సంబురాలు సరే, ఏర్పాట్లేవీ?

ABN , First Publish Date - 2021-09-07T05:48:53+05:30 IST

కాకతీయులు క్రీ.శ.1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కటంతో తెలంగాణ ప్రజలు సంతోషించారు, సంబురాలు జరుపుకున్నారు...

సంబురాలు సరే, ఏర్పాట్లేవీ?

కాకతీయులు క్రీ.శ.1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కటంతో తెలంగాణ ప్రజలు సంతోషించారు, సంబురాలు జరుపుకున్నారు. కానీ ఈ సంబురాలకు సార్థకత చేకూర్చే చర్యలేవీ చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. యునెస్కో గుర్తింపు లభించి ఇప్పటికే యాభై రోజులు గడిచాయి. ఇప్పటి దాకా ముగ్గురు రాష్ట్ర మంత్రులు రామప్పకు వచ్చి ఇదంతా మా ప్రభుత్వం ఘనతేనని డాంబికాలు పలికారు. ప్రచారార్భాటం చేశారు. అంతే తప్ప రామప్ప గుడి అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల ముచ్చట తీయలేదు. రూ.250 కోట్లు మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారే తప్ప, రాష్ట్రం తరఫు నుంచి ఇచ్చే నిధుల ఊసెత్తలేదు. రామప్పకు గుర్తింపును ఇచ్చిన యునెస్కో అక్టోబరు నెలలో తమ బృందాన్ని ఇక్కడికి పంపబోతున్నది. ఈ బృందం ప్రపంచ వారసత్వ సంపద రక్షణకు ఉండాల్సిన ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయా లేదా అన్నది పరిశీలిస్తుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ కదలికా లేకపోవటం శోచనీయం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామప్ప పరిరక్షణపై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేసి త్వరితగతిన పనులు చేపట్టి నిధుల విడుదల వివరాలను వెల్లడి చేయాలి. దేవాలయం చుట్టుపక్కల 50 కి.మీ.మేర ఉపరితల గనుల (ఓపన్ కాస్టుల) తవ్వకాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలి. గుడి చుట్టుపక్కల ఉన్న వందెకరాల భూమిని సేకరించే క్రమంలో భూనిర్వాసితులకు అన్యాయం జరగకుండా నష్టపరిహారం చెల్లించాలి. దేవాలయ అభివృద్ధిలో పాలంపేట గ్రామ ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి. రామప్పకు వచ్చే పర్యాటకులకు గుడి పరిసరాల్లోనే మంచినీటి వసతి, శౌచాలయాలు, విశ్రాంతి గదులతో పాటు పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాట్లను వేగంగా ప్రారంభించాలి. అక్టోబరు నెలలో యునెస్కో బృందం రాకను దృష్టిలో పెట్టుకొని తదనుగుణమైన ఏర్పాట్లు ప్రారంభించకపోతే నష్టం చేకూర్చే అవకాశమున్నదని రామప్ప పరిరక్షణ కమిటీ తీవ్ర ఆందోళన చెందుతోంది.

నల్లెల్ల రాజయ్య, 

ఆకినేని రామ్మోహన్ రావు, 

వీరమల్ల శ్రీనివాస్

రామప్ప పరిరక్షణ కమిటీ, వరంగల్

Updated Date - 2021-09-07T05:48:53+05:30 IST