ధరణిలో నిషేధిత భూములకు మోక్షం

ABN , First Publish Date - 2021-11-30T08:07:52+05:30 IST

ధరణి పోర్టల్‌లో పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములకు మోక్షం కలగనుంది. ధరణి కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌లోని 22-ఏ జాబితాలో పొరపాటున నమోదు చేసిన పట్టా భూములను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ధరణిలో నిషేధిత భూములకు మోక్షం

  • 22-ఏ జాబితాలో చేర్చిన భూముల విడుదలకు సర్కారు నిర్ణయం
  • ధరణి గ్రీవెన్స్‌ మాడ్యూల్‌లో రైతులు దరఖాస్తు చేయకున్నా పరిష్కారం
  • కలెక్టర్లకు సీఎస్‌ మౌఖిక ఆదేశాలు 
  • తహసీల్దార్లకు కలెక్టర్ల టార్గెట్లు
  • వారంలో నివేదికల సమర్పణకు ఆదేశం
  • 11 అంశాలతో ఎక్సెల్‌ షీట్‌ నమూనా


హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములకు మోక్షం కలగనుంది. ధరణి కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌లోని 22-ఏ జాబితాలో పొరపాటున నమోదు చేసిన పట్టా భూములను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధరణిలో నమోదైన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దేందుకు చేపడుతున్న చర్యలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 22-ఏ జాబితాలోని పట్టా భూముల విడుదల కోరుతూ రైతులు ధరణి గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసినా, చేయకపోయినా ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. తగిన ఆధారాలున్న పట్టా భూములను విడుదల చేయాలని పేర్కొన్నారు. 


ఇందుకు.. 1954 ఖాస్రా పహాణీ, చేసాల పహాణీతోపాటు ధరణి అమల్లోకి రావడానికి ముందువరకు ఉన్న 2018, 2019 పహాణీలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ఈ పహాణీల్లో పట్టా భూములుగా ఉండి, ప్రస్తుతం ధరణిలోని నిషేధిత జాబితాలో ఉంటే వాటిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. కాగా, నిషేధిత జాబితాలోని భూముల విషయాన్ని క్లియర్‌ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 11 అంశాలతో కూడిన ఎక్సెల్‌ షీట్‌ను రూపొందించింది. ఈ భూముల వివరాల సేకరణకుగాను జిల్లా కలెక్టర్లు.. తహసీల్దార్లకు రోజువారీ టార్గెట్లు విధించారు. చిన్న రెవెన్యూ గ్రామాలైతే రోజుకు నాలుగు, మేజర్‌ రెవెన్యూ గ్రామాలైతే రోజుకు రెండు గ్రామాల చొప్పున.. కేవలం వారంరోజుల్లోపు నిషేఽధిత భూములపై నమూనా ఎక్సెల్‌ షీట్‌లో పేర్కొన్న అంశాలపై నివేదికలు అందించాలని తహసీల్దార్లను కలెక్టర్లు ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) పర్యవేక్షిస్తున్నారు. 


తహసీల్దార్లు ఇలా చే స్తున్నారు..

ధరణి పోర్టల్‌లోని కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌లో చేర్చిన నిషేధిత జాబితా (22-ఏ)లోని మొత్తం సర్వే నంబర్లు, వాటిలోని భూముల విస్తీర్ణం, పట్టాదారుల వివరాలను తహసీల్దార్లు గ్రామాల వారీగా సేకరిస్తున్నారు. ఇందులో పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూముల వివరాలను ప్రభుత్వ నమూనా ఎక్సెల్‌ షీట్‌లో నమోదు చేస్తున్నారు. ఈ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలా? వద్దా? ఉంచాలని తహసీల్దార్‌ భావిస్తే.. అందుకు గల కారణాలు, ఆధారాలను ఎక్సెల్‌ షీట్‌లోని ‘జస్టిఫికేషన్‌ ఆఫ్‌ రిమూవల్‌’ అనే కాలంలో పేర్కొనాలి. నిషేధిత జాబితా నుంచి విడుదల చేయాలని తహసీల్దార్‌ భావిస్తే 1954 ఖాస్రా, చేసాల పహాణీలతోపాటు 2018, 2019 పహాణీల ప్రకారం వాటిని పట్టా భూములుగా పేర్కొంటూ అదే కాలంలో వివరాలు నమోదు చేయాలి. ఇలా గ్రామాలవారీగా తహసీల్దార్లు పంపిన జాబితా ప్రకారం కలెక్టర్‌ తన లాగిన్‌లో నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములను విడుదల చేస్తారు. కాగా, గతంలో ధరణి గ్రీవెన్స్‌లో రైతులు దరఖాస్తు చేసి, సరైన ఆధారాలు లేకపోవడంతో తిరస్కరించిన భూములను కూడా సుమోటోగా పరిశీలించి పట్టా భూములుగా తేలితే నిషేధిత జాబితా నుంచి విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 


కోర్టు ఆర్డర్‌.. క్షేత్రస్థాయి పరిశీలన..

ఒక సర్వే నంబర్‌లోని 10 ఎకరాల భూమిలో 10 మంది రైతులు ఉండి, వారిలో ఒకరైతు భూమి కోర్టు వివాదంలో ఉంటే.. ఆ మొత్తం 10 ఎకరాల భూమిని ధరణి నిషేధిత జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఆ ఒక్క రైతు భూమిపై ఉన్న వివాదానికి సంబంధించిన కోర్టు ఆర్డర్‌ కాపీని ఽజత చేస్తూనే.. తహసీల్దార్‌ ఆర్‌ఐతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పిస్తే ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నారు. దీంతోపాటు ఒక సర్వే నంబర్‌లోని 100 ఎకరాల భూమిలో కేవలం 10 ఎకరాల భూమిని ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం సేకరిస్తే.. మిగిలిన 90 ఎకరాలను కూడా ధరణి నిషేధిత జాబితాలో చేర్చారు. ఇలాంటి అంశాలపై తహసీల్దార్‌, ఆర్‌ఐ క్షేత్రస్థాయిలో విచారణ చేసి, కేవలం ప్రభుత్వం సేకరించిన భూమిని మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చి, మిగిలిన 90 ఎకరాల విడుదల కోరుతూ నివేదిక ఇస్తే.. కలెక్టర్‌ ఒకే ఒక్క క్లిక్‌తో పట్టా భూములను విడుదల చే స్తున్నారు. 


సీఎస్‌ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు, కేవలం వారంలోనే నిషేధిత జాబితాలోని 80ు భూములను విడుదల చేయనున్నట్లు ఓ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. కాగా, తహసీల్దార్లకు ఇచ్చిన టార్గెట్ల ప్రకారం పారదర్శకంగా పూర్తిచేసేలా పక్కా ప్రణాళిక రూపొందించామని, అదనపు కలెక్టర్లతో కలిసి రోజులో రెండుసార్లు తహసీల్దార్లతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి ప్రతి రెవెన్యూ గ్రామంలో నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములను విడుదల చేస్తున్నామని మరో జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటికే నిషేధిత జాబితా నుంచి విడిపించాల్సిన భూములు, అందుకు గల కారణాలను పేర్కొంటూ గ్రామాల వారీగా రూపొందించిన ఎక్సెల్‌ షీట్ల నివేదికల జాబితా 10 జిల్లాల కలెక్టర్లకు చేరిందని, మిగిలిన జిల్లాల్లోనూ వారంలోపు పూర్తవుతుందని ఓ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2021-11-30T08:07:52+05:30 IST