాలజీలో డిగ్రీ చేసింది. పీజీ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లడానికి సిద్ధమవుతోంది. నటుడిగా నా బిగ్గెస్ట్‌ క్రిటిక్‌ కూడా తనే. సినిమా చూశాక... నా నటన గురించి విశ్లేషిస్తుంది. ఎలా చేసుంటే బావుంటుందో చెబుతుంది. తనను మెప్పించడం చాలా కష్టం.


మీ సినీ ప్రయాణం ఎలా ఉంది?

బావుంది. నటీనటుల అదృష్టం ఏమిటంటే... నెగెటివ్‌ రోల్స్‌ చేసినా సరే మమ్మల్ని ప్రేక్షకులు ప్రేమిస్తారు. గొప్ప విషయమిది! ఒకవేళ రాజకీయ నాయకులు పనులు సరిగా చేయలేదనుకోండి... జనాలు తిడతారు. తర్వాతి ఎన్నికల్లో ఓటు వేయరు. ఈ సినీ రంగంలో మాత్రమే... ప్రతినాయక పాత్రలో నటించినా, హీరోను కొట్టినా, ఏం చేసినా... పర్ఫార్మెన్‌ బావుంటే ప్రేక్షకులు ప్రేమిస్తారు.


ఓ సినిమా అంగీకరించేటప్పుడు ఏం ఆలోచిస్తారు?

ఇంతకు ముందు చేసిన పాత్రలతో పోలిస్తే... కొత్త చిత్రంలో నా పాత్ర వైవిధ్యంగా ఉందా? లేదా? అనేది చూస్తా. ఉదాహరణకు... కొన్ని చిత్రాల్లో పోలీ్‌సగా చేశా. మళ్లీ కొత్తగా ఓ పోలీస్‌ రోల్‌ వస్తే... రెగ్యులర్‌గా ఉంటే చేయను. అందులో ఏదో వైవిధ్యం ఉండాలి. గతంలో పోలీ్‌సగా, హీరోయిన్‌ తండ్రిగా కొన్ని చిత్రాలు చేశా. ‘భీష్మ’లోనూ నాది పోలీస్‌ పాత్రే. కాకపోతే , హీరోయిన్‌ తండ్రి వేషం. అందుకే  నాకో కొత్త ఇమేజ్‌ తీసుకొచ్చింది. కామెడీ చేస్తానని మంచి పేరొచ్చింది కదా!


చిత్రీకరణ చేసేటప్పుడు ఎలా చేశానోనని ఆలోచిస్తుంటారా? మానిటర్‌ చూసుకొనే అలవాటు ఉందా?

లేదు. నేను ఎక్కువగా మానిటర్‌ చూడను. దర్శకుడు ‘ఓకే’ అంటే చాలు! అయిపోయినట్టే. షాట్‌ చూసి మళ్లీ చేద్దామా? వద్దా? అనేది కెప్టెన్‌ ఆఫ్‌ ద షిప్‌ పని. నా పని  దర్శకుణ్ణి కన్విన్స్‌  చేయడమే. నటుడిగా... ఎలా చేశామో తెలుస్తుంది. ఒక్కోసారి ‘వన్‌ మోర్‌’ అడగాలని అనిపిస్తుంది. దర్శకుడూ ‘వన్‌ మోర్‌’ అడిగితే, అతనిదీ అభిప్రాయం అయితే... మేం ఏకాభిప్రాయంతో ఉన్నట్టే. తర్వాత నుంచి దర్శకుడు ఎలా నటించాలని ఆశిస్తున్నారో తెలుస్తుంది. అలా చేస్తే మానిటర్‌ చూసుకోవాల్సిన అవసరం ఉండదు.


మీరు రచయిత కూడా! ప్రస్తుతం కథలు రాస్తున్నారా?

రాస్తున్నా. అందుకోసమే, ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నా. చిన్న ప్రొడక్షన్‌ హౌస్‌ ఉంది. అందులో క్రియేటివ్‌ వర్క్స్‌ చేస్తాం. ఎక్కువగా స్ర్కిప్ట్స్‌ రాస్తుంటాం. ఐదు స్ర్కిప్ట్స్‌ సిద్ధం రాశాం. ఒకటి ఓటీటీ కోసం, మరొకటి ఫీచర్‌ ఫిల్మ్‌గా తీయాలని సన్నాహాలు చేస్తున్నాం. బహుశా.... ఈ ఏడాది రెండూ సెట్స్‌కు వెళ్తాయని ఆశిస్తున్నా. ‘వ్యూ తమిళ్‌’ కోసం ‘మాషా అల్లా గణేశా’ షార్ట్‌ ఫిల్మ్‌ రాశా. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. కథాంశం ఏంటంటే... ముంబైలోని ధారావి వంటి ఏరియాలో మతఘర్షణలు జరిగితే ఓ ముస్లిం కుటుంబం గర్భగుడిలో తల దాచుకుంటుంది. పిల్లలకు ఆకలి వేస్తే... ప్రసాదం, నీళ్లు ఇవ్వొచ్చా? లేదా? - పెద్దలు పడే ఆ మానసిక సంఘర్షణే ‘మాషా అల్లా గణేశా’. తర్వాత లైంగిక వేధింపులపై మూడు నిమిషాల ఫిల్మ్‌ తీశా. నేనే దర్శకత్వం వహించా. అందులో నటించిన వారందరూ నా స్నేహితులే.


మీ నటన, రచన... రెండూ భిన్నమైన కోణాల్లో ఉన్నాయి!

అవును. నటుడిగా నేను చేసేదానికీ, రచయితగా రాసేదానికీ అసలు సంబంధం లేదు. రెండూ వేర్వేరు కోణాల్లో ఉంటాయి. మేం రాసిన ఐదు కథల్లో ఓ కథలో... ఒక్క ఫైట్‌ లేకుండా ఓ స్ర్కిప్ట్‌ రాశా. ఆ కథకు ఫైట్స్‌ అవసరం లేదనిపించింది. నా జీవితంలో ఎవరిపై ఎటువంటి పగ లేదు. ఎవరినీ కొట్టలేదు. నన్ను ఎవరూ కొట్టలేదు. ఈ విధంగా ఎంతోమంది జీవితాలు ఉంటాయి కదా! అటువంటి కథే అది.


త్వరలో దర్శకుడిగా మారే అవకాశం ఉందా?

లేదు. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సుమారు 20 ఏళ్లుగా నటిస్తున్నాం కాబట్టి డైరెక్షన్‌ వస్తుందని నమ్మితే... ఫూల్‌ అవుతా. డైరెక్షన్‌ అనేది  పెద్ద ఫీల్డ్‌. ఎక్స్‌ప్రెషన్స్‌ క్యాప్చర్‌ చేయడం కాదు. ఏ ఎమోషన్‌ ఎంత ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఎలా చూపించాలి? సంగీతం ఎలా ఉండాలి? - 24 శాఖలపై అవగాహన ఉండాలి. ఒకవేళ దర్శకత్వం వైపు అడుగులు వేయాలంటే... కనీసం రెండు మూడు సినిమాలకు సహ దర్శకుడిగా పని చేయాలి.   అన్ని డిపార్ట్‌మెంట్స్‌తో పని చేస్తే ఒక ఐడియా వస్తుంది. అడ్వర్టైజింగ్‌ నేపథ్యం నుంచి సినిమాలకొచ్చా. 14 ఏళ్లు యాడ్స్‌ రాయడం, కాపీలు రాశా. అందువల్ల రచనలో అనుభవం ఉంది. కథలు రాస్తున్నా.


మీ డ్రీమ్‌ రోల్‌?

నాకు 90 ఏళ్లు వచ్చేవరకూ ఉంటానో? లేదో? తెలియదు. ఇప్పుడు 52 ఏళ్లు. ఓ 80 ఏళ్లు వయసున్న పాత్ర చేయాలని ఉంది. రూపురేఖల నుంచి నడక, నడవడిక... క్యారెక్టర్‌ ఆర్క్‌ ఉంటుంది కదా! అటువంటి పాత్ర పోషించడం, సవాళ్లు స్వీకరించడం నాకిష్టం. రోజువారీ జీవితంలో ఉన్నట్టు కాకుండా కొత్తగా ఇంకా ఏదైనా చేయాలి. నాలోని సంపత్‌ బయటకొచ్చి వేరే వ్యక్తిలా చేయాలి. పదేళ్ల క్రితం తమిళ చిత్రం ‘గోవా’లో ‘గే’ రోల్‌ చేశా. తమిళ చిత్ర పరిశ్రమకు అదొక షాక్‌. ఆ పాత్ర చేస్తానని ఎవరూ ఊహించలేదు. అవకాశం వస్తే వైవిధ్యమైన పాత్రలు చేయడానికి నేను సిద్ధమే. ప్రయోగాలకు వెనుకాడను. 

సత్య పులగం

Updated Date - 2021-04-11T05:30:00+05:30 IST