అక్కడి వారే ఇక్కడ!

ABN , First Publish Date - 2020-11-30T06:08:48+05:30 IST

పుష్కర ఘాట్లలో పారిశుధ్య కార్మికుల కేటాయింపుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అక్కడి వారే ఇక్కడ!
గ్లౌజులు, బూట్లు లేకుండానే విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు

  1. పారిశుధ్య కార్మికుల కేటాయింపులో ఆరోపణలు
  2. ఉదయం కేఎంసీ.. మధ్యాహ్నం ఘాట్‌ పనులు
  3. గుర్తింపు కార్డుల్లేవు.. షూస్‌, గ్లౌజ్‌లూ ఇవ్వలేదు
  4. వలంటీర్ల గైర్హాజరుపై కలెక్టర్‌కు ఫిర్యాదులు 


కర్నూలు, ఆంధ్రజ్యోతి: పుష్కర ఘాట్లలో పారిశుధ్య కార్మికుల కేటాయింపుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు గ్రౌండ్‌లో పనిచేస్తున్న వారిని, కార్పొరేషన్‌ విధుల్లో ఉన్న వారినే మధ్యాహ్నం నుంచి ఘాట్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పుష్కరాల కోసం కేఎంసీకి రూ.30 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.80 లక్షలు పారిశుధ్య కార్మికుల సౌకర్యాలకు, రూ. 40 లక్షలు కార్మికుల వేతనాలకు  కార్పొరేషన్‌ కేటాయించింది. 400 మంది తాత్కాలిక కార్మికులకుగాను సంకల్బాగ్‌ ఘాట్లో 60 మంది(రెండు షిఫ్టులు), మిగిలిన వారిని రెండు షిఫ్టుల్లో తక్కిన 7 ఘాట్లలో నియమించామని కేఎంసీ ఇంజనీరింగ్‌ శాఖాధికారులు చెబుతున్నారు. వీరిలో చాలామంది విధులకు కాకున్నా రికార్డుల్లో మాత్రం హాజరు వేస్తున్నట్లు సమాచారం. ఉదయం, సాయంత్రం కేఎంసీలో విధులు నిర్వహించాల్సిన సిబ్బందిని మధ్యాహ్నం నుంచి ఘాట్లకు తరలిస్తున్నారు. శ్రీను అనే కాంట్రాక్టర్‌ ఆధ్వర్యంలో తామంతా పోలీస్‌ గ్రౌండ్స్‌లో పనిచేస్తున్నామని, మధ్యాహ్నం నుంచి ఘాట్లకు తీసుకుని వస్తున్నా రని కార్మికులు చెబుతున్నారు. కానీ అక్కడి బాధ్యులు మాత్రం అదేమీ లేదని, అందరూ తాత్కాలిక ఉద్యోగులేనని అంటున్నారు. 


వలంటీర్లు ఎక్కడ?

కర్నూలు పరిధిలోని 8 ఘాట్లలో రెండు షిఫ్టుల్లో 30 మంది వార్డు వలంటీర్లను కేఎంసీ నియమించింది. ఒక్కో షిఫ్టునకు పది మంది కూడా అందుబాటులో లేరు. భక్తులు తక్కువగా ఉన్నారన్న కారణంతో వారిలో చాలామందిని కొందరు అధికారులు వెనక్కు పిలిపించేశారు. ఫలితంగా వలంటీర్లు చేయాల్సిన పనులను కూడా ఘాట్‌ ఇన్‌చార్జులు, పోలీసులే చూసుకోవాల్సి వస్తోంది. రెండ్రోజుల క్రితమే ఓ ఘాట్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన  అధికారులతో మాట్లాడి వలంటీర్లను వెనక్కు పిలిపించారు. అలా వచ్చిన వలంటీర్లు మరుసటి రోజు నుంచే ఘాట్ల మొహం చూడటం కూడా మానేశారు. 


ఒక జతే గ్లౌజులు.. కొందరికే బూట్లు

పుష్కరాల ప్రారంభం రోజున జత కాటన్‌ గ్లౌజులు అందించారు. ఒక్కసారి వాడిన తర్వాత ఘాట్ల వద్దే కార్మికులు పారేశారు. మరో జత గ్లౌజులు కార్పొరేషన్‌ ఇవ్వలేకపోయింది. కేఎంసీ కార్మికుల కోసం కేవలం 160 గన్‌ బూట్లను కొనుగోలు చేసింది. వాటిని కొద్దిమందికే ఇచ్చింది. దీంతో మిగతా వారు సాధారణ చెప్పులతోనే పనిచేస్తున్నారు. ఫలితంగా కాళ్లకు పుళ్లు పడుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పోలీస్‌ గ్రౌండ్లో పనిచేసే కేఎంసీ కాంట్రాక్టు ఉద్యోగుల్నే మధ్యాహ్నం నగరేశ్వరస్వామి ఘాట్లో విధులకు కేటాయిస్తున్నారు.

 

పుష్కరాల్లో పనిచేస్తున్న కార్మికులకు షిఫ్టునకు రూ.450 కేఎంసీ కేటాయించింది. కేఎంసీ 88 మందిని తీసుకుని వారిని రెండు షిప్టుల్లో రాఘవేంద్ర, రాంభొట్ల దేవాలయ ఘాట్‌లో  పనిచేయిస్తోంది. రూ.250 చొప్పున ఇస్తోంది. వీరికి గుర్తింపు కార్డుల్లేవు. 


రాఘవేంద్ర స్వామి మఠం వద్ద పనిచేసేందుకు షిఫ్టునకు 12 మంది చొప్పున రెండు షిఫ్టులకు 24 మంది వార్డు వలంటీర్లను కేటాయించారు. ఉదయం, మధ్యాహ్నం కలిపి 12 మంది కూడా హాజరు కావడంలేదు. దీనిపై ఇటీవలే కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి.

Updated Date - 2020-11-30T06:08:48+05:30 IST