సమర్ధులు ఎవరు!?

ABN , First Publish Date - 2021-01-27T04:44:48+05:30 IST

తొలి విడత ఎన్నికలు జరిగే కావలి డివిజన్‌లో అభ్యర్థుల విషయంలో రెండు ప్రధాన పార్టీలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి.

సమర్ధులు ఎవరు!?

గెలుపు గుర్రాల కోసం రాజకీయ పార్టీల వేట

స్థానిక కేడర్‌తో సమావేశాలు ముమ్మరం

వైసీపీలో కుదరని ఏకాభిప్రాయం

టీడీపీ వ్యూహాత్మక అడుగులు

పోటీకి సై అంటున్న బీజేపీ, జనసేనలు


పల్లెల్లో పంచాయతీ కాక మొదలయ్యింది. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేట మొదలు పెట్టాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు పోటా పోటీగా అభ్యర్థుల ఖరారుకు సన్నాహాలు మొదలు పెట్టాయి. బీజేపీ, జనసేన పార్టీలు సైతం ప్రతి పంచాయతీలో తమ అభ్యర్థిని బరిలో దింపేందుకు సమర్ధుల కోసం గాలింపు మొదలు పెట్టాయి. ఇప్పటికే మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీ కేంద్రాల్లో జిల్లా, నియోజకవర్గస్థాయి నాయకులు స్థానిక కేడర్‌తో సమావేశమవుతున్నారు. పల్లెపోరులో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.


నెల్లూరు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : తొలి విడత ఎన్నికలు జరిగే కావలి డివిజన్‌లో అభ్యర్థుల విషయంలో రెండు ప్రధాన పార్టీలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. పలు పంచాయతీలకు అభ్యర్థులను ఖరారు చేసుకున్నా, పేర్లు బయట పెట్టకుండా ఇరుపార్టీల నేతలు జాగ్రత్త పడుతున్నారు. ముందే పేర్లు బయటపడితే వైరి పక్షం వారిని తమ వైపు ఆకర్షించడమో, లేదా భయపెట్టడమో చేస్తుందనే ఉద్దేశంతో అభ్యర్థుల పేర్లను రహస్యంగా ఉంచుతున్నారు. 


సొంత పార్టీలోనే పోటీ


ప్రధాన పార్టీలకు సర్పంచు అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారుతోంది. పలుచోట్ల నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. సొంత పార్టీలోనే ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండటంతో నేతలు తలలు పట్టుకొంటున్నారు. అధికార పార్టీకి ఈ బెడద ఎక్కువగా కనిపిస్తోంది. నామినేషన్ల గడువు సమీపించే కొద్దీ ఈ రెబల్స్‌ బెడద మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అనంతసాగరం, జలదంకి, బాలాయపల్లి, వరికుంటపాడు, మనుబోలు మండలాల్లో వైసీపీ ఈ పరిస్థితులు ఎదుర్కొంటోంది. 


ప్రతిపక్షాల్లో మానసిక స్థ్యైర్యం


స్థానిక ఎన్నికలను రాజకీయ కోణంలో చూస్తే మార్చి నాటికి, నేటికి ఎంతో తేడా కనిపిస్తోంది. గత ఏడాది మార్చి నెలలో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆ సమయంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఆసక్తి కనబడలేదు. పార్టీ అగ్రనేతలు ఒత్తిడి తెచ్చినా, అధికార పార్టీకి భయపడి ఎందుకొచ్చిన తలనొప్పి అనే ఉద్దేశంతో పోటీకి వెనకడుగు వేశారు. పార్టీ ఒత్తిడి మేరకు కొన్ని చోట్ల మొహమాటానికి నామినేషన్లు వేసినా, ఉపసంహరణల సమాయానికి వెనక్కు తీసుకున్నారు. బరిలో నిలిచిన వారిలో సైతం మొక్కుబడితత్వం తప్ప పోరాడాలన్న ఆరాటం పెద్దగా కనిపించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. పది నెలల వ్యవధిలో పరిస్థితుల్లో ఎంతో మార్పు కనిపిస్తోంది. ప్రతిపక్షాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. అధికార పార్టీకి ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి పంచాయతీలో పోటీ పెట్టాలనే యోచనలో టీడీపీ, బీజేపీ, జనసేనలు ముందుకు కదులుతున్నాయి. 


ఊపందుకున్న పార్టీ నేతల సమావేశాలు


బుచ్చిలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీ మండల నాయకులతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. వెంకటాచలం టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పార్టీ శ్రేణులతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ జరిపారు. సర్పంచు అభ్యర్థుల విషయమై రాపూరు మండలంలో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. ఎన్నికల వ్యయాన్ని భరించే ఆర్థిక స్తోమత కలిగిన వారి కోసం రాపూరు వైసీపీ నేతలు అన్వేషణ మొదలు పెట్టారు.  మనుబోలులో టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసుకుంది.


ఎన్నికలకు యంత్రాంగం సిద్ధం


నేడు కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌


నెల్లూరు(జడ్పీ), జనవరి 26 : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు  అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటన వచ్చినప్పటికీ ఎన్నికల కమిషనర్‌, ప్రభుత్వం మధ్య పోరుతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేక పోయారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. రీషెడ్యూల్‌ ప్రకారం జిల్లాలో తొలుత కావలి డివిజన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ఈనెల 29 నుంచి నామినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం ఆత్మకూరు, ఆ తర్వాత నాయుడుపేట గూడూరు డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి. చివరిగా నెల్లూరు డివిజన్‌లో ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 941 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.  ఈ మేరకు యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. నామినేషన్‌ పత్రాలు, బ్యాలెట్‌ పేపర్లు, పోలింగ్‌ బూత్‌లు సిద్ధం చేయడంతోపాటు రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల సిబ్బందిని నియమించాల్సి ఉంది. పోలింగ్‌ రోజే కౌంటింగ్‌  కూడా నిర్వహించాల్సి ఉండటంతో ఆ మేరకు పటిష్టంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వీటన్నింటికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేయనున్నారు. 

Updated Date - 2021-01-27T04:44:48+05:30 IST