Sep 25 2021 @ 18:14PM

సమంత ఆ షాక్‌లోనే ఉంది!

మహేశ్‌బాబు, సమంత జంటగా నటించిన ‘దూకుడు’ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దూకుడు’ షూటింగ్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఇస్తాంబుల్‌లో షూటింగ్‌ మొదలుపెట్టడానికి ముందు శ్రీనువైట్ల మహేశ్‌కు డిన్నర్‌ పార్టీ ఇచ్చారు. అక్కడ ఆయనకు సినిమా గురించి ఆసక్తికర విషయాలు, డైలాగ్‌లు చెప్పగానే మహేశ్‌ ఫిదా అయ్యారట. దాంతో అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు మహేశ్‌. ఆ చర్చలు అయిన కాసేపట్లోనే  నమ్రతకు ఫోన్‌ చేసి.. ‘శంకర్‌ తెరకెక్కిస్తోన్న ‘స్నేహితుడా’లో నేను యాక్ట్‌ చేయనని చెప్పు’ అని అన్నారట. ఆ మాటకు  నమ్రత, శ్రీను వైట్ల ఇద్దరూ షాక్‌ అయ్యారట. ‘‘‘దూకుడు’, స్నేహితుడా’ చిత్రాలకు డేట్స్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో మహేశ్‌ నా సినిమా ఓకే చేసి శంకర్‌కి నో చెప్పారు. ఆ క్షణం నుంచి నాకు ఈ సినిమా మీద  మరింత రెస్పాన్సిబిలిటీ పెరిగింది’’ అని శ్రీను వైట్ల అన్నారు. అలాగే మరో ఆసక్తికర విషయాన్ని ఆయన పంచుకున్నారు. 


‘‘ఇస్తాంబుల్‌లో జరిగిన తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ఎంతో ఎంజాయ్‌ చేశాం. కొద్ది రోజులు చిత్రీకరణ జరిగాక ఓ రోజు అనుకోకుండా షూటింగ్‌ వాయిదా పడింది. సమంత షాపింగ్‌కు వెళ్తానని అడిగింది. సరే వెళ్లమన్నాను.  బయటకు వెళ్లిన పది నిమిషాలకే ఆమె నాకు ఫోన్‌ చేసి ఏడ్చేసింది. ‘ఏమైంది సామ్‌’ అని అడగ్గా.. ‘ఆత్మాహుతి దాడిని కళ్లారా చూశానని చెప్పింది’. అవన్నీ అక్కడ కామన్‌ అని తనకు నచ్చజెప్పాం. కానీ సమంత మాత్రం చాలా రోజులు అ షాక్‌లోనే ఉంది’’ అని శ్రీనువైట్ల చెప్పారు.