మెడికల్‌ కళాశాలకు మోక్షం

ABN , First Publish Date - 2022-08-07T05:44:18+05:30 IST

కామారెడ్డి జిల్లాలో ఎట్టకేలకు మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు మోక్షం కల్గింది. కామారెడ్డిలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులతో పాటు పట్టణవాసులు అన్ని వర్గాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తున్నారు. పట్టణవాసుల కల ఎట్టకేలకు మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో నెరవేరనుంది.

మెడికల్‌ కళాశాలకు మోక్షం

- కామారెడ్డికి మెడికల్‌ కళాశాలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

- జీవో 93 జారీ చేస్తూ ఉత్తర్వులు.. 100 సీట్ల కేటాయింపు

- కళాశాల నిర్మాణానికి రూ.235 కోట్లు మంజూరు

- జిల్లా కేంద్రంలో 20 ఎకరాల్లో నిర్మించనున్న మెడికల్‌ కళాశాల

- మెడికల్‌ కళాశాలతో ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారనున్న కామారెడ్డి

- ఉపాధి విద్యా అవకాశాలు కలిగే అవకాశం

- మెడికల్‌ కళాశాలతో నెరవేరనున్న కామారెడ్డివాసుల కల


కామారెడ్డి, ఆగస్టు 6(ఆంఽధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో ఎట్టకేలకు మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు మోక్షం కల్గింది. కామారెడ్డిలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులతో పాటు పట్టణవాసులు అన్ని వర్గాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తున్నారు. పట్టణవాసుల కల ఎట్టకేలకు మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో నెరవేరనుంది. జిల్లా నూతన కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కామారెడ్డిలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేస్తూ సీఎం కేసీఆర్‌ తన హామీని నెరవేర్చుకున్నారు. మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 93ను జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వందసీట్లతో కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. కళాశాల నిర్మాణానికి రూ.235 కోట్ల నిధులను కేటాయిస్తూ జీవోలో పొందుపరిచింది.

20 ఎకరాల్లో కళాశాల నిర్మాణం

ఏడాదిలోగా కామారెడ్డిలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని గత సంవత్సరం కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు జిల్లాలకు మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కామారెడ్డి జిల్లాకు సైతం మెడికల్‌ కళాశాలను కేటాయించారు. కామారెడ్డిలో మెడికల్‌ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దానిపై ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ నేతృత్వంలో జిల్లా ఉన్నతాధికారులు భూకేటాయింపుపై పరిశీలించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, డెయిరీ కళాశాల వెనుక ఉన్న ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మాతా,శిశు సంరక్షణ ఆసుపత్రి మధ్యలో ప్రభుత్వానికి సంబంధించిన 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు.  ఈ 20 ఎకరాలలోనే మెడికల్‌ కళాశాలను నిర్మించినట్లయితే మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి, ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారేందుకు వీలుగా ఉంటుందని జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. మెడికల్‌ కళాశాలకు ఇదే అనువైన స్థలంగా గుర్తించి జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం సైతం ఆమోదించి ఆ 20 ఎకరాల్లోనే మెడికల్‌ కళాశాలను నిర్మించాలని జీవో జారీ చేసింది.

ఎడ్యుకేషన్‌ హబ్‌గా కామారెడ్డి

కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు డెయిరీ కళాశాలలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఇంటర్‌ మీడియట్‌, బీఈడీ కళాశాలలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కళాశాలలో డిగ్రీ కాకుండా పీజీ కోర్సులు ఉన్నాయి. ఈ కళాశాలలో చదువుకున్న వారు చాలా ఉన్నత స్థాయిలో ఎదిగారు. డెయిరీ కళాశాల సైతం రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. వీటికి తోడుగా కొత్తగా మెడికల్‌ కళాశాల ఏర్పడితే కామారెడ్డి పట్టణవాసులకే కాకుండా జిల్లా యువతకు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్‌, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్‌ వాసులకు సైతం విద్యాపరంగా కామారెడ్డి ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు యువతకు ఉపాధి,విద్యా అవకాశాలు మరింత చెరువయ్యే అవకాశాలు ఉంటాయి. 

వైద్యసేవలు మెరుగుపడే అవకాశం

కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆసుపత్రిగా కొనసాగుతోంది. జిల్లా కేంద్ర ఆసుపత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఏరియా ఆసుపత్రిలో ఉండే బెడ్లు మాత్రమే ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి రోగుల తాకిడికి సరిపోకపోవడంతో మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని మంజూరు చేయడంతో పాటు ఆ పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. కామారెడ్డికి మెడికల్‌ కళాశాలను మంజూరు చేయడంతో పేద ప్రజలకు వైద్యసేవలు చేరువయ్యే అవకాశాలు ఉంటాయి. వంద సీట్లతో ఏర్పాటు చేసే మెడికల్‌ కళాశాల విద్యార్థులు విద్యనభ్యసించడంతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులలో సేవలు అందిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మెడికల్‌ కళాశాలతో కాస్తా వైద్యసేవలు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి.


సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు

- గంప గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌

కామారెడ్డికి మెడికల్‌ కళాశాలను మంజూరు చేయడమే కాకుండా 100 సీట్లను కేటాయించి భవన నిర్మాణానికి రూ.235 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావులకు జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కామారెడ్డికి మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఏడాదిలోనే ఇచ్చిన హామీని కేసీఆర్‌ నెరవేర్చి కామారెడ్డి పట్టణ వాసుల కలను తీర్చారు. మెడికల్‌ కళాశాలతో జిల్లాలోని పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అంద నున్నాయి. అంతేకాకుండా జిల్లాలోని విద్యార్థులకు, యువతకు వైద్యవిద్యతో పాటు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మెడికల్‌ కళాశాలతో కామారెడ్డి ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారనుంది. త్వరలోనే మెడికల్‌ కళాశాల భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించి పనులను చేపడుతాం.

Updated Date - 2022-08-07T05:44:18+05:30 IST