సమ్మక్క బ్యారేజీ సిద్ధం

ABN , First Publish Date - 2021-06-24T05:23:32+05:30 IST

దేవాదుల ఎత్తపోతల ప్రాజెక్టుకు గోదావరిలో బ్యాక్‌ వాటర్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ పనులు పూర్తి కావస్తున్నాయి. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 6.21లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా ఈ బ్యారేజీని చేపట్టారు. దీని నిర్మాణంతో దేవాదుల లిఫ్ట్‌లకు నీటితో పాటు 240 మెగావాట్ల జల విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయనున్నారు. అంతేకాకుండా ఈ బ్యారేజీపై నుంచి నిర్మించిన వంతెనతో ఛత్తీ్‌సగఢ్‌ రాష్ర్టానికి రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ బ్యారేజీ వారం, పదిరోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

సమ్మక్క బ్యారేజీ సిద్ధం
తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజీ, ఛత్తీ్‌సగఢ్‌ వైపు పీయర్స్‌ వద్ద జరుగుతున్న పనులు

పూర్తయిన 60 పీయర్స్‌, 59గేట్ల నిర్మాణం
ఛత్తీ్‌సగఢ్‌ వైపు ఐదు పీయర్స్‌కు జరుగుతున్న రోప్‌ అటాచ్‌మెంట్‌
కొనసాగుతున్న అప్‌డౌన్‌ స్ట్రీమ్‌ పనులు
త్వరలోనే అందుబాటులోకి రానున్న తుపాకులగూడెం బ్యారేజీ
దేవాదుల లిఫ్టులకు పెరగనున్న 6.94 టీఎంసీల బ్యాక్‌ వాటర్‌
11 జిల్లాల పరిధిలోని 6.21లక్షల ఎకరాలకు సాగునీరు అందించటమే సర్కారు లక్ష్యం
240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి హైడ్రో ఎలక్ర్టిక్‌ పనులు మొదలు


దేవాదుల ఎత్తపోతల ప్రాజెక్టుకు గోదావరిలో బ్యాక్‌ వాటర్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ పనులు పూర్తి కావస్తున్నాయి. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 6.21లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన దేవాదుల ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా ఈ బ్యారేజీని చేపట్టారు. దీని నిర్మాణంతో దేవాదుల లిఫ్ట్‌లకు నీటితో పాటు 240 మెగావాట్ల జల విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయనున్నారు. అంతేకాకుండా ఈ బ్యారేజీపై నుంచి నిర్మించిన వంతెనతో ఛత్తీ్‌సగఢ్‌ రాష్ర్టానికి రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ బ్యారేజీ వారం, పదిరోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.  

ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల వద్ద 2003లో జె.చొక్కారావు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. కరువు పీడత ప్రాంతాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో మూడు విడతల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని రూపకల్పన చేశారు. ప్రాజెక్టు పూర్తిచేసి 170రోజుల్లో  38.182 టీఎంసీలను లిఫ్ట్‌ చేయాలని, ఇందులో 2.842 టీఎంసీలు వరంగల్‌ నగరానికి తాగునీటికి కేటాయించాలని నిర్ణయించారు. మిగిలిన 35.34 టీఎంసీల నీటిని 6.21 లక్షల ఎకరాలకు సాగుకు మళ్లించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే సుమారు 17 ఏళ్లు కావస్తున్నా ఇంకా మూడో దశ పనులు పూర్తి కాలేదు. ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా కనీసం 100 రోజులు కూడా నీళ్లు లభించటం లేదు. అత్యధికంగా ఇప్పటి వరకు 27టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్‌ చేశారు. దీంతో గోదావరి జలాలు దిగువకు వృథాగా వెళ్లకుండా తుపాకులగూడెం వద్ద గోదావరిపై వంతెన నిర్మాణం చేపట్టి, బ్యాక్‌ వాటర్‌ను దేవాదులతో లిఫ్ట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యారేజీ పూర్తయితే 267 రోజులు నీటిని లిఫ్ట్‌ చేస్తూ 6.21లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో తుపాకులగూడెం బ్యారేజీ పనులను వేగవంతం చేసింది.

రూ.1,624 కోట్లు... 6.94 టీఎంసీల నీళ్లు
2017 ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ బ్యారేజీ పనులకు మొదటి నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. భూసేకరణ నుంచి కరోనా వరకు బ్యారేజీ పనులకు అడ్డుగా మారాయి. తుపాకులగూడెం నుంచి ఛత్తీ్‌సగఢ్‌  సరిహద్దు వరకు గోదావరిలో 83 మీటర్ల ఎత్తు, 1,132 మీటర్ల పొడువు, 10 మీటర్ల వెడల్పుతో బ్యారేజీతో పాటు వంతెన నిర్మాణం చేశారు. మొత్తం 60 పీయర్స్‌, 59 రేడియల్‌ గేట్లను నిర్మించారు. 2020 ఫిబ్రవరి వరకే పనులు పూర్తి కావాల్సి ఉండగా, కరోనా ఉధృతం కావడంతో పాటు ఛత్తీ్‌సగఢ్‌ వైపు ఆ రాష్ట్ర పరిధిలో నిర్మించే ఐదు పీయర్స్‌కు అడవి శాఖ నుంచి అనుమతులు ఆలస్యమయ్యాయి.  మార్చి నుంచి ఈ ఐదు పీయర్స్‌కు గేట్లు బిగింపు పనులు చేపట్టి, రోప్‌ అటాచ్‌మెంట్‌ పనులు చేస్తున్నారు. స్టోన్‌ ఫిక్సింగ్‌ పనులు దాదాపు పూర్తయినట్టు అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఈ బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,624 కోట్లను ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలోని 36 మండలాలకు దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించనున్నారు.

ఇటీవల కొత్తగా ములుగు, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాల్లో ఉన్న సుమారు 8వేల ఎకరాల ఆయకట్టును స్థీరికరించారు. రామప్ప నుంచి లక్నవరం, గణపసముద్రం, పాకాల, రంగనాయక ప్రాజెక్టుల్లోకి గోదావరి జలాలను మళ్లిస్తున్నారు. బ్యారేజీకి సంబంధించి 98శాతం పనులు ఇప్పటి వరకు పూర్తి చేశారు. ప్రస్తుతం ఫినిషింగ్‌  పనులు చేపట్టారు. కరకట్ట మరమ్మతులు, ఛత్తీ్‌సగఢ్‌ వైపు ఐదు పీయర్స్‌కు అటాచ్‌మెంట్‌ పనులు, బ్యారేజీ వాల్స్‌కు కలరింగ్‌, అప్‌ అండ్‌ డౌన్‌ స్ర్టీమ్‌ లాంటి పనులు జరుగుతున్నాయి. ఈ నెలఖారులోగా లేదా జూలై మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. స్వయంగా కేసీఆర్‌ ఈ బ్యారేజీని ప్రారంభిస్తారని సమాచారం. దీంతో మిగిలిన చిన్నాచితక పనులను కూడా పూర్తి చేసేందుకు అధికారులు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆనకట్టలో నీటిని నిల్వ చేసి ఈ ఖరీ్‌ఫలో దేవాదుల ద్వారా ఎత్తిపోసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

తుపాకులగూడెం బ్యారేజీ వద్ద నీటి నిల్వతో పాటు 240 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు రూ.4 వందల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వర్షాకాలంలో గోదావరిలో వృథాగా వెళ్లే జలాలతో ఈ బ్యారేజీ వద్ద జల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తుపాకులగూడెం గ్రామం వైపు తొమ్మిది పీయర్స్‌తో విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించిన పనులు చేపట్టారు. విద్యుత్‌ను తయారు చేయటంతో పాటు కాల్వ ద్వారా నీటిని లిఫ్ట్‌ చేసేలా పనులు చేట్టారు. జెన్‌కో అధికారులు వచ్చే ఏడాదిలో ఇక్కడి నుంచి పవర్‌ ఉత్పత్తి పనులు పూర్తయ్యేలా పనులు చేస్తున్నారు. అలాగే బ్యారేజీతో పాటు వంతెన నిర్మాణం కూడా పూర్తి చేశారు. తుపాకులగూడెం బ్యారేజీ నుంచి ఛత్తీ్‌సగఢ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్‌ టు భూపాలపట్నం జాతీయ రహదారి 163కు ఈ బ్యారేజీపై నుంచి వెళ్లే దారి అనుసంధానం అవుతుంది. అయితే నక్సల్స్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావటంతో ఈ బ్యారేజీ దారిని ఛత్తీ్‌సగఢ్‌ వైపు ఇంకా అనుసంధానం చేయలేదు. అక్కడి పోలీసులు, అటవీ శాఖ అధికారుల అనుమతుల వస్తే 163 జాతీయ రహదారికి ఈ వంతెన దారి అనుసంధానం కానుంది. దీంతో సమ్మక్క బ్యారేజీ నీటిని నిల్వ చేసేందుకే కాకుండా బహుళార్థక ప్రాజెక్టుగా నిర్మాణం చేస్తున్నారు. కాగా, తుపాకులగూడెం బ్యారేజీ పనులన్నీ పూర్తి కావచ్చాయని, చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయని, త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామని ములుగు జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ జగదీశ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు.

Updated Date - 2021-06-24T05:23:32+05:30 IST