యాధృచ్ఛికమా.. కాపీ కొట్టారా? 2 రాష్ట్రాల్లో ఒకే ప్రశ్నపత్రం!

ABN , First Publish Date - 2022-05-13T16:27:49+05:30 IST

ఒకే పరీక్ష.. రెండు రాష్ట్రాలు.. ఒకే ప్రశ్నపత్రం ఇస్తే ఏమనుకోవాలి? కాపీ కొట్టారని కొందరు విద్యార్థులు అనుమానిస్తుండగా.. మరికొందరు యాదృచ్ఛికం అయ్యింటుందిలే అని సరిపెట్టుకుంటున్నారు. దీనిపై వర్సిటీ అధికారులు మాత్రం నోరుమెదపడం..

యాధృచ్ఛికమా.. కాపీ కొట్టారా? 2 రాష్ట్రాల్లో ఒకే ప్రశ్నపత్రం!

అనస్థీషియాకు కర్ణాటక, ఏపీల్లో ఒకే ప్రశ్నపత్రం


అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): ఒకే పరీక్ష.. రెండు రాష్ట్రాలు(Two states).. ఒకే ప్రశ్నపత్రం ఇస్తే ఏమనుకోవాలి? కాపీ కొట్టారని కొందరు విద్యార్థులు అనుమానిస్తుండగా.. మరికొందరు యాదృచ్ఛికం అయ్యింటుందిలే అని సరిపెట్టుకుంటున్నారు. దీనిపై వర్సిటీ అధికారులు మాత్రం నోరుమెదపడం లేదు. కర్ణాటకలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(Rajiv Gandhi University of Health Sciences) ఆ రాష్ట్రంలోని పీజీ వైద్య విద్యార్థులకు అనస్థీషియా పేపర్‌-1 పరీక్ష నిర్వహించింది. ఏపీలో కూడా గురువారం ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అనస్థీషియా పేపర్‌-1(NTR Health Varsity Anesthesia Paper-1) పరీక్ష నిర్వహించింది. రెండు రాష్ర్టాల్లోని విద్యార్థులకు ఒకే రకమైన ప్రశ్నపత్రం అందించినట్లు కొంతమంది వైద్య విద్యార్థులు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. కర్ణాటకలో ఈ నెల 7న అనస్థీషియా పరీక్ష జరగ్గా.. ఏపీలో గురువారం జరిగింది. అయితే అక్కడ ఇచ్చిన ప్రశ్నపత్రంలోని ప్రశ్నలే.. మన రాష్ట్రంలో జరిగిన ప్రశ్నపత్రంలోనూ ఉన్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేక కర్ణాటక పేపర్‌ను కాపీ కొట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు చేస్తేగానీ అసలు విషయం బయటకు వచ్చే పరిస్థితి లేదు. 

Read more