దర్శిలో అదే రగడ!

ABN , First Publish Date - 2022-05-25T05:26:48+05:30 IST

ఒంగోలు సమీపంలోగల దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కుటుంబానికి ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజిలో జనసేన జెండాలు పెట్టి పవన్‌ కళ్యాణ్‌ అనుకూల నినాదాలు చేసిన విద్యార్థులపై యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తొమ్మిది మందిని వివిధ కారణాలు చూపి కాలేజి నుంచి సస్పెండ్‌ చేసింది. ఇదేసమయంలో నియోజకవర్గంలో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే వేణుగోపాల్‌కు ఈ వ్యవహారంలో సస్పెండైన విద్యార్థుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇది ఘర్షణకు దారితీసింది.

దర్శిలో అదే రగడ!

జనసేన జెండాలు పట్టిన విద్యార్థుల సస్పెన్షన్‌ 

బొట్లపాలెంలో ఘర్షణకు అదే కారణం 

బూచేపల్లికి పరోక్షంగా హెచ్చరిక చేసిన మద్దిశెట్టి 

   

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఒంగోలు సమీపంలోగల దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కుటుంబానికి ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజిలో జనసేన జెండాలు పెట్టి పవన్‌ కళ్యాణ్‌ అనుకూల నినాదాలు చేసిన  విద్యార్థులపై యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తొమ్మిది మందిని వివిధ కారణాలు చూపి కాలేజి నుంచి సస్పెండ్‌ చేసింది. ఇదేసమయంలో నియోజకవర్గంలో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే వేణుగోపాల్‌కు ఈ వ్యవహారంలో సస్పెండైన విద్యార్థుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇది ఘర్షణకు దారితీసింది. దీంతో మంగళవారం రాత్రి దర్శి మండలం బొట్లపాలెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత శనివారం వేణుగోపాల్‌ కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్‌ కాలేజిలో వార్షికోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు జనసేన జెండాలను ఊపుతూ సీఎం జగన్‌రెడ్డి వ్యతిరేక, పవన్‌కళ్యాణ్‌ అనుకూల నినాదాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దర్శి నియోజకవర్గంలో ఇటు వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి అనుచరుల మధ్య వివాదాలు కేసుల దాకా వెళ్లాయి. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం తొమ్మిది మంది విద్యార్థులను సస్పెండ్‌ చేసింది. వారంతా సీఎం వ్యతిరేక నినాదాలు ఇవ్వడంలో ముందున్న వారేనని తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించారన్న నెపం, కళాశాల ఫీజు చెల్లించలేదనే కారణాలతో వారిని సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనేందుకు బొట్లపాలెం వెళ్లిన సందర్భంగా ఈ అంశం రచ్చకెక్కింది. ఆ గ్రామానికి చెందిన విద్యార్థి సంగటి కృష్ణారెడ్డి యాజమాన్యం సస్పెండ్‌ చేసిన విద్యార్థులలో ఒకరు. అదే విషయంపై ఎమ్మెల్యేను ప్రశ్నించేందుకు అతను కార్యక్రమం వద్దకు వచ్చారు. ఆ సందర్భంగా కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే అనుచరులు ఖండిస్తూ అతనిపై దాడి చేశారు. దీంతో అతని తండ్రి కోటిరెడ్డి అక్కడకు వచ్చి ‘నా కుమారుడిని ఎలా కొడతారు, నేనూ వైసీపీ నాయకుడినే కదా’ అని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. తాత్కాలికంగా ఎమ్మెల్యే ఆయనకు సర్థిచెప్పి కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లారు. అనంతరం గ్రామంలో వైసీపీలోని ఇరువర్గాలకు చెందిన యువకులు ఘర్షణకు దిగటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 


నా కుటుంబ సంస్థలను దెబ్బతీసే యత్నం

ఇదిలా ఉండగా సోమవారం రాత్రి ఒక గ్రామంలో జరిగిన ఉత్సవాల కార్యక్రమంలో ప్రసంగించిన ఎమ్మెల్యే పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిని హెచ్చరిస్తూ మాట్లాడటం చర్చనీయాంశమైంది. ‘2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్‌కు అవసరమైనప్పుడు నేను అండగా ఉన్నా. అప్పట్లో పోటీకి చాలామంది ముందుకు రాలేదు. జగన్‌ పిలవగానే నేను ముందుకొచ్చి పోటీచేసి గెలుపొందా. ప్రస్తుతం నన్ను, నా కుటుంబానికి సంబంధించిన సంస్థలను దెబ్బతీసే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. వారి కుయుక్తులకు నేను భయపడను, నేను దేనికైనా సిద్ధం’ అంటూ హెచ్చరించారు. ఇదంతా తాజాగా కాలేజీలో జరిగిన ఘటన, ఆ తర్వాత దర్శిలో వేణుగోపాల్‌ అనుచరులు పెట్టిన కేసు, దానిని నిరసిస్తూ ఆందోళన చేయటమే గాక బూచేపల్లి వర్గీయులు ప్రత్యామ్నాయ కేసు పెట్టడం, ఈ వ్యవహారం మొత్తం అధిష్ఠానం దృష్టికెళ్లి వివరణ అడగటం తదితర పరిణామాల మధ్య వేణుగోపాల్‌ చేసిన ప్రసంగం నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులే ఆసక్తిగా చర్చించుకోవటం విశేషం. 

 

Updated Date - 2022-05-25T05:26:48+05:30 IST