కరోనా థర్డ్ వేవ్ కారణంగా పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్’ లాంటి సినిమాలతో పాటు అజిత్ ‘వలిమై’ కూడా విడుదలను వాయిదా వేసుకుంది. అలాగే ‘డీజే టిల్లు’ లాంటి చిన్న సినిమాలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఇక ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో క్రేజీ మూవీ కూడా వచ్చి చేరింది. మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ నటించిన ‘సాల్యూట్’ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. దుల్ఖర్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై, రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ బ్యూటీ డయానా పెంటీ కథానాయికగా నటించింది.
‘సాల్యూట్’ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించారు నిర్మాతలు. అదే సమయంలో తెలుగులో కూడా విడుదల చేయాలనుకున్నారు. ‘కురుప్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించడంతో ‘సాల్యూట్’ ని టాలీవుడ్ లో కూడా సంక్రాంతి రేస్ లోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. దుల్ఖర్ మొట్టమొదటి గా పోలీస్ వేషం వేస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ‘సాల్యూట్’ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయబోతారో చూడాలి.