లక్నో: యూపీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్‌కు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో.. బీజేపీ మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన స్టేడియం తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినదేనంటూ ఛలోక్తి విసిరారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో జరిగిన మెగా ఈవెంట్లో యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. 52 మంది మంత్రివర్గ సభ్యులను తన టీమ్‌లో చేర్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వీవీఐపీలు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయవతిని కూడా యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానించారనే ప్రచారం జరిగినప్పటికీ,ఆ ఇద్దరు మాజీ సీఎంలు హాజరుకాలేదు.
అఖిలేష్ అభినందనలు..
సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసిన కొద్ది సేపటికే ఆయనను అభినందిస్తూ అఖిలేష్ ట్వీట్ చేశారు. బీజేపీ మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన స్టేడియం సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినదేనని, ప్రమాణస్వీకారం కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం కాకుండా, ప్రజా సేవే పరమార్థంగా ఉండాలని అఖిలేష్ ఆ ట్వీట్లో సూచించారు.
ఇవి కూడా చదవండి