Feb 27 2021 @ 15:23PM

11 ఏళ్ల `ఏ మాయ చేశావే`.. సమంత ఎమోషనల్!

`ఏ మాయ చేశావే` సినిమతో తెలుగు తెరంగేట్రం చేసి తెలుగు సినీ ప్రేక్షకులను మాయ చేసింది సమంత. ఆ సినిమా తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమా హీరో నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి కోడలిగా మారిపోయింది. `ఏ మాయ చేశావే` సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సమంత ఎమోషనల్ అయ్యింది. దర్శకుడు గౌతమ్ మీనన్‌కు, నిర్మాత మంజుల ఘట్టమనేనికి, హీరో నాగచైతన్యకు ధన్యవాదాలు తెలిపింది. 

ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ``ఏ మాయ చేశావే`కు 11 ఏళ్లు. నాలో ప్రతిభ ఉందని గుర్తించినందుకు ధన్యవాదాలు గౌతమ్ మీనన్ సర్. నా ట్యాలెంట్‌ను నా కంటే మీరే ఎక్కువ నమ్మారు. మంజుల ఘట్టమనేనికి, నాగచైతన్యకు, ఇది చదువుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీరంతా కలిసి నన్ను ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన మహిళగా మార్చార`ని సమంత పేర్కొంది.