జోరుగా గట్కా, జర్దాల అమ్మకాలు

ABN , First Publish Date - 2021-01-25T05:20:53+05:30 IST

ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిషేధించిన పదార్థాలను అక్రమంగా నిలువలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు.

జోరుగా గట్కా, జర్దాల అమ్మకాలు
శనివారం చంద్రశేఖర్‌ కాలనీలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న తంబాకు

చంద్రశేఖర్‌కాలనీలో అక్రమంగా నిలువలు

టాస్క్‌ఫోర్స్‌ దాడులతో వెలుగులోకి

సొమ్ము చేసుకుంటున్న  నిర్వాహకులు

ఖిల్లా, జనవరి 24 : ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిషేధించిన పదార్థాలను అక్రమంగా నిలువలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు. తక్కువ వ్యవధిలో త్వరగా సొమ్ము చేసుకుందామనే ఆలోచనలో జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా, జర్దా లాంటిని అమ్ముతున్నారు. పోలీసులకు తెలియకుండా ఈ వ్యవహారం యథేచ్చగా కొనసాగుతోంది.  ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపధ్యంలో ఈ వ్యాపారాంపై ఉక్కుపాదం మోపడానికి పోలీసు కమిషనర్‌ ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం జిల్లాలో అక్రమంగా గుట్కా, జర్దా నిలువలను గుర్తించి నిర్వాహకుల భరతం పడుతోంది. అయినప్పటికీ ఈ వ్యాపారాన్ని కొందరు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. మరి కొందరు ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నట్లు ప్రజలను నమ్మించడానికి ప్రభుత్వం ద్వారా జీఎస్‌టీ లాంటి అనుమతులు సైతం తీసుకుని దానిని ఆసరాగ చేసుకుని అక్రమ వ్యాపారాలకు జీవం పోస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌కాలనీ(వసంత్‌నగర్‌)లో శనివారం అక్రమంగా జర్దా నిలువలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గుర్తించారు. కచ్చితమైన సమాచారం మేరకు అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిలువ ఉంచిన నిషేధిత ప్రదార్థాలైన జర్దా, ఖైని సుమారు రూ. 6లక్షల 30వేల విలువ గల వాటిని స్వాధీనం చేసుకున్నారు. గోదాం నిర్వాహకుడు చకిలం భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఎవరున్నది టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఈదాడులు నిజామాబాద్‌ అదనపు పోలీసు కమీషనర్‌ వి.అరవిందబాబు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌ షాకిర్‌అలీ, ఏఎస్‌ఐ రామకృష్ణ సిబ్బంది చేశారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాపారం జరగకుండా టాస్క్‌ఫోర్స్‌ నిఘా పెట్టి దాడులు చేస్తోంది. గతంలో కూడా జిల్లా కేంద్రంలో ఎన్నో అక్రమ గుట్కా నిలువలపై దాడులు చేసి లక్షల రూపాయల విలువ చేసే గుట్కా, జర్దాను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2021-01-25T05:20:53+05:30 IST