బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల రెండో తేదీన ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్లో జరుగుతున్న రేవ్ పార్టీపై దాడి చేసిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యన్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్నుంచి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కూడా లైమ్‌లైట్‌లో ఉంటున్నారు. తాజాగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కూడా సమీర్ వాంఖడేపై విమర్శలు చేశారు.
తాజాగా ఓ వెబ్సైట్ సమీర్ భార్య, మాజీ నటి క్రాంతి వాంఖడేపై ఓ కథనం ప్రచురించింది. `మీకు తెలుసా? సమీర్ వాంఖడే భార్య గతంలో అజయ్ దేవ్‌గణ్‌తో ఓ సినిమాలో నటించింది. అలాగే గతంలో బయటపడిన ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూడా నిందితురాలు` అని ఓ కథనం ప్రచురించింది. దీనిపై క్రాంతి ఫైర్ అయ్యారు. ఆ వెబ్‌సైట్‌కు ట్విటర్ ద్వారా సమాధానం ఇచ్చారు. `మీరు ఏం చేస్తున్నారు? కొన్ని వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు హెడ్డింగ్‌లు పెడతారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ కేసులో నేను కోర్టుకు వెళ్లి పోరాడి గెలుపొందాను. వార్తలో వేరే విధంగా రాసి హెడ్డింగ్ ఇలా ఎందుకు పెట్టారు? నా పరువు, సమీర్ పరువు తీయాలనుకుంటున్నారా? లేదా డబ్బు కోసం ఇలా చేస్తున్నారా` అంటూ ట్వీట్ చేశారు.