ఎట్టకేలకు మోక్షం

ABN , First Publish Date - 2022-08-10T05:53:09+05:30 IST

ఆసరా పింఛన్ల కోసం మూడున్నర ఏళ్ల ఎదురుచూపులకు మోక్షం కలుగనుంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లను అందిస్తామని ఇటీవల సీఎం ప్రకటించడంతో అర్హులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టకేలకు మోక్షం

- పంద్రాగస్టు నుంచి కొత్త ఆసరా పింఛన్లు

- 42వేలకు పైగా కొత్త ఆసరా ఫించన్ల మంజూరు

- డయాలసిస్‌ రోగులకు సైతం పింఛన్లు

- 57 ఏళ్లు నిండిన వారికి కూడా అందనున్న ఆసరా

- ప్రస్తుతం జిల్లాలో ప్రతీనెల 1.47 లక్షల మందికి పింఛన్లు


కామారెడ్డి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఆసరా పింఛన్ల కోసం మూడున్నర ఏళ్ల ఎదురుచూపులకు మోక్షం కలుగనుంది. ఆగస్టు 15 స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లను అందిస్తామని ఇటీవల సీఎం ప్రకటించడంతో అర్హులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పింఛన్‌ అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో అందుకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో కొత్త సాఫ్ట్‌వేర్‌ మార్చుతున్నట్లు జిల్లా డీఆర్‌డీవో అధికారులు పేర్కొంటున్నారు. నూతన పింఛన్ల కోసం గత మూడేళ్లుగా అర్హులు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. సుమారు 42వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా వారికి పంద్రాగస్టు నుంచి పింఛన్లను అందజేయనున్నారు. వీరితో పాటు డయాలసిస్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారికి సైతం ఆసరా పింఛన్లను ఇవ్వనున్నారు. జిల్లాలో ఇప్పటికే 1.47 లక్షల మందికి పింఛన్లను అందజేస్తున్నారు. 

గత ఎన్నికల్లో హామీ

జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు పింఛన్లు మంజూరు కాలేదు. ఎన్నికల సమయంలో 57 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఎన్నికలు అయి దాదాపు మూడున్నర ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ కొత్త పింఛన్లు ఒక్కటి కూడా మంజూరుకు నోచుకోవడం లేదు. జిల్లాలో 65 ఏళ్లు దాటిన వారు పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ అధికారులు మంజూరు మాత్రం చేయడం లేదు. తమకు వచ్చిన దరఖాస్తుల్లో అర్హులని గుర్తించి ప్రభుత్వానికి పంపించి వదిలివేస్తున్నారు. అక్కడి నుంచి కొత్త పింఛన్లకు అనుమతులు ఇవ్వడం లేదు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు చేనేత, బీడీ, గీత కార్మికులు ఉన్నారు. వీరంతా మండల పరిషత్‌ కార్యాలయాల్లో జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణికి వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. తమకు ఎవరూ లేరని ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. 57 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తామని కేసీఆర్‌ చేసిన ప్రకటన కూడా అమలుకు నోచుకోలేదు. తాజాగా పంద్రాగస్టు నుంచి కొత్తగా ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇస్తామంటూ సీఎం ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సంబంధిత శాఖ అధికారులు చేస్తున్నారు.

కొత్త పింఛన్ల కోసం 50వేలకు పైగా దరఖాస్తులు

అర్హులందరికీ ఆసరా పథకం కింద పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. దీంతో చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 50వేల మందికి పైగా ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో దాదాపు 42 వేల మంది వివిధ రకాల ఆసరా పింఛన్ల కోసం మూడున్నర ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. దీనికి తోడు 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా అందిస్తామని గత ఎన్నికల సమయంలోనే సీఎం హామీ ఇచ్చారు. ఏడాదిన్నర కిందట దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 57 ఏళ్లు దాటిన వారు 26,152 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందే దరఖాస్తు చేసుకున్నవారితో కలిపి దాదాపు 50వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న వాటిని సంబంధిత శాఖ అధికారులు పరిశీలించారు. మొత్తం 42 వేల మంది కొత్త ఆసరా పింఛన్లకు అర్హులుగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరికీ పంద్రాగస్టు నుంచి పింఛన్లు అందనున్నాయి. వీరితో పాటు మరో 200 మంది డయాలసిస్‌ రోగులకు కూడా మంజూరు చేయనున్నారు.

ప్రస్తుతం జిల్లాలో 1.47లక్షల ఆసరా పింఛన్లు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో ఆయా మండలాల్లో, గ్రామాల్లో ప్రస్తుతం మొత్తం 1,47,522 ఆసరా పింఛన్లు ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 38,806 ఉండగా వితంతు పింఛన్లు 47,044, వికలాంగుల పింఛన్లు 17,538, చేనేత కార్మిక పింఛన్లు 597, కల్లుగీత కార్మికుల పింఛన్లు 680, బీడీ కార్మికుల పింఛన్లు 36,847, ఒంటరి మహిళల పింఛన్లు 4,369, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు 1,127, మలేరియా వ్యాధిగ్రస్తులు 513 మంది ఉన్నాయి. వీరందరికీ గాను ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల పైగా నిధులను విడుదల చేస్తోంది. వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.78 కోట్లు, వితంతు ఫించన్ల కోసం రూ.94 కోట్లు, వికలాంగులకు రూ.52 కోట్లు, చేనేత కార్మికులకు రూ.1.20 కోట్లు, కల్లుగీత కార్మికులకు 1.30 కోట్లు, బీడీ కార్మికులకు రూ.74కోట్లు, ఒంటరి మహిళలకు రూ.8కోట్లు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు రూ.2కోట్లు, ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు రూ.1 కోటి ప్రభుత్వం ఆసరా పింఛన్ల కింద విడుదల చేస్తోంది.

Updated Date - 2022-08-10T05:53:09+05:30 IST