Abn logo
Jan 18 2021 @ 00:00AM

పోనంగ్‌కు సెల్యూట్‌!

పోనంగ్‌ డోమింగ్‌ భారతసైన్యంలో ఒక ఆశారేఖ. ఇటీవల సైన్యంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకి ఎదిగిన ఆమె ఆ హోదాను సాధించిన అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.


భారత సైన్యంలో లెఫ్టెనెంట్‌ కల్నల్‌ హోదా పొందిన పోనంగ్‌ డోమింగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌కి చెందిన వారు. ఆ రాష్ట్రంలో ఈ హోదాను పొందిన తొలి మహిళ పోనంగ్‌. ఆమె  సాధించిన ఈ అపూర్వ విజయంపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు. ‘పోనంగ్‌ చరిత్ర సృష్టించింది. ఇది మనందరం గర్వించదగ్గ క్షణాలు’ అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖాండు సైతం ట్వీట్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తంచేయడం విశేషం. సైన్యంలో మహిళలను ఆఫీసర్‌ ర్యాంకుల్లో  తీసుకుంటున్నారు. గత ఏడాది దీనిపై  ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటన కూడా చేసింది. భారత సైన్యంలో మహిళా ఆఫీసర్లు 3.80 శాతం ఉంటే, నౌకాదళంలో మహిళా అధికారులు ఆరు శాతం ఉన్నారు. ఇక వైమానిక దళంలో వీరు 13.9 శాతం ఉన్నారు. 


పోనంగ్‌ కూడా సైన్యంలో తొలుత మహిళా అధికారిగానే బాధ్యతలు నిర్వహించారు. మహిళలు ఈ రంగంలో ఆఫీసర్ల హోదాకే  పరిమితమైన సమయంలో పోనంగ్‌ డోమింగ్‌ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ ర్యాంకుని పొందడం ఎంతోమంది స్త్రీలకు స్ఫూర్తినిస్తుంది. తన పదోన్నతిపై పోనంగ్‌ ఆనందానికి హద్దులు లేవు. తనను వరించిన ఈ హోదాపై పోనంగ్‌ మనసారా తన సంతృప్తిని వ్యక్తంచేశారు. ఈ పదోన్నతితో దేశం పట్ల తన బరువు బాధ్యతలు మరింత పెరిగాయని పోనంగ్‌ అంటారు. జాతి పట్ల మరింత నిబద్ధతతో విధులు నిర్వహించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం తనను ప్రశంసించడం పట్ల పోనంగ్‌ ఆనందం వ్యక్తంచేస్తూ ‘సిఎం మాటలు నన్ను దేశ సేవ విషయంలో మరింత కష్టపడి పనిచేయాలనే ప్రేరణను కలిగించాయి’ అని స్పందించారు.   

 

సైన్యంలో లెఫ్టెనెంట్‌ కల్నల్‌ హోదా పొందిన పోనంగ్‌ నిజంగానే స్వయంసాధి కారతను సాధించారు. ఎంతో ధైర్యసాహసాలుగల మహిళగా తనను తాను నిరూపించుకున్నారు. పసిఘాట్‌లోని డేయింగ్‌ ఎర్రింగ్‌ సెకండరీ ప్రభుత్వ పాఠ శాలలో పోనంగ్‌ చదివారు. పన్నెండవ తరగతిని ఐజిజె ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీలో పూర్తిచేశారు. 2005లో మహారాష్ట్రలోని వాల్‌చాంద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ నీరింగ్‌లో సివిల్‌ ఇంజ నీరింగ్‌ని పూర్తిచేశారు. ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత కోల్‌కతాలోని ఎల్‌ అండ్‌ టి కంపెనీలో రెండు సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలోనే అలహాబాద్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు పరీక్షలకు  పోనంగ్‌ ప్రిపేర్‌ అయ్యారు. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌కి సిద్ధమయ్యారు. ఆ పరీక్షల్లో విజయం సాధించారు. 2008లో భారత సైన్యంలోకి పోనంగ్‌ ప్రవేశించారు. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు అసెస్‌మెంట్‌ తర్వాత ఆమెను చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీకి పంపారు. అక్కడ ఆమె శిక్షణ పొందారు. ఆ తర్వాత భారతసైన్యంలో లెఫ్టినెంట్‌గా పోనంగ్‌ని నియమించారు. తన పనితనంతో కేవలం నాలుగున్నరేళ్లల్లోనే పోనంగ్‌ మేజర్‌ ర్యాంకుకు చేరారు. సర్వీసులోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా ముగియకుండానే పోనంగ్‌ 2014 ఏప్రిల్‌లో డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతిరక్షక దళంతో పనిచేశారు. కాంగోలో ఆరు నెలల పాటు విధులు నిర్వహించారు. ‘ఇది నా కెరీర్‌లో ఎంతో విలువైన సమయం’ అంటారామె. అక్కడ విధులు నిర్వహించే క్రమంలో ఎన్నో విషయాలను కళ్లారా చూశాను.... తెలుసుకున్నాన’ని ఆమె అంటారు. ప్రస్తుతం ఆమె పుణేలో విధులు నిర్వహిస్తున్నారు. భారత సైన్యంలో 13 సంవత్సరాల పాటు వివిధ పదవుల్లో విధులు నిర్వహించిన ఆమె గత ఏడాది లెఫ్టెనెంట్‌ కల్నల్‌ హోదాను పొందారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా పొందగలగడం తనకే కాదు తన తల్లిదండ్రులకు సైతం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె అంటారు. ‘నేను అందరు అమ్మాయిలకు చెప్పేదొక్కటే. మీకు నచ్చిన రంగం ఎంచుకోండి. అందులో ప్రవేశించి ఉన్నత స్థానాలను అధిరోహించడానికి నిర్విరామంగా శ్రమించండి. ఎవ్వరికీ మనం తీసిపోము’ అంటారు. ‘అంతేకాదు ఉన్నతమైన కలలు కనండి. కలలు కనడం ఎంత ముఖ్యమో ఆ కలలను సాకారం చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు అడుగువేయడం కూడా అంతే ముఖ్యం’ అని పోనంగ్‌ అంటారు. 


అరుణాచల్‌ రాష్ట్రంలోని ఈస్ట్‌ సియాంగ్‌లోని పసిఘాట్‌లో పోనంగ్‌ జన్మించారు. కుటుంబంలో పోనంగ్‌ పెద్ద అమ్మాయి. ఆమెకు మరో ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు ఒలోమ్‌ డూమింగ్‌, జిమ్మి డై డూమింగ్‌. అటవీశాఖలో ఉద్యోగం చేసే పోనంగ్‌ తల్లి సామాజిక సేవకురాలు కూడా. ‘ఆది బనె కెబాంగ్‌’ సంస్థలో కార్యకర్తగా ఆమె పనిచేస్తున్నారు. ఈ సంస్థ ఆది తెగ సంక్షేమం కోసం పనిచేస్తోంది.

Advertisement
Advertisement
Advertisement