ఎన్నేళ్లీ బతుకులు?

ABN , First Publish Date - 2022-07-28T05:00:18+05:30 IST

ప్రభుత్వ శాఖల్లో వారే కీలకం. ఏ పని జరగాలన్నా ఆ ఉద్యోగుల సహకారం అవసరం. అయితే ఏం పాపం చేశారో ఏమో.. ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా.. గుర్తింపు లభించడం లేదు. ఉద్యోగ భద్రత కూడా ఉండడం లేదు.

ఎన్నేళ్లీ బతుకులు?
పార్వతీపురం మునిసిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మోక్షమెప్పుడో!

  దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్నా గుర్తించని వైనం

  రెగ్యులర్‌ చేయని పరిస్థితి 

 అరకొర జీతాలతోనే సేవలు

  హామీలను నెరవేర్చని ప్రభుత్వం

( పార్వతీపురం - ఆంధ్రజ్యోతి )

ప్రభుత్వ శాఖల్లో వారే కీలకం. ఏ పని జరగాలన్నా ఆ ఉద్యోగుల సహకారం అవసరం. అయితే ఏం పాపం చేశారో ఏమో.. ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా.. గుర్తింపు లభించడం లేదు.  ఉద్యోగ భద్రత కూడా ఉండడం లేదు. చాలీచాలని జీతాలతోనే బతుకు బండిని నెట్టుకొస్తున్నారు.   సమస్యలను పరిష్కరిస్తామని హామీలిచ్చిన ప్రభుత్వం నేడు ఆ ఊసెత్తడం లేదు. దీంతో వారు మరింతగా ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. 

జిల్లాలో ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వేలాది మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా వారు సేవలు అందిస్తున్నా.. నేటికీ రెగ్యులర్‌ కాని పరిస్థితి ఏర్పడింది. కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదు. అరకొర జీతాలతోనే పనులు చేస్తున్నారు.  తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగుల మాదిరిగా తమను కూడా గుర్తించాలని  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

జిల్లాపరిధిలోని దాదాపు 54 ప్రభుత్వ శాఖల్లో సుమారు 8 వేల మంది  ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. అత్యధికంగా విద్య, వైద్య శాఖలతో పాటు గిరిజన సంక్షేమశాఖ, గురుకులాలు, పశుసంవర్థక శాఖ, జిల్లాపరిషత్‌, పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ పథకంలో ఎక్కువమంది  దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు.  ప్రధానంగా జిల్లా వైద్యశాఖ పరిధిలో కాంట్రాక్టు ప్రాతిపదికన మల్టీపర్పస్‌ (మేల్‌) హెల్త్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు ఇలా వివిధ కేటగిరీల్లో అనేకమంది ఉద్యోగులు దశాబ్దాలుగా అరకొర జీతాలతోనే సేవలందిస్తున్నారు.  మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు (మేల్‌) విషయానికొస్తే.. గత 19 ఏళ్లుగా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న వారికి  జీవో నెంబరు 27 ప్రకారం ఆండోరియం కింద రూ. 27,800 అందిస్తున్నారు. జీవో నెంబరు 27ను రద్దు చేసి వేతనాలు అందిస్తే వీరికి కనీసం రూ. 50 వేలు వేతనం అందుతుంది. ఆ విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.  ఒక్క వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోనే సుమారు 3,600 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 

  ఉపాధి హామీ పథకంలో 2006 నుంచి టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లతో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇలా అనేకమంది విధులు నిర్వహిస్తున్నారు. వారికి   అరకొరగానే జీతం వస్తోంది. ఉద్యోగ భద్రత కూడా లేదు.  తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నప్పటికీ పాలకులు స్పందించడం లేదు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్‌కు ఫీల్డ్‌ అసిస్టెంట్లు వినతిపత్రాలను అందించారు. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని, జీతాలు పెంచుతామని నాడు హామీ ఇచ్చిన సీఎం నేటికీ నెరవేర్చలేదు. 

  గిరిజన సంక్షేమశాఖ పరిధిలో గురుకులాలు, వివిధ విద్యా సంస్థలు, పంచాయతీరాజ్‌, గిరిజన ఇంజినీరింగ్‌శాఖల పరిధిలో అనేకమంది ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. వారు కూడా చాలీచాలని జీతాలతోనే విధులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం బాగోలేని సమయంలో సెలవు పెడితే జీతాన్ని కటింగ్‌ చేస్తున్నారు.   నెలకు ఒకరోజు  మాత్రమే  వేతనంతో కూడిన  సెలవు ఇస్తున్నారు.  ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు విధుల్లో మృతి చెందితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందించడం లేదు.  ఉద్యోగులే చందాలు వేసుకుని మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకుంటున్నారు.  ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. మలేరియా డిపార్ట్‌మెంట్‌లో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి  మృతి చెందడంతో ఆ శాఖ ఉద్యోగులే సుమారు రూ. 2 లక్షల మేర చందాలెత్తి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.  మొత్తంగా జిల్లాలో అనేక మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సేవలందిస్తున్నా గుర్తించకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 

  కాంట్రాక్టు కార్మికుల నిరసన 

పార్వతీపురంటౌన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని ఇంజనీరింగ్‌ విభాగం కాంట్రాక్టు కార్మికులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట  నిరసన వ్యక్తం చేశారు.  తమకు జీతాలు పెంచడంతో పాటు 21 నెలల ఏరియర్స్‌ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఐటీఐ సర్టిఫికెట్లు లేవన్న సాకుతో నైపుణ్యానికి అనుగుణంగా జీతాలు చెల్లించకపోవడం భావ్యం కాదన్నారు.  డ్రైవర్లు, ఎలక్ర్టీషియన్లు, ఫిట్టర్లు, వాల్‌ ఆపరేటర్లుగా  15 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న తాము చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.  జీవో నెంబరు 109 ప్రకారం జీతాలు ఇవ్వాలని లేకుంటే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.  అనంతరం కమిషనర్‌ ఆనంద్‌కుమార్‌కు వినతపత్రం అందజేశారు. ఈ నిరసనలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-07-28T05:00:18+05:30 IST