అమ్మేస్తున్నారు

ABN , First Publish Date - 2022-07-18T04:13:22+05:30 IST

అమ్మేస్తున్నారు

అమ్మేస్తున్నారు
జగతిమెట్ట సమీపంలో జగనన్న ఇళ్ల కాలనీ లేఅవుట్‌

జగనన్న ఇళ్ల స్థలాలను అమ్మేస్తున్నారు. రెండు, మూడు స్థలాలు తీసుకున్న బినామీలు బేరం పెడుతున్నారు. దళారులు రంగప్రవేశం చేసి పని కానిచ్చేస్తున్నారు. ఒకే వ్యక్తికి రెండు, మూడు పట్టాలు, స్థానికేతరులకు స్థలాలు ఇవ్వడం వల్లే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు కూడా మిన్నకుండి పోతున్నారు. టెక్కలి జగతిమెట్ట సమీపంలోని కాలనీలో ఈ దందా జోరుగా సాగుతోంది. 


- జగనన్న ఇంటి స్థలాల విక్రయం

- బేరమాడుతున్న దళారులు

- అనర్హులకు స్థలాలు ఇవ్వడం వల్లే..

- టెక్కలి జగతిమెట్ట కాలనీలో వ్యాపారం

(టెక్కలి/టెక్కలి రూరల్‌)

జగనన్న ఇంటి స్థలాల లబ్ధిదారుల ఎంపికలో స్థానిక అధికారపార్టీ నాయకులు కీలకంగా వ్యవహరించారు. దీంతో అనర్హులకు, వైసీపీ వర్గీయులకు ఒక్కొక్కరికి రెండు, మూటు పట్టాలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. నాయకులు సిఫార్సు చేయడంతో అధికారులు కూడా కిమ్మనకుండా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. టెక్కలి జగతిమెట్ట సమీపంలోని జగనన్న కాలనీ లేఅవుట్‌లో స్థలాలను కొందరు అమ్మకానికి పెట్టారు. ఇక్కడ అధికారులు 378 మందికి పట్టాలు ఇచ్చారు. పాతజాతీయ రహదారికి సమీపంలో ఉండడంతో వీటికి డిమాండ్‌ ఉంది. ఇదే అదనుగా భావించి దళారులు అప్పుడే రంగప్రవేశం చేశారు. అనర్హులు, బినామీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటిని తిరిగి అధిక ధరలకు అమ్ముకునేందుకు ప్లాన్‌ వేసుకున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. 


మచ్చుకు కొన్ని..

- టెక్కలి జగతిమెట్ట సమీపంలోని జగనన్న కాలనీలో ఓ వ్యక్తి తనకు మంజూరైన స్థలాన్ని పట్టణంలోని ఓ వ్యక్తికి అమ్ముకున్నాడు. ఈ స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి ఇంటి నిర్మాణం కూడా చేపట్టాడు.

- జగనన్న లేఅవుట్‌లో టెక్కలి సమీప గ్రామానికి చెందిన వ్యక్తికి పట్టా మంజూరైంది. ఇతను స్థలాన్ని పట్టణ శివారులో ఉంట్ను మరో వ్యక్తికి అమ్మినట్లు తెలిసింది. 

- టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఈ లేఅవుట్‌లో ఇంటి స్థలం కేటాయించగా.. సదరు వ్యక్తి టెక్కలి పట్టణానికి చెందిన ఒకరికి అమ్ముకున్నట్లు సమాచారం. 


ఎన్నో అక్రమాలు

టెక్కలి జగతిమెట్ట సమీపంలోని జగనన్న కాలనీలో అనర్హులకు కూడా ఇంటి స్థలాలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు వైసీపీ నాయకుల ప్రోద్బలంతో అనర్హులు పట్టాలు పొందినట్లు సమాచారం. 

- లేఅవుట్‌లో ఓ వ్యక్తి రెండు స్థలాలను కలుపుతూ పునాది వేశాడు. లబ్ధిదారుడిగా చెప్పుకుంటున్న సదరు వ్యక్తికి ఆ స్థలాను మంజూరు చేశారా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. 

- సంతబొమ్మాళి మండలానికి చెందిన వ్యక్తికి ఈ లేఅవుట్‌లో ఇంటి స్థలం మంజూరు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికేతరులకు ఇంటి స్థలం మంజూరు చేయకూడదన్న నిబంధనను అధికారులు తుంగలో తొక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఆధార్‌లో అడ్రస్‌ మార్పు చేసినట్లు తెలుస్తోంది.

- టెక్కలికి చెందిన రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి కుటుంబంలో ఓ వ్యక్తి, గ్రామ సచివాలయ ఉద్యోగి పేర్లు అర్హుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరికి ఇంకా ఇంటి స్థలం మంజూరు కాలేదు. 

- ఇటీవల సాధారణ బదిలీలకు కొద్దిరోజుల ముందు లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించకుండానే 25 మందికి అధికారులు పట్టాలు మంజూరు చేసేందుకు యత్నించినట్లు సమాచారం. 


ఆర్డీవో వివరణ

ఇదే విషయమై ఆర్డీవో హెచ్‌వీ జయరాం వద్ద ప్రస్తావించగా జగతిమెట్ట దరి జగనన్న ఇళ్ళ కాలనీ స్థలాలను పరిశీలించామని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్న వాటిని గుర్తించామని, వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారులు తమ స్థలాలను అమ్మినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అనర్హులకు ఇళ్ల స్థలాల మంజూరు అంశమై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.  

Updated Date - 2022-07-18T04:13:22+05:30 IST