గుట్కా జోరు..?

ABN , First Publish Date - 2020-06-05T10:29:10+05:30 IST

ప్రజారోగ్యానికి చేసిన చట్టాలు చట్టుబండలవుతున్నాయి. చట్టాలను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రజల ప్రాణాలు గాలిలో

గుట్కా జోరు..?

  • రహస్యంగా అమ్మకాలు 
  • చోద్యం చూస్తున్న నిఘా యంత్రాంగం 

బద్వేలు, జూన్‌ 4: ప్రజారోగ్యానికి చేసిన చట్టాలు చట్టుబండలవుతున్నాయి.  చట్టాలను అమలు  చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. అందుకు నిదర్శనమే గుట్కాల విక్రయాలు.  ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని వీటి విక్రయాలపై ప్రభుత్వం నిషేదం విధించింది. అయినా గుట్కాల జోరు తగ్గడం లేదు. నిషేధం ఉండడంతో వ్యాపారులు రహస్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు. అధికరేట్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బద్వేలులో ఇద్దరు వ్యాపారులు ఇతర రాష్ర్టాల నుంచి గుట్కాలు దిగుమతి చేసుకుని బద్వేలు నియోజకవర్గ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.


సంబంధిత శాఖాధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పుడపుడు పోలీసులు దాడులు చేసి దుకాణాలలో విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం తప్ప  అసలు గుట్కా సరఫరా చేస్తున్న సూత్రధారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బద్వేలులో గుట్కా విక్రయాలు జోరుగా సాగుతోంది. మే 28వ తేదీన గోపవరం మండలం పీపీకుంట చెక్‌పోస్టు వద్ద దాదాపు రూ.7లక్షలు, అలాగే మైదుకూరు నియోజకవర్గపరిధిలోని బ్రహ్మంగారిమఠం మండలం కమ్మవారిపల్లె పొలాల్లో డంపింగ్‌ చేసిన  రూ.20 లక్షలు విలువ చేసే గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక పక్క దాడులు చేస్తున్నప్పటికీ గుట్కా వ్యాపారం మాత్రం ఆగడం లేదు.


ప్రొద్దుటూరు కేంద్రంగా బద్వేలు నియోజకవర్గానికి భారీ ఎత్తున గుట్కాప్యాకెట్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. బద్వేలు పట్టణంలోని ఓ వ్యక్తి గోడౌన్‌ను ఏర్పాటు చేసుకొని హోల్‌సేల్‌గా గుట్కా విక్రయాలను సాగిస్తున్నట్లు సమాచారం. పట్టణాల్లో, గ్రామాల్లో బహిరంగంగానే గుట్కా విక్రయాలు విక్రయిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లోని కిరాణా దుకాణాల్లో బహిరంగ విక్రయాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు గుట్కా విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై సీఐ రమేష్‌బాబును వివరణ కోరగా గుట్కా నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించామని, ఎవరైనా గుట్కాలు విక్రయిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. పట్టణంలో ప్రత్యేకంగా టీమును ఏర్పాటు చేసి అనుమానం కలిగిన షాపులపై దాడులు నిర్వహిస్తున్నామన్నారు. 

Updated Date - 2020-06-05T10:29:10+05:30 IST