3,524 ఎస్జీటీ పోస్టులకు మోక్షం

ABN , First Publish Date - 2020-09-23T09:42:53+05:30 IST

డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌కు సంబంధించిన 3,524 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టుల భర్తీకి లైన్‌ క్లియరైంది.

3,524 ఎస్జీటీ పోస్టులకు మోక్షం

డీఎస్సీ-2018 అభ్యర్థులకు రేపు సర్టిఫికెట్ల పరిశీలన

త్వరలో డీఎస్సీ-2020 నోటిఫికేషన్‌: మంత్రి సురేశ్‌


అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌కు సంబంధించిన 3,524 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టుల భర్తీకి లైన్‌ క్లియరైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను హైకోర్టు కొట్టేయడంతో ఆ డీఎస్సీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులతో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు. 3,524 ఎస్జీటీ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. 2,203 మంది అభ్యర్థుల వెరిఫికేషన్‌ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన 1321 మంది అభ్యర్థులకు ఈనెల 23న ఎస్‌ఎంఎస్‌ చేస్తారన్నారు. 24న సర్టిఫికెట్ల పరిశీలన, 25-26 తేదీల్లో అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌ ఆర్డర్లు ఇస్తారన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 28 నుంచి పాఠశాలల్లో విధుల్లో చేరుతారని చెప్పారు. మరో 949 పోస్టులకు భర్తీ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని,  374 భాషా పండిట్లు(ఎ్‌సఏ), 486 పీఈటీ, పీడీ పోస్టులు, 89 ప్రిన్సిపాల్‌ పోస్టులకు కోర్టు కేసులకు లోబడి నియామకాలు చేపడతామన్నారు.


అలాగే, త్వరలో డీఎస్సీ-2020 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. స్పెషల్‌ డీఎస్సీతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఎస్సీలకు సంబంధించి త్వరలో నియామక ప్రక్రియ చేపడతామన్నారు. ఇంటర్‌ విద్యలో సిలబస్‌ కుదించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త కాలేజీలకు అనుమతిచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో ఇంటర్‌ అడ్మిషన్లు చేపడతామన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లు ఉపాధ్యాయులకు జీతాలివ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-09-23T09:42:53+05:30 IST