అదే ఉత్సాహం.. అదే ఊపు

ABN , First Publish Date - 2021-12-06T07:38:59+05:30 IST

అదే ఉత్సాహం.. అదే ఊపు

అదే ఉత్సాహం.. అదే ఊపు

మహా పాదయాత్రకు నీరా‘జనం’

హారతులు.. పూలతో గ్రామాల్లో ఘన స్వాగతం

రైతులకు సీబీఐ మాజీ జేడీ సంఘీభావం

కొనసాగుతున్న సర్కారు అక్రమ కేసుల పర్వం


నెల్లూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): అదే ఉత్సాహం.. అదే ఊపుతో నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. ఊరూరా ప్రజలు రైతులకు ఎదురెళ్లి హారతులు పడుతూ పూలవర్షం కురిపిస్తున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతుల మహాపాదయాత్ర 35 వరోజు ఆదివారం నెల్లూరు జిల్లాలో 13కి.మీ. సాగింది. గూడూరు రూరల్‌ మండలం పుట్టంరా జువారికండ్రిగ నుంచి ఉదయం 9.30గంటలకు పూజల అనంతరం పాదయాత్ర మొదలైంది. అక్కడి నుంచి రైతులు వెంకటగిరి నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. మధ్యా హ్నం బాలాయపల్లిలో భోజనం చేసి సాయంత్రానికి వెంగమాంబాపురానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బసచేశారు. ఈ మార్గమధ్యంలోని గొల్లపల్లి, వెంకటరెడ్డిపల్లి, నిండలి రోడ్డు, అంబలపూడి, కిట్టురోడ్డు, బాలాయపల్లి, రామాపురం రోడ్డు, యాచవరం, కయ్యూరురోడ్డు, పచ్చారుచేను, వెంగమాంబాపురం గ్రామాల వద్ద ప్రజలు రైతులకు ఘనస్వాగతం పలికారు. వెంకటగిరి నియోజకవర్గంలోకి అడుగుపెట్టగానే మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున మహిళలు రైతులపై పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. బీజేపీ నేతలు కూడా రైతులకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. బాలాయపల్లి వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర రైతులతో కలిసి నడిచి తన సంఘీభావాన్ని తెలియజేశారు. ఆదివారం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రైతులకు మద్దతు తెలుపుతూ వారితో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.


పాదయాత్రలో పాల్గొంటాం

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు మద్దతు తెలుపుతున్నామని బాధిత రైతాంగ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ తన్నీరు వెంకటేశ్వర్లు చెప్పారు. వారితో కలిసి పాదయాత్రలో పాల్గొంటామని స్పష్టం చేశారు. వారితో కలిసి నడుస్తామన్నారు. 


వెంకటగిరి సీఐపై చర్యలు తీసుకోవాలి: డోలా

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలె్‌సలో కూర్చొని పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా, అమరావతి రైతుల మహా పాదయాత్రను ఆపలేరని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. అమరావతి పరిరక్షణ జేఏసీ సభ్యుడు శివపై వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 


భారీగా విరాళాలు

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఆదివారం పాదయాత్రలో ప్రతి గ్రామంలో స్థానికులు వారి స్థాయికి తగ్గట్టుగా విరాళాలు అందించారు. చెన్నైలోని తెలుగు ప్రముఖులు రైతులకు సంఘీభావం తెలుపుతూ పాద యాత్రలో పాల్గొని, తమవంతుగా రూ.27లక్షలను విరాళంగా అందజేశారు. గుంటూరు జిల్లాకు చెందిన గుండవల్లి అసోసియేషన్‌, ఆస్ట్రేలియాలోని ఎన్‌ఆర్‌ఐలు రూ.2లక్షలను విరాళంగా అందించారు. ఇదిలా ఉంటే అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొంటున్న నేతలపై కేసుల నమోదు పర్వం కొనసాగుతోంది. తాజాగా సైదాపురం, గూడూరు రూరల్‌ మండలాల్లో టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కాగా, సోమవారం మహాపాదయాత్ర వెంకటగిరి పట్టణంలోకి చేరుకుంటుంది.

Updated Date - 2021-12-06T07:38:59+05:30 IST