బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అతడు తాజాగా నటిస్తున్న చిత్రం ‘కబీ ఈద్, కబీ దివాళీ’ (Kabhi Eid Kabhi Diwali). ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది. బాలీవుడ్ బాయ్‌జాన్ సొంత నిర్మాణ సంస్థ ‘సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్’ (Salman Khan Films) నిర్మిస్తుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే(Pooja Hegde), వెంకటేష్, జహీర్ ఇక్బాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో మూవీని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుండగానే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బాలీవుడ్లో షికార్లు కొడుతుంది.
‘కబీ ఈద్, కబీ దివాళీ’ లో సల్మాన్ ఖాన్ చెల్లెలి భర్త ఆయుశ్ శర్మ(Aayush Sharma) కూడా నటిస్తున్నాడు. అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నట్టు బీ టౌన్లో వదంతులు హల్చల్ చేస్తున్నాయి. సృజనాత్మక విభేదాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికీ చెందిన వ్యక్తి ఈ వార్తలపై స్పందించాడు. ‘‘.. ‘కబీ ఈద్, కబీ దివాళీ’ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆయుశ్ కూడా షూటింగ్లో ఇప్పటికే పాల్గొన్నాడు. ఒక రోజు చిత్రీకరణను కూడా పూర్తి చేశాడు. కానీ, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, ఆయుశ్ మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. దీంతో అతడు ఈ చిత్రం నుంచి తప్పుకొన్నాడు’’ అని చిత్ర బృందానికీ చెందిన వ్యక్తి తెలిపాడు. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఆయుశ్ తప్పుకొవడంతో చిత్ర విడుదల ప్రశ్నార్థకమయ్యే సూచనలున్నాయి. అతడి పాత్ర కోసం మేకర్స్ మరొకరిని సంప్రదిస్తున్నారు. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ భర్తే ఆయుశ్ శర్మ అన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఈ చిత్రంలో వెంకటేష్ చెల్లెలుగా కనిపించనుందని సమాచారం.