‘అగ్నిపథ్‌’పై అదే సందేహం!

ABN , First Publish Date - 2022-06-27T09:11:17+05:30 IST

త్రివిధ దళాల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్‌’ పథకంపై ఆది నుంచి ఉన్న సందేహాలు అలాగే ఉన్నాయి.

‘అగ్నిపథ్‌’పై అదే సందేహం!

సర్కారీ ఉద్యోగాల్లో కోటాపై రాష్ట్ర ప్రభుత్వాల మౌనం


అగ్నివీరులకు పైపై హామీలతో సరి

న్యూఢిల్లీ, జూన్‌ 26: త్రివిధ దళాల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్‌’ పథకంపై ఆది నుంచి ఉన్న సందేహాలు అలాగే ఉన్నాయి. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేరి నాలుగేళ్ల తర్వాత రిటైరైన సైనికులకు తాము చేపట్టే ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాయా? లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎలాంటి స్పష్టత లేదు. దీంతో అగ్నివీరులుగా చేసిన వారి భవిష్యత్తు ఏంటనేది అగమ్యగోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించిన తర్వాత.. పలు రాష్ర్టాల్లో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్‌, హరియాణ, ఉత్తరాఖండ్‌, అస్సాం ప్రభుత్వాలు.. అగ్నివీరులకు కోటా ప్రకటించాయి. తమ ప్రభుత్వాలు చేపట్టే పోలీసు నియామకాల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించాయి. అదేవిధంగా కేంద్ర హోంశాఖ తన పరిధిలోని కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో(సీఏపీఎ్‌ఫ)ను, అస్సాం రైఫిల్స్‌లోనూ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, నిపుణులు మాత్రం ఇది అంత తేలిక విషయం కాదంటున్నారు. రాష్ట్ర పోలీసు నియామకాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని, పైగా అగ్నివీరులు అన్‌రిజర్వ్‌డ్‌ కోటాలో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అటు సీఏపీఎ్‌ఫలో కానీ, ఇటు రాష్ట్రాల పోలీసుల నియామకాల్లో కానీ అగ్నివీరులకు కోటా అమలుచేయడం కష్టమేనని అంటున్నారు. వీరి క్వాలిఫికేషన్‌ కూడా ఈ నియామకాలకు ఇబ్బందిగా మారుతుందని చెబుతున్నారు. ఈ పరిణామాలపై ఒక రాష్ట్రానికి చెందిన పోలీసు నియామక బోర్డు అధిపతి ఆసక్తిగా స్పందించారు. ‘‘ఆర్మీ నియామక విధానానికి, రాష్ట్రాల పోలీసు నియామకానికి చాలా తేడా ఉంటుంది. అక్కడి రిజర్వేషన్లు ఇక్కడ వర్తించవు’’ అని ఆయన పేర్కొన్నారు.


హామీ ఇచ్చినా కార్యాచరణ ఏదీ?

అగ్నివీరులకు సంబంధించి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కొన్ని హామీలు గుప్పించారు. రాష్ట్ర పోలీసు నియామకాల్లో గ్రూప్‌-సీ(నాన్‌ గెజిటెడ్‌) పోస్టులను కేటాయిస్తామని చెప్పారు. అయితే.. ఎంత శాతం రిజర్వేషన్‌ ఇస్తారనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా పోలీసు, చార్‌ధామ్‌ విపత్తుల నిర్వహణ విభాగాల్లో అవకాశం ఇస్తామని పేర్కొంది. కానీ ఎలాంటి విధివిధానాలు ప్రకటించలేదు. అలాగే, యూపీ, ఎంపీ, అసోంలు కూడా అగ్నివీరులకు తమ విభాగాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా.. కోటాపై స్పష్టత ఇవ్వలేదు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ అగ్నివీరులకు ఎలాంటి రిజర్వేషన్‌ ఇస్తారనే విషయంపై ప్రభుత్వం ప్రకటన చేయలేదు. ఇక.. అగ్నిపథ్‌పై కాంగ్రెస్‌ విమర్శల పర్వం కొనసాగిస్తోంది. అగ్నిపథ్‌ను తుగ్లక్‌ నిర్ణయంగా పేర్కొంది. దీనిని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.  ‘అగ్నిపథ్‌ కి బాత్‌; యువత విషయంలో విశ్వాసఘాతుకం’ పేరిట 20 నగరాల్లో ఆ పార్టీ కీలక నేతలు మీడియాతో మాట్లాడారు.


56,960 దరఖాస్తులు!

అగ్నిపథ్‌ పథకంలో భాగంగా భారత వాయుసేనలో ‘అగ్నివీర్‌ వాయు’ నియామకాలకు సంబంధించి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు 56,960 మంది ‘అగ్నివీర్‌ వాయు’ పోస్టులకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు భారత వాయుసేన ఆదివారం తెలిపింది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జూలై 5వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొంది.  

Updated Date - 2022-06-27T09:11:17+05:30 IST