‘గోదావరి’లోనూ అదే సీను!

ABN , First Publish Date - 2020-06-06T09:47:15+05:30 IST

గోదావరి బోర్డు సమావేశంలోనూ గురువారం నాటి దృశ్యమే పునరావృతమైంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సమర్థించుకోవడానికి ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగాన్ని ఉపయోగించుకున్న తెలంగాణ ప్రభుత్వం..

‘గోదావరి’లోనూ అదే సీను!

  • మాజీ సీఎం కిరణ్‌ ప్రసంగాన్ని ప్రస్తావించిన తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర అభ్యంతరం...
  • నిలదీసిన ప్రత్యేక సీఎస్‌, ఈఎన్‌సీ


అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి బోర్డు సమావేశంలోనూ గురువారం నాటి దృశ్యమే పునరావృతమైంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సమర్థించుకోవడానికి ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగాన్ని ఉపయోగించుకున్న తెలంగాణ ప్రభుత్వం.. శుక్రవారం మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించింది. దీనిపై ఏపీ తీవ్రఅభ్యంతరం వ్యక్తంచేసింది. గోదావరి జలాల్లో 967 టీఎంసీలు తెలంగాణకు దక్కుతుందని అప్పట్లో శాసనసభలో కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో వివరించడాన్ని వ్యతిరేకించింది. సభలో చేసిన ప్రసంగాలను గోదావరి బోర్డు సర్వసభ్య సమావేశంలోకి తీసుకొచ్చి.. వాటిని ట్రైబ్యునల్‌ ఆదేశాలుగా చెప్పడం ఏమిటని ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ నారాయణరెడ్డి ఆక్షేపించారు. సాంకేతికంగా ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు నడచుకోవాల్సి ఉండగా.. రాజకీయ నేతల ప్రసంగాలను ఆధారాలుగా చూపడం ఏమిటని నిలదీశారు. ట్రైబ్యునల్‌ ఆదేశాలు, నీటి కేటాయింపులు, వినియోగంపై తాము ఆధారాలతో మాట్లాడుతుంటే.. ప్రసంగాలను ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో ముందుగా తెలంగాణ తన వాదన వినిపించింది. కాళేశ్వరం సహా.. గోదావరిపై తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ పాతవేనని పేర్కొంది.


రీడిజైన్‌  చేసినంత మాత్రాన కొత్తవి కావని.. గోదావరి జలాల్లో తమకు 967 టీఎంసీల వాటా ఉందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో ముంపు ప్రమాదం ఉందని వాదించింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌తో ముప్పే మీ లేదని కేంద్ర జలసంఘం, పలు సాంకేతిక పరీక్షలు, నిపుణులు తేల్చినట్లు ఏపీ గుర్తుచేసింది. అయినా ఈ అంశంపై  మాట్లాడేందుకు జీఆర్‌ఎంబీ వేదిక కాదని.. దీనిపై కేంద్రజలశక్తి శాఖ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసిం ది. పట్టిసీమ ద్వారా 90టీఎంసీల గోదావరి జలాలు కృష్ణానదిలోకి మళ్లించినందున.. గోదావరి ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు 45టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణకు ఇవ్వాలన్న ఆ రాష్ట్ర వాదననూ ఆంధ్ర తోసిపుచ్చింది. దిగువ రాష్ట్రానికే 45టీఎంసీలు దక్కుతాయని ట్రైబ్యునల్‌ పేర్కొందని.. వాటిపై పూర్తి హక్కు తమకే ఉంటుందని స్పష్టం చేసింది. నీటి హక్కులపై ట్రైబ్యునల్‌లో తేల్చుకోవాలని.. బోర్డు సమావేశంలో కాదని తేల్చిచెప్పింది.

Updated Date - 2020-06-06T09:47:15+05:30 IST