బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా.. ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'రాధే'. తాజాగా ఈ చిత్ర విడుదలపై సల్మాన్ ఖాన్ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని రాబోయే ఈద్‌కు విడుదల చేయబోతోన్నట్లుగా అధికారికంగా ఓ లెటర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని రూ. 230 కోట్లకు జీ స్టూడియోస్ అన్ని హక్కులను సొంతం చేసుకుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో స్వయంగా సల్మానే ఈ చిత్రం థియేటర్లలో విడుదల అవుతుంది అంటూ ప్రకటించడం విశేషం.
''థియేటర్స్ ఓనర్స్ గురించి స్పందించడానికి నాకు ఇంతకాలం పట్టినందుకు క్షమించాలి. ఈ కష్టకాలంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను నేను అర్థం చేసుకున్నాను. అందుకే వారందరికీ సహాయం చేసేందుకు 'రాధే' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. ప్రతిగా వారు ఈ చిత్రాన్ని చూడడానికి వచ్చే ప్రేక్షకుల కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఈద్‌కి 'రాధే' చిత్రం రిలీజవుతుంది. అందరూ థియేటర్లలో ఎంజాయ్ చేయండి..'' అని సల్మాన్ ఖాన్ తన లెటర్లో తెలిపారు.