2025నాటికి రైతులను రుణవిముక్తులను చేస్తా : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2022-02-08T22:22:44+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ

2025నాటికి రైతులను రుణవిముక్తులను చేస్తా : అఖిలేశ్ యాదవ్

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మంగళవారం మీడియా సమావేశంలో విడుదల చేశారు. ‘సమాజ్‌వాదీ వచన్ పత్ర’ పేరుతో ‘సత్య వచన్, అటూట్ వాదా’ అనే ట్యాగ్‌లైన్‌తో దీనిని రూపొందించారు. 2012లో తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చామని చెప్పారు. 2025నాటికి రైతులందరినీ రుణ విముక్తుల్ని చేస్తామని ఈ మేనిఫెస్టోలో వాగ్దానం చేస్తున్నామన్నారు. పేద రైతుల లబ్ధి కోసం రుణ ముక్తి చట్టాన్ని తీసుకొస్తామన్నారు. 


అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని ఇస్తామన్నారు. చెరకు రైతులు తాము అమ్మిన పంటకు 15 రోజుల్లో చెల్లింపులు పొందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులందరికీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందజేస్తామన్నారు. వడ్డీ లేని రుణాలను, బీమా సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. పింఛను పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ ఉపాధి హామీ పథకం కోసం ఓ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పోలీసు ఉద్యోగాల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. 


బాలికలకు ప్రాథమిక తరగతుల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందజేస్తామన్నారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలకు రూ.36,000 చెల్లిస్తామని తెలిపారు. సమాజ్‌వాదీ పింఛనును తిరిగి ప్రారంభిస్తామని, వృద్ధులు, అవసరార్థులైన మహిళలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు సంవత్సరానికి రూ.18,000 చెల్లిస్తామన్నారు. దీని వల్ల దాదాపు 1 కోటి మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. 


పేద కార్మికులు, కూలీలు వంటివారికి రాయితీ ధరలపై రేషన్ సరుకులు లభించే విధంగా కిరాణా దుకాణాలను, సమాజ్‌వాదీ కేంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. వలస కూలీల కోసం మజ్దూర్ పవర్ లైన్‌ను ఏర్పాటు చేస్తామని, హెల్ప్‌లైన్ నంబరు 1890 అని చెప్పారు. 


Updated Date - 2022-02-08T22:22:44+05:30 IST