టీటీడీ అగరబత్తులు!

ABN , First Publish Date - 2021-09-08T07:05:45+05:30 IST

టీటీడీ నిర్వహణలో..

టీటీడీ అగరబత్తులు!
అగరబత్తుల తయారీ

13నుంచి విక్రయాలకు సన్నాహాలు


తిరుమల/తిరుపతి(ఆంధ్రజ్యోతి): టీటీడీ నిర్వహణలో వున్న ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళభరిత అగరబత్తులు తయారు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తిరుమల ఏడు కొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో ఈ నెల 13వ తేదీ నుంచి అగరబత్తుల విక్రయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ ఆలయాల్లో నిత్యం పూజలకు, అలంకరణలకు వినియోగించే పుష్పాలను అగరబత్తులుగా తయారుచేసి అందిస్తామని ముందుకొచ్చిన బెంగుళూరుకు చెందిన దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థతో టీటీడీ అవగాహన కుదుర్చుకుంది. ఎస్వీ గోశాలలో అగరబత్తుల తయారీకి అవసరమైన స్థలం కేటాయించింది.


దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సొంత ఖర్చులతో యంత్రాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించుకుని కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా అగరబత్తుల ఉత్పత్తిని ప్రారంభించింది. వినియోగం తర్వాత పుష్పాలను టీటీడీ ఉద్యానవనం సిబ్బంది గోశాలలోని అగరబత్తుల తయారీ కేంద్రానికి తరలించగానే ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వీటిని రకాల వారీగా వేరుచేస్తారు. తర్వాత డ్రైయింగ్‌ యంత్రంలో ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. అనంతరం ఆ పిండికి నీరు కలిపి కొన్ని పదార్థాలతో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని మరో యంత్రంలో వేసి అగరబత్తులు తయారుచేస్తారు.


వీటిని ప్రత్యేక యంత్రంలో 15 నుంచి 16 గంటల పాటు అరబెట్టిన తర్వాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావకంలో ముంచుతారు. చివరిగా వీటిని మరోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్‌ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తులు తయారుచేసేలా ఏర్పాట్లు చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్ల అగరబత్తులను తయారు చేస్తున్నారు.



రెండు ధరలు - ఏడు రకాలతో టీటీడీ అగరబత్తులు

తక్కువ అగరబత్తులున్నా ఎక్కువ సమయం వాసన వచ్చే ఫ్లోరా అగరబత్తులు నాలుగు రకాలు, ఎక్కువ అగరబత్తులుండి తక్కువ సమయం వెలిగే సాధారణ అగరబత్తులు మూడు రకాలను సిద్ధం చేస్తున్నారు. 65 గ్రాముల ఫ్లోరా అగరబత్తులు 125 రూపాయలు, 100 గ్రాముల సాధారణ అగరబత్తులు 60 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించారు. ఫ్లోరా అగరబత్తులపైన నెమలి పింఛం బొమ్మతో ఆకృష్టి, గుర్రం చూపులోని వేగంతో దృష్టి, హంస బొమ్మతో సృష్టి, గరుడ రెక్కలతో తృష్టి పేర్లతో ఫ్లోరా అగరబత్తులు సిద్ధమయ్యాయి. ఈ నాలుగింటి ధర ఒక్కొక్కటి 125 రూపాయలు. శ్రీవారి కఠి, వరద హస్తాలను ముద్రించి అభయహస్త, శ్రీవారి పాదాల బొమ్మతో దివ్యపాద, అన్నమయ్య బొమ్మతో తందనాన బ్రాండ్‌ ఈ మూడింటిలో ఒక్కో అగరబత్తి ధరను 60 రూపాయలుగా నిర్ణయించారు. 

Updated Date - 2021-09-08T07:05:45+05:30 IST