ఒకటే జననం.. ఒకటే మరణం..

ABN , First Publish Date - 2022-08-14T09:03:56+05:30 IST

స్వాతంత్య్ర పోరాటం.. ఆ మాట వినగానే గుండెల్లో ఏదో తెలియని ఉద్వేగం! కానీ, అది ఒక్కరోజులో..

ఒకటే జననం.. ఒకటే మరణం..

స్వాతంత్య్ర పోరాటం.. ఆ మాట వినగానే గుండెల్లో ఏదో తెలియని ఉద్వేగం! కానీ, అది ఒక్కరోజులో.. ఒక్క ఏడాదిలో జరిగిందీ, ముగిసిందీ కాదు!! ఆ సమరంలో.. రోమాంచితమయ్యేలా చేసే ఘట్టాలు కొన్ని.. గుండె కరిగి కన్నీరయ్యేలా చేసే విషాదాలు మరికొన్ని.. ఆసేతుహిమాచలం భారతీయులందరూ మునికాళ్లపై నిలిచి ఆంగ్లేయుల ఆగడాలను అడ్డుకునేందుకు ముందుకు దూకిన ఘట్టాలు మరికొన్ని!! బ్రిటిషర్లపై భారతీయులు జరిపిన స్వాతంత్య్ర పోరాటంలో.. ఇలా ఎన్నో కీలక ఘట్టాలు. వాటిలో అత్యంత ప్రధానమైనవి..


1857 సిపాయి తిరుగుబాటు

ప్రథమ స్వాతంత్య్ర సమరంగా పేరొందిన సిపాయిల తిరుగుబాటు.. వలస పాలనపై భారతీయులు తొలిసారి తిరగబడిన సందర్భం. అయితే రకరకాల కారణాల వల్ల ఈ తిరుగుబాటు విఫలమైంది. అంతేకాదు.. ఈ తిరుగుబాటుతో దేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన ముగిసి, బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రత్యక్షపాలన 1858లో మొదలైంది. రాజ్యసంక్రమణ సిద్ధాంతం రద్దుకు, భారతీయులకు ఉద్యోగాలు రావడానికి, భారతీయ సంప్రదాయాలు, ఆచారాలకు గుర్తింపు లభించడానికి ఈ తిరుగుబాటు కారణమైంది. జాతీయోద్యమానికి బలమైన పునాదులు వేసింది.


కాంగ్రెస్‌ స్థాపన

1885లో ఏవో హ్యూమ్‌ అనే ఆంగ్లేయ అధికారి.. భారత జాతీయ కాంగ్రె్‌సను స్థాపించాడు. అంతకు ముందు మనదేశంలో విజ్ఞాన సభ, బొంబాయి సంఘం, భూకామందుల సొసైటీ, మద్రాస్‌ దేశీయ సంఘం వంటివి ఉన్నప్పటికీ.. బ్రిటిషర్లను ఎదుర్కొనే బలమైన రాజకీయ శక్తి ఏదీ లేదు. ఈ నేపథ్యంలో బెంగాల్‌కు చెందిన సురేంద్రనాథ్‌ బెనర్జీ ‘ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌’ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ఎప్పటికైనా బ్రిటిష్‌ పాలనకు ముప్పుగా భావించిన ఏవో హ్యూమ్‌.. భారత్‌లో తమ పాలన శాశ్వతం చేయడానికి ‘భారత జాతీయ కాంగ్రె్‌స’ను స్థాపించాడు. కానీ, కాలక్రమంలో అది ఆంగ్లేయులను ఎదిరించే ప్రధాన రాజకీయ శక్తిగా మారింది.


గాంధీజీ రాక

దక్షిణాఫ్రికాలో తెల్లవారి వివక్ష తీవ్రతను ప్రత్యక్షంగా చవిచూసిన మోహన్‌ దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ.. 1915లో భారతదేశానికి తిరిగివచ్చాడు. కొల్లాయిగట్టి జాతీయోద్యమాన్ని నడిపించి.. ‘గాంధీజీ’గా, ‘బాపూజీ’గా ప్రజల మనన్నలందుకుని మహాత్ముడయ్యాడు. స్వాతంత్య్రసాధనలో కీలకపాత్ర పోషించి జాతిపితగా జనం గుండెల్లో నిలిచిపోయాడు.


చంపారన్‌ సత్యాగ్రహం

స్వాతంత్ర్యోద్యమంలో 1919-1947 మధ్య కాలాన్ని గాంధీ యుగంగా వ్యవహరిస్తారు. కానీ, దానికన్నా ముందే.. 1917లో బిహార్‌లోని చంపారన్‌లో నీలిమందు రైతులకు అండగా నిలిచిన గాంధీజీ బ్రిటిషర్లతో తొలిసారి తలపడి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఇష్టం ఉన్నా లేకున్నా రైతులు తమ భూమిలో 3/20 వంతు నీలిమందు పండించాలన్న విధానాన్ని రద్దు చేయించారు.


జలియన్‌వాలా బాగ్‌ దురంతం

భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన.. జలియన్‌వాలా బాగ్‌ దురంతం. 1919, ఏప్రిల్‌ 13.. సిక్కుల ఉగాది రోజైన ‘బైశాఖి’ పర్వదినాన ఆంగ్లేయులు జరిపిన దారుణ మారణకాండ అది.  స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ, డాక్టర్‌ సత్యపాల్‌ను ఏప్రిల్‌ 10న బ్రిటిష్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. బ్యాంకులు, రైల్వేస్టేషన్లు తగులబెట్టారు. బ్రిటిష్‌ ప్రభుత్వం పంజాబ్‌లో మార్షల్‌ లా విధించింది. అయితే, వసంతాగమనానికి సూచిక అయిన బైశాఖీ వేడుకలు జరుపుకోవడానికి.. అదే సమయంలో కిచ్లూ, సత్యపాల్‌ అరెస్టుకు శాంతియుతంగా నిరసన తెలపడానికి వేలాది మంది స్థానికులు జలియన్‌వాలా బాగ్‌ వద్ద చేరారు. సూర్యాస్తమయానికి ముందు అక్కడికి తన సైన్యంతో సహా వచ్చిన జనరల్‌ డయ్యర్‌.. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా కాల్పులకు ఆదేశించాడు. దూసుకొస్తున్న తూటాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది అక్కడ ఉన్న నూతిలోకి దూకేశారు. ఆరోజు 350 మంది చనిపోయినట్టు బ్రిటిష్‌ ప్రభుత్వం రికార్డుల్లో పేర్కొంది. వాస్తవానికి 1000 మందికి పైగా చనిపోయినట్టు చెబుతారు. 


సహాయ నిరాకరణ

1920లో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన గాంధీజీ.. సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులు, వస్త్రాలను బహిష్కరించడం, స్థానిక చేతివృత్తులు, చేనేత పనివారికి ప్రోత్సాహం ఇవ్వడం, రాట్నాలపై నూలు వడికి ఖద్దరు వస్త్రాలను తయారుచేయడం, పన్నులు చెల్లించడానికి నిరాకరించడం వంటి చర్యలతో అడుగడుగునా భారతీయులు బ్రిటిష్‌ ప్రభుత్వానికి  నిరసన తెలిపారు. 


ఉప్పు సత్యాగ్రహం

శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా.. మహాత్ముడు 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ఆ ఏడాది మార్చి 12న  బాపూజీ సబర్మతి ఆశ్రమం నుంచి 79 మందితో కలిసి పాదయాత్రగా బయలుదేరి..  ఏప్రిల్‌ 6న దండి గ్రామానికి చేరి పిడికెడు ఉప్పును పట్టుకుని.. ‘‘దీంతో నేను బ్రిటిష్‌ సామ్రాజ్య పునాదులు కదల్చబోతున్నాను’’ అని ప్రకటించారు. 


క్విట్‌ ఇండియా

భారత స్వాతంత్ర్యోద్యమంలో చివరి ఘట్టం.. 1942 ఆగస్టు 9న ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమం. ఆ ఉద్యమ నినాదం ఒక్కటే.. భారతదేశంలో బ్రిటిష్‌ పాలనకు చరమగీతం. ‘డూ ఆర్‌ డై (విజయమో వీర స్వర్గమో)’ అంటూ ఆగస్టు 9న బొంబాయిలో గాంధీజీ ఇచ్చిన పిలుపుతో యావద్దేశం తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా కదం తొక్కింది.  ఆ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నించినా ప్రజల్లో స్వాతంత్య్రకాంక్ష తగ్గకపోవడంతో.. భారతదేశాన్ని ఇక పరిపాలించలేమని అర్థమై బ్రిటిష్‌ ప్రభుత్వం దిగొచ్చింది.

Updated Date - 2022-08-14T09:03:56+05:30 IST