కొనుగోళ్ల కళ

ABN , First Publish Date - 2020-05-27T07:26:31+05:30 IST

ఫోన్‌ కొనాలనిపించగానే.. ఇలా ఆన్‌లైన్‌లోకి వెళ్లి అలా ఆర్డరిచ్చేయడం అలవాటైన ప్రాణాలు మనవి! వాషింగ్‌ మెషీన్‌, ఫ్రిజ్‌, ఏసీ, కూలర్‌.. ఏది కావాలన్నా నాలుగైదు షాపులు తిరిగి.. ఖరీదెక్కువైనా నెలవారీ కిస్తీలు పెట్టి కొనేస్తాం!! కానీ.. 2 నెలలుగా లాక్‌ డౌన్‌తో అలా కొనే చాన్స్‌ మిస్సయ్యాం...

కొనుగోళ్ల కళ

  • లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో పెరిగిన గృహోపకరణాల విక్రయాలు
  • టాప్‌-3లో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు
  • పనిమనుషులు రాకపోవడంతో
  • డిష్‌వాషర్లకు పెరిగిన డిమాండ్‌
  • ఆన్‌లైన్‌ క్లాసులతో ట్యాబ్‌లకు గిరాకీ
  • 300శాతం మేర పెరిగిన డిమాండ్‌
  • ‘ఇంటి నుంచి పని’తో ఇన్వర్టర్లకూ!
  • దుస్తుల అమ్మకాలు అంతంతే
  • కొనేందుకు వినియోగదార్ల వెనుకంజ


ఫోన్‌ కొనాలనిపించగానే.. ఇలా ఆన్‌లైన్‌లోకి వెళ్లి అలా ఆర్డరిచ్చేయడం అలవాటైన ప్రాణాలు మనవి! వాషింగ్‌ మెషీన్‌, ఫ్రిజ్‌, ఏసీ, కూలర్‌.. ఏది కావాలన్నా నాలుగైదు షాపులు తిరిగి.. ఖరీదెక్కువైనా నెలవారీ కిస్తీలు పెట్టి కొనేస్తాం!! కానీ.. 2 నెలలుగా లాక్‌ డౌన్‌తో అలా కొనే చాన్స్‌ మిస్సయ్యాం. 

ఆంక్షల సడలింపుతో అందరికీ ప్రాణం లేచొచ్చింది!! కావాల్సిన వస్తువులు కొనడానికి గృహోపకరణ దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.


(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి)

రామారావు ఇంట్లో టీవీ పాడై నెలరోజులు దాటింది. బాగు చేసే టెక్నీషియన్లు లేరు. కొత్త టీవీ కొందామంటే దుకాణాలు లేవు. ఏంచేయాలో తెలియక.. ఏమీ చేయలేక.. నిస్సహాయంగా ఉండిపోయాడు! లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించగానే భార్యతో సహా వెళ్లి 55 అంగుళాల టీవీ తెచ్చుకున్నాకే ఆయన మనసు కుదుటపడింది! వాషింగ్‌ మెషీన్‌ పాడైపోవడంతో ఇంటిల్లిపాది దుస్తులూ ఉతకలేక ఉష అనే గృహిణి పడిన బాధ అంతా ఇంతా కాదు! దుకాణాలు తెరవగానే వెళ్లి వాషింగ్‌మెషీన్‌ను కొనేదాకా ఆవిడ మనసు మనసులో లేదు. ‘‘అత్యంత భారంగా రెండు నెలలూ గడిపేసినవారంతా ఇప్పుడు గబగబా ఆయా గృహోపకరణాలు కొనేస్తున్నారు! ‘మే మూడో వారం వచ్చేసింది కదా.. ఏసీ/కూలర్‌ వచ్చే ఏడాది కొనుక్కుందాంలే’ అనుకున్నవారు కూడా.. గత వారం రోజులుగా ఎండలు మండిపోతుండడంతో ఏసీలు, కూలర్లు కొంటున్నారు. ..వెరసి, నగరంలో కొనుగోళ్ల కళ పెరిగింది. గృహోపకరణాల విక్రయాలు జోరందుకున్నాయి. రోజు విడిచి రోజు తెరుస్తున్నా డిమాండ్‌ బాగానే ఉండడంతో దుకాణదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘‘టీవీ, ఏసీ, కూలర్‌, ఫ్రిజ్‌ వంటివాటిని గతంలో అయితే విలాసాలుగా భావించేవారు. ఇప్పుడు అవి అందరికీ అవసరాలే. అందుకే కరోనా వైరస్‌ గురించి ఎవరూ భయపడట్లేదు. తమకు అవసరమైన వస్తువులను కొనడానికి భయం లేకుండానే వస్తున్నారు. మా దుకాణానికి వస్తున్న ప్రతి 10 మందిలో 9 మంది తాము కొనాలనుకున్న ఉపకరణాన్ని కొనే వెళ్తున్నారు’’ అని హైదరాబాద్‌లో 50 దుకాణాలున్న ఎలకా్ట్రనిక్‌ గృహోపకరణాల సంస్థ అధినేత తెలిపారు. కరోనా భయంతో పనిమనుషులు రాకపోవడంతో చాలామంది డిష్‌వాషర్లను కొంటున్నారని చెప్పారు.


ట్యాబ్‌లు.. ల్యాప్‌టా్‌పలకూ..

‘పిల్లల చేతికి ఫోన్లు ఇవ్వొద్దు. పసి మనసులను కలుషితం చేయొద్దు’ ..ఇదీ నిన్నటిదాకా టీచర్లు, పాఠశాలల యాజమాన్యాల మాట.

కానీ.. కరోనాతో కాని కాలం వచ్చి చదువులు ఆన్‌లైన్‌కు మారడంతో ‘మీ పిల్లలకు ఫోనో, ట్యాబో, ల్యాప్‌టాపో కొనివ్వండి’ అని టీచర్లే తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి మరీ సిఫారసు చేస్తున్నారు! మధ్యస్థంగా ఉండే ట్యాబ్‌లకు ఇప్పుడు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.    గతంతో పోలిస్తే ట్యాబ్‌ల విక్రయాలు దాదాపు 300ు దాకా పెరిగాయని దుకాణదారులు చెబుతున్నారు. ఉదాహరణకు.. ‘‘గతంలో నెలకు 10-15 ట్యాబ్‌లు అమ్మితే ఎక్కువ. కానీ ఇప్పుడు రోజుకు సగటున ఐదు ట్యాబ్‌లు అమ్ముడవుతున్నాయి’’ అని బజాజ్‌ ఎలకా్ట్రని క్స్‌ జీఎం హబీబ్‌ తెలిపారు. ఇంటి నుంచి పనిచేసేవారి సంఖ్య ఎక్కువ కావడంతో, అంతరాయం లేకుండా పనిచేసుకునేందుకు వీలుగా చాలామంది ఇన్వర్టర్లను కొంటున్నారు. వస్త్రదుకాణాలు మాత్రం వెలవెలబోతున్నాయి. పెళ్లిళ్లు కూడా జరగకపోవడంతో షాపింగ్‌ చేసేవారు కరువయ్యారు. ఇక కొత్తబట్టలు కొనడానికి వినియోగదారులూ వెనకంజ వేస్తున్నారు. 


గంపగుత్తగా డిష్‌వాషర్లు

సాధారణంగా డిష్‌వాషర్ల ధరలు బ్రాండ్‌ను బట్టి రూ.32 వేలకుపైగానే ఉంటాయి. ఎవరికి వారే వెళ్లి కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.1000-1500 దాకా ధర తగ్గిస్తారు. అలా కాకుండా.. కొంత మంది కలిసి ఒక బృందంగా వాటిని పెద్ద ఎత్తున కొంటే? ఇప్పుడు హైదరాబాద్‌లో అదే జరుగుతోంది. చందానగర్‌లోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీకి చెందినవారు ఇలా 40 డిష్‌వాషర్లను ఒకేసారి కొనుగోలు చేశారు. దీంతో రూ.36000 ధర ఉన్న డిష్‌వాషర్‌ వారికి రూ.31 వేలకే వచ్చింది. రవాణాచార్జీలు సైతం నామమాత్రంగా పడ్డాయి. ఇదేదో బాగుందని భావించిన పలు గేటెడ్‌ కమ్యూనిటీలు ఇదే బాటలో నడిచేందుకు చర్చలు జరుపుతున్నాయి.


2-3 రెట్లు పెరిగాయి

గతంతో పోలిస్తే ట్యాబ్‌ల అమ్మకాలు గణనీయంగా 2-3 రెట్లు పెరిగాయి. ఆన్‌లైన్‌ విద్య కారణంగానే ఇది జరిగింది. మా దగ్గర ప్రస్తుతం కొద్దిపాటి స్టాక్‌ మాత్రమే ఉంది. కంపెనీల నుంచే సరఫరా లేదు. ట్యాబ్‌లు చైనా నుంచి రావాల్సి ఉంది. అందుకే ఈ కొరత.

- హబీబ్‌, జీఎం, బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌


వెబ్‌ కెమెరాలూ దొరకట్లేదు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతుల వల్ల వెబ్‌ కెమెరాలకు కొరత ఏర్పడింది. నగరంలోనే అతి పెద్ద కంప్యూటర్‌ బజారైన  సీటీసీలో సైతం వెబ్‌ కెమెరాలు దొరకట్లేదు. ట్యాబ్‌లు, ల్యాప్‌టా్‌పలు బాగానే దొరుకుతున్నాయి. విక్రయాలు కూడా బాగానే ఉన్నాయి.

- రతన్‌ యాదవ్‌, శరణ్‌ కంప్యూటర్స్‌ అధినేత, సీటీసీ, సికింద్రాబాద్‌


రోజుకు 3-4 ఇన్వర్టర్లు..

ఇన్వర్టర్ల అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగాయి. గతంలో మేం నెలకు 20 యూనిట్ల వరకూ అమ్మేవాళ్లం.  ఇప్పుడు రోజుకు 3-4 యూనిట్లు అమ్ముతున్నాం.

-సురేశ్‌, బ్యాటరీ వ్యాపారి, కూకట్‌పల్లి


Updated Date - 2020-05-27T07:26:31+05:30 IST