సమరయోధుల పురిటిగడ్డ

ABN , First Publish Date - 2022-08-12T06:14:48+05:30 IST

స్వాతంత్య్ర పోరాటంలో అనకాపల్లికి ఒక ప్రత్యేక స్థానం వుంది. ఈ నేలపై జన్మించిన ఎంతోమంది.. భారతదేశాన్ని బ్రిటీష్‌ పాలకుల నుంచి విముక్తి చేయడానికి ప్రాణాలకు తెగించి ఉద్యమించారు. నెలలు, ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవించారు.

సమరయోధుల పురిటిగడ్డ
నాడు స్వాతంత్య్ర సమరయోధులు అజ్ఞాతవాసం గడిపిన అనకాపల్లిలోని శాఖ వీధి

అనకాపల్లి కేంద్రంగా స్వాతంత్య్ర సంగ్రామం

బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాటం

పోలీసులకు చిక్కకుండా శాఖ వీధిలోని ఓ ఇంటిలో అజ్ఞాతవాసం

మహాత్మాగాంధీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం

విదేశీ వస్తు బహిష్కరణ, శాసన ఉల్లంఘన

సమరయోధులపై ఉక్కుపాదం మోపిన తెల్లదొరలు

ఉద్యకారులను అరెస్టు చేసి పలు జైళ్లకు తరలింపు


(అనకాపల్లి, అగ్రికల్చర్‌ - ఆంధ్రజ్యోతి)

స్వాతంత్య్ర పోరాటంలో అనకాపల్లికి ఒక ప్రత్యేక స్థానం వుంది. ఈ నేలపై జన్మించిన ఎంతోమంది.. భారతదేశాన్ని బ్రిటీష్‌ పాలకుల నుంచి విముక్తి చేయడానికి ప్రాణాలకు తెగించి ఉద్యమించారు. నెలలు, ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవించారు.  స్వాతంత్య్ర పోరాటంలో అనకాపల్లి విశిష్ట పాత్ర పోషించిందని ప్రముఖ చరిత్రకారులు దివంగత తల్లాప్రగడ సత్యనారాయణ ‘అనకాపల్లి చరిత్ర’లో పేర్కొన్నారు. బ్రిటీష్‌ పాలకులకు చిక్కకుండా పలువురు సమరయోధులు స్థానిక శాఖ వీధిలోని  పల్లావజ్జుల అప్పలనర్సయ్య, స్వరాజ్య లక్ష్మిల ఇంటిలో అజ్ఞాతవాసం గడిపారు. వీరికి ఆహారం, ఇతర సదుపాయాలను స్థానికులే రహస్యంగా కల్పించేవారు. ఇక్కడ అజ్ఞాతంలో వున్న వారిలో రాష్ట్రపతిగా పనిచేసిన వరహగిరి వెంకటగిరి కూడా ఉన్నారు. రాష్ట్రపతి హోదాలో అనకాపల్లి వచ్చినప్పుడు ఆయన ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.  


అనకాపల్లిలో ఎంతోమంది సమరయోధులు

 అనకాపల్లి కేంద్రంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధులు ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన ఉద్యమం, క్విట్‌ ఇండియా పోరాటంలో భాగస్వాములయ్యారు. డాక్టర్‌ గుళ్లపల్లి నారాయణమూర్తి, కోరుకొండ లింగమూర్తి, కోరుకొండ బుచ్చిరాజు, డాక్టరు కోరుకొండ సుబ్బరాజు, జక్కినపల్లి శ్రీరామ్మూర్తి, కోరిబిల్లి జోగారావు, కోడుగంటి కె.గోవిందరావు, భీశెట్టి అప్పారావు, కొడుకుల కామేశ్వరమ్మ, కొడుకుల సూర్యనారాయణ, కొడుకుల సోమన్న, జోగారావు, బయ్యా నరసింహశర్మ, సీఆర్‌ వల్లభన్‌ (మణి), సూచిశెట్టి జగ్గయ్య, ఖద్దరుకొట్టు అప్పలనాయుడు, కర్రి అప్పారావు,  మొల్లి అప్పారావు, తదితర ఎంతోమంది ప్రముఖులు దేశానికి స్వాతంత్య్రం కోసం తమ వంతు పోరాటం చేశారు.  


ఉప్పు సత్యాగ్రహంలో బుచ్చిరాజు, నారాయణమూర్తి...

మహాత్మాగాంధీ పిలుపునందుకుని డాక్టర్‌ గుళ్లపల్లి నారాయణమూర్తి, కోరుకొండ బుచ్చిరాజు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. బ్రిటీష్‌ పాలకులు బుచ్చిరాజును 1930 మార్చి 20న అరెస్టు చేసి తొలుత బరంపురం జైలుకు తరలించారు. తరువాత అక్కడ నుంచి బళ్లారి జైలుకు పంపారు. గుళ్లపల్లి నారాయణమూర్తిని కూడా ఇదే నెలలో అరెస్టు చేసి అలిపూర్‌ (బెంగాల్‌), బళ్లారి జైళ్లలో ఆరు నెలలపాటు నిర్బంధించారు. తరువాత 1932 ఫిబ్రవరి 18న అరెస్టు చేసి మద్రాసు జైలుకు పంపారు. 1941 మార్చి నెలలో ఆయన మరోసారి అరెస్టు అయ్యారు. గుళ్లపల్లి నారాయణమూర్తి అనేక రచనలు కూడా చేశారు. విడాకులు, ఆకలి, ఆంధ్రజ్యోతి నాటకాలను రాశారు. నటుడిగా కూడా రాణించారు. ఆయనను జ్యోతి పంతులుగా పిలిచేవారు. తన మిత్రులందరినీ ఈ నాటకాల్లో పాత్రధారులుగా చేసి, బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. 


క్విట్‌ ఇండియా ఉద్యమం...

కొడుకుల కామేశ్వరమ్మ క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 అక్టోబరు 5న అరెస్టు అయి మూడు నెలలపాటు రాయవెల్లూరు జైలులో శిక్ష అనుభవించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అనకాపల్లి నుంచి కీలకంగా వ్యవహరించిన ఏకైక మహిళగా ఈమె గుర్తింపు పొందారు. ఇదే ఉద్యమంలో జక్కినపల్లి శ్రీరామ్మూర్తి, కోరిబిల్లి జోగారావులను బ్రిటీష్‌ పోలీసులు అరెస్టు చేసి బళ్లారి జైలుకు పంపారు. ఇంకా కోడుగంటి కె.గోవిందరావు, భీశెట్టి అప్పారావు కూడా అరెస్టు అయ్యారు.  

అచ్యుతాపురం మండలం  కొండకర్లకు చెందిన మిస్సుల సూర్యనారాయణమూర్తి 1941 జనవరి 31న తన స్వగ్రామంలో సత్యాగ్రహం చేపట్టారు. శాసన ఉల్లంఘనకు పాల్పడిన అభియోగంపై ఆయనను అరెస్టు చేసి బళ్లారి జైలుకు తరలించారు.  ఇంకా సీఆర్‌ వల్లభన్‌ (మణి), సూచిశెట్టి జగ్గయ్య, ఖద్దరుకొట్టు అప్పలనాయుడు, కర్రి అప్పారావు, కశింకోటకు చెందిన మొల్లి అప్పారావు వంటివారు అనేకమంది స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనే వారికి స్ఫూర్తినివ్వడం కోసం గ్రంధి వెంకటరమణయ్య బాబు 1934లో ‘సత్యవాణి అనే పత్రికను ప్రారంభించారు. 


కోరుకొండ కుటుంబానిది ప్రత్యేక స్థానం

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని కీర్తి గడిచిన వారిలో కోరుకొండ కుటుంబం ఒకటి. స్వాతంత్య్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన గ్రంథాలయ ఉద్యమంతో ప్రభావితమైన కోరుకొండ లింగమూర్తి 1936లో అనకాపల్లిలో శారదా గ్రంథాలయాన్ని నెలకొల్పారు. డాక్టర్‌ గుళ్లపల్లి నారాయణమూర్తి, ఉప్పల శ్రీరామ్మూర్తి, గ్రంధి రమణయ్యబాబులు ఈ గ్రంథాలయ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కోరుకొండ కుటుంబానికే చెందిన బుచ్చిరాజు విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ఉద్యమంలో పాల్గొన్నారు. ఇతను రెండుసార్లు జైలు శిక్ష అనుభవిచారు. తండ్రి బుచ్చిరాజు స్ఫూర్తినందుకొని డాక్టరు కోరుకొండ సుబ్బరాజు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించి, అనకాపల్లిలో సాంస్కృతిక విద్యా వికాసానికి, గ్రంథాలయ ఉద్యమానికి సముచిత సేవలందించారు. కల్చరల్‌ అసోసియేషన్‌ను స్థాపించి రాష్ట్రంలో సుప్రసిద్ధులైన వారితో ఉపన్యాసాలు ఇప్పించేవారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆర్నెల్లు జైలు శిక్ష అనుభవించారు. జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించారు. అనకాపల్లిలో గాంధీ టీబీ క్లినిక్‌ ఏర్పాటు చేసి ఉచిత సేవలు అందించారు. స్వాతంత్ర్యానంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ పురస్కారాన్ని అందుకున్నారు. అనకాపల్లిలో వర్తక సంఘం, ఏఎంఏఎల్‌ కళాశాల ఏర్పాటులో కోరుకొండ కుటుంబం చేసిన కృషి ఎంతో వుంది. 


Updated Date - 2022-08-12T06:14:48+05:30 IST