పరిష్కరిస్తారా?

ABN , First Publish Date - 2022-08-06T05:15:35+05:30 IST

వంశధార ప్రాజెక్ట్‌ను శనివారం జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించనున్నారు. కాట్రగడ్డ వద్ద ఓపెన్‌ హెడ్‌ చానల్‌, నేరడి బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్నారు.

పరిష్కరిస్తారా?
వరద కాలువ ముఖద్వారాన్ని పరిశీలించనున్న మంత్రి

సాగునీటి వనరుల పనులకు మోక్షమెప్పుడో!

నేడు జలవనరులశాఖ మంత్రి పర్యటన

వంశధార ప్రాజెక్ట్‌ సందర్శన 

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

(భామిని/పాలకొండ)

వంశధార ప్రాజెక్ట్‌ను శనివారం జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించనున్నారు. కాట్రగడ్డ వద్ద ఓపెన్‌ హెడ్‌ చానల్‌, నేరడి బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని  పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వంశధార ఎస్‌ఐ డి.తిరుమలరావు తెలిపారు. ఇప్పటికే ఓపెన్‌ హెడ్‌ చానల్‌ వద్దకు వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా అక్కడున్న మట్టి రోడ్డు చదును చేశారు. కాగా ఏ ముహూర్తాన నేరడి వరదకాలువ పనులు ప్రారంభించారో గాని నేటికీ పూర్తికావడం లేదు. దీంతో మండల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భామిని మండలంలో వరద కాలువ నుంచి పిల్ల కాలువలతో సాగునీరు అందిస్తామని ప్రతిపాదనలు కాగితాలకే పరిమిత మయ్యాయి. గెడ్డలు, వాగులు, చెరువుల నుంచి వచ్చే నీరుకు వరదకాలువ అడ్డుగా మారుతోంది. దీంతో వ్యవసాయానికి నష్టం వాటిల్లుతోంది.  వరదల సమయంలో  సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వల్ల  పంటలు నాశనమవుతున్నాయి. అసలు హిరమండలం జలాశయం నుంచి వరదనీరు తరలించాలంటే కొత్తగా గొట్టాబ్యారేజ్‌ వద్ద ఎత్తిపోతల పథకం పనులు చేపట్టాల్సి ఉంది. ఇదిలా ఉండగా వరదకాలువ గట్టు వంతెనపై పైపులు కొట్టుకుపోవడం వల్ల నులకజోడవాసులు రహదారి కష్టాలు ఎదుర్కొంటున్నారు. బిల్లుమడ పసుకుడి, దిమ్మిడిజోల, పెద్దదిమిలి వరదకాలువలపై నుంచి వంతెనలు ఏర్పాటు చేశారు కానీ అప్రోచ్‌రోడ్డును మరిచారు.  గత ఏడాది  బ్యారేజ్‌ నిర్మాణ స్థలాన్ని అప్పటి జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌  పరిశీలించారు. అదేవిధంగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బ్యారేజ్‌ నిర్మాణానికి చర్చించారు. అవన్నీ జరిగినా..  పనుల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఇక భామిని మండలంలో కొండలేయ గెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణం 16 ఏళ్లుగా కొనసా...గుతూనే ఉంది. సుమారు 2వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో  పాలకొండ మండలంలోని చేపట్టిన జంపరకోట జలాశయం పనులు కూడా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేపడతామని హడావుడి చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.  ఈ సమస్యలపై ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి దృష్టిసారించి పరిష్కారానికి కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.  

   

Updated Date - 2022-08-06T05:15:35+05:30 IST