అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో!

ABN , First Publish Date - 2022-08-13T05:52:46+05:30 IST

మండలంలో రెండేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ కమ్యూనిటీ భవనాల(వెల్‌నెస్‌ సెంటర్లు) నిర్మాణాలు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా పనులు నిలిచిపోగా, మరికొన్ని చోట్ల భవన నిర్మాణాలు కొనసా..గుతున్నాయి.

అసంపూర్తి భవనాలకు మోక్షమెన్నడో!
అమృతపురంలో నిధుల కొరతతో నిలిచిపోయిన రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌

మండలానికి మంజూరైన భవనాలు 51

రెండేళ్ల క్రితం సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలు ప్రారంభం

ఇప్పటికి పూర్తయినవి 14

కేటాయించిన నిధులు రూ.11.6 కోట్లు 

విడుదలైంది రూ.4.97 కోట్లు

నిధుల లేమితో నిర్మాణాల్లో జాప్యం


సబ్బవరం, ఆగస్టు 12: మండలంలో రెండేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ కమ్యూనిటీ భవనాల(వెల్‌నెస్‌ సెంటర్లు) నిర్మాణాలు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా పనులు నిలిచిపోగా,  మరికొన్ని చోట్ల భవన నిర్మాణాలు కొనసా..గుతున్నాయి.

 మండలంలో చాలా గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలు పునాదుల దశ కూడా దాటలేదు. కొన్ని గ్రామాల్లో శ్లాబ్‌ దశలోనూ, మరికొన్ని గ్రామాల్లో శ్లాబ్‌ పూర్తయి, ఇంకొన్ని గ్రామాల్లో చివరి దశలోనూ ఉన్నాయి. మొగలిపురంలో సచివాలయం, నారపాడులో హెల్త్‌ కమ్యూనిటీ భవనం, బోదివలస, సబ్బవరంలో రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. వివిధ సాంకేతిక కారణాల వల్ల భవన నిర్మాణాలు ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం సబ్బవరానికి 20 సచివాలయాలు, 17 రైతు భరోసా కేంద్రాలు, 14 హెల్త్‌ కమ్యూనిటీ సెంటర్ల(వెల్‌నెస్‌ సెంటర్లు)కు భవనాలు మంజూరయ్యాయి. వీటిలో 10 సచివాలయాల భవనాలు, 3 రైతు భరోసా కేంద్రాలు, ఒక వెల్‌నెస్‌ సెంటర్‌ భవన నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవన్నీ వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.


నిధుల కేటాయింపు ఇలా..

20 గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.5.45 కోట్లు కేటాయించింది. ఇప్పటికి రూ.3.03 కోట్లు ఖర్చు చేసి 10 సచివాలయ భవనాలు పూర్తి చేసింది. 17 రైతు భరోసా కేంద్రాలకు గాను రూ.3.70 కోట్లు కేటాయించింది. ఇప్పటికి రూ.1.002 కోట్లు ఖర్చు చేసి 3 భవనాల నిర్మాణాలు పూర్తి చేసింది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 14 హెల్త్‌ కమ్యూనిటీ సెంటర్లకు గాను రూ.2.45 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ.94.17 లక్షలు ఖర్చు చేసి ఒక బిల్డింగ్‌ నిర్మాణం పూర్తి చేయగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. మండలానికి మొత్తం మంజూరైన భవనాలు 51 కాగా, పూర్తయిన భవనాలు కేవలం 14 మాత్రమే. వీటి కోసం ప్రభుత్వం రూ.11.60 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు కేవలం రూ.4.97 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేయడంతో భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చేసిన ఖర్చుకే ఇంకా బిల్లులు మంజూరు కాలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్‌ డీఈ ఎం.ఆర్జున అప్పారావు వద్ద ప్రస్తావించగా.. ప్రభుత్వం నుంచి సిమెంట్‌ సరఫరా నిలిచిపోవడంతోనే భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కావలసి ఉందని ఆయన తెలిపారు. 


Updated Date - 2022-08-13T05:52:46+05:30 IST