నకి‘లీలలు’

ABN , First Publish Date - 2021-04-22T05:05:01+05:30 IST

కరోనా కొందరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తే.. మందుల దుకాణదారులకు మాత్రం అక్షయపాత్ర మాదిరిగా మారింది. జనాల అవసరాన్ని ఆసరాగా చేసుకొని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. నకిలీ మందులు, శానిటైజర్లు, మాస్కులు, ఫేష్‌ షీల్డ్‌లు, చేతి గ్లౌజ్‌లు, ఇలా ప్రతిదీ అధిక ధరలకు విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల కన్నెత్తిచూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నకి‘లీలలు’

 నాసిరకం శానిటైజర్లు, విటమిన్‌ మాత్రల విక్రయం
 నాణ్యతలేని పల్స్‌ ఆక్సీమీటర్లు
 కొనుగోలుదారులు గగ్గోలు
 మందుల దుకాణాలపై కొరవడిన నిఘా
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 21:
కరోనా కొందరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తే..  మందుల దుకాణదారులకు మాత్రం అక్షయపాత్ర మాదిరిగా మారింది. జనాల అవసరాన్ని ఆసరాగా చేసుకొని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. నకిలీ మందులు, శానిటైజర్లు, మాస్కులు, ఫేష్‌ షీల్డ్‌లు, చేతి గ్లౌజ్‌లు, ఇలా ప్రతిదీ అధిక ధరలకు విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల కన్నెత్తిచూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం జిల్లాలో కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలు వ్యక్తిగత శుభ్రతకు,  జాగ్రత్తలు పాటించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో  మాస్కులు, శానిటైజర్లు, ఫేష్‌ షీల్డ్‌లు, చేతిగ్లౌజులు, విటమిన్‌ మాత్రలు, పల్స్‌ఆక్సీమీటర్ల వినియోగం పెరిగింది.  వీటికోసం మందుల దుకాణాలకు వెళ్తే వారు నాసిరకం శానిటైజర్లు, ఇతర సామగ్రిని అంటగడుతున్నారు. పైకి ఆల్కహాల్‌ బేస్డ్‌ శానిటైజర్‌ అని ముద్రిస్తున్నా.. వాటి ఖచ్చితత్వంతో పాటు ఆయా కంపెనీల రిజిస్ట్రేషన్‌ నంబర్‌, ఇతరత్రా వివరాలు వాటిపై ఉండడంలేదు. మరికొన్ని దుకాణాల్లో హెర్బల్‌ శానిటైజర్లు అంటూ నకిలీవి అమ్మేస్తున్నారు. యాభై మిల్లీలీటర్ల శానిటైజర్‌ ధర రూ.25 మించకూడదని కలెక్టర్‌ ఆదేశాలు ఉన్నా, పట్టించుకోవడం లేదు. స్ర్పే, ఆకర్షణీమైన ప్యాకింగ్‌ల పేరిట యాభై మిల్లీలీటర్ల సీసాను రూ.50కు పైగా విక్రయిస్తున్నారు. ఒడిశా, తెలంగాణతోపాటు విజయవాడ ప్రాంతాలకు చెందిన కంపెనీల శానిటైజర్ల అమ్మకాలే ఎక్కువగా సాగుతున్నాయి.

పట్టించుకోని అధికారులు
కరోనా బాధితులు యాంటీబయోటిక్‌, విటమిన్‌- సి, జింక్‌ మాత్రలను తప్పనిసరిగా వాడాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఎపెక్స్‌ కంపెనీకి చెందిన జింకోవిట్‌ మాత్రలకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఈ మాత్రల కోసం మెడికల్‌ దుకాణాలకు వెళ్లిన వారికి దాన్నిపోలే ఉండే మరో కంపెనీ మాత్రలను అంటగడుతున్నారు. లిమ్‌సీ(విటమిన్‌-సి), మల్టీ విటమిన్‌ మాత్రలకు బదులు ఇతర కంపెనీలు తయారుచేసే నాసిరకం మాత్రలను విక్రయిస్తున్నారు. ఆక్సిజన్‌ స్థాయిని తెలుసుకొనే పల్స్‌ ఆక్సీమీటర్లను కూడా  నకిలీవి  సుమారు రూ.1500 చొప్పున అమ్ముతున్నారు. ఈ మీటర్లతో పరీక్షించుకుంటే ఆక్సిజన్‌ లెవల్స్‌ 94 వరకే చూపిస్తుండడంతో  కంగారుపడి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.  శ్రీకాకుళం నగరంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఈ దందా సాగుతోంది.  వైద్యుడు రాసిన చీటీ మేరకు మాత్రమే మందులు విక్రయించాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం, నీరసం వంటి లక్షణాలు ఉన్న వారు మందుల దుకాణాలకు వెళ్లి వారికి కావాల్సినవి అడిగి తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా, అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా స్పందించి మందుల దుకాణాల్లో నకిలీ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-04-22T05:05:01+05:30 IST