ఉక్కిరిబిక్కిరి!

ABN , First Publish Date - 2022-06-25T08:47:33+05:30 IST

రైస్‌ మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలను విక్రయించే విషయంలో వేచి చూసే ధోరణిని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా చాలా..

ఉక్కిరిబిక్కిరి!

ధాన్యం నిల్వల విక్రయంపై కింకర్తవ్యం!?

ఇప్పటికే తనిఖీలు, సీఎంఆర్‌తో కేంద్రం ఉక్కుపాదం

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా తీరని నష్టం

ఇప్పుడు మిల్లర్లకు అమ్మితే నష్టాలు పెరిగే చాన్స్‌

అధికారులతో సమావేశమైన హరీశ్‌, గంగుల, పల్లా

ఎఫ్‌సీఐ అనుమతి ఇస్తుందనే ఆశతో నిర్ణయం పెండింగ్‌

సీఎం కేసీఆర్‌తో సమావేశమైన తర్వాతే తుది నిర్ణయం


హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రైస్‌ మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలను విక్రయించే విషయంలో వేచి చూసే ధోరణిని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఇప్పుడు తక్కువ ధరకు మిల్లర్లకు అమ్మితే మరింత నష్టం తప్పదన్న అభిప్రాయమే ఇందుకు కారణం. దీనికితోడు, మొత్తం నిల్వలను మిల్లర్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండకపోవచ్చని, ఎఫ్‌సీఐ సేకరణతోనే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పుడు బియ్యం, ముడి బియ్యం సమస్య వచ్చినప్పటి నుంచీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్ర మంత్రులు కూడా అవకాశం దొరికిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, తెలంగాణలోని ధాన్యం నిల్వలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైస్‌ మిల్లుల్లో రెండుసార్లు ఫిజికల్‌ వెరిఫికేషన్‌ చేయించింది. మాయమైన ధాన్యం లెక్కలు తేల్చింది. చర్యలకు సిఫారసులు చేసింది. దీనికితోడు, కేంద్ర ప్రభుత్వం అందజేసినా పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడం లేదని తప్పుబట్టింది. ఆ కారణంతో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) సేకరణ నిలిపివేయడం ద్వారా ఉక్కుపాదం మోపింది. దాంతో, రాష్ట్ర ప్రభుత్వానికి తీరని నష్టం కలుగుతోంది. ప్రస్తుతం రూ.22 వేల కోట్ల విలువైన ధాన్యం మిల్లర్ల వద్ద ఉంది. సీఎంఆర్‌ తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులు కూడా ఆగిపోతాయి. ధాన్యం కొనుగోలుకు తీసుకున్న బ్యాంకు అప్పు తీర్చడం కష్టమవుతుంది. వడ్డీ భారం తడిసిమోపెడవుతుంది.


యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులకు ధాన్యం డబ్బుల బకాయిలు కూడా ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడం, పైగా, సీఎంఆర్‌ డబ్బులు ఎఫ్‌సీఐ నుంచి నిలిచిపోవడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. మరోవైపు, రైస్‌ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం పాడైపోతున్నాయి. దాంతో, ధాన్యం నిల్వలను తక్కువ ధరకు మిల్లర్లకు అమ్మేద్దామా? అన్న యోచనకు ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోనే, తాజా పరిస్థితిపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, ఇతర అధికారులతో శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చించారు. ధాన్యం నిల్వల విషయంలో తొందరపడొద్దని, ఇప్పటికే చాలా నష్టపోయామని, ఒకవేళ ఎఫ్‌సీఐ ప్రొక్యూర్మెంట్‌ చేయకపోతే నష్టం మరింత పెరుగుతుందనే ఆలోచనకు మంత్రులు హరీశ్‌రావు, కమలాకర్‌ వచ్చారు. ఢిల్లీ నుంచి అనుమతి లేఖ వస్తుందనే సంకేతాలు అధికార వర్గాల ద్వారా కనిపిస్తున్నాయని, ఇప్పటికిప్పుడే తొందరపడొద్దని, మూడు రోజులు వేచి చూసిన తర్వాత నిర్ణయం తీసుకుందామని నిర్ణయించారు.


మరో మూడు రోజులు ఆగితే.. సీఎంఆర్‌ డెలివరీ నిలిపివేసి మూడు వారాలు పూర్తవుతుందని, అనుమతి ఇస్తారా? లేదా? అనే విషయం కూడా ఆలోపు తేలిపోతుందని, ఆ తర్వాత ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ తాజా భేటీలో జరిగింది. ఎఫ్‌సీఐ నుంచి అనుమతి వస్తే సరి. రాకపోతే ఏం చేయాలి? ధాన్యాన్ని నేరుగా టెండరు పద్ధతిలో విక్రయించాలా? లేకపోతే మిల్లింగ్‌ చేయించి బియ్యం అమ్మాలా? ఇంకేమైనా ప్రాసెసింగ్‌ చేయొచ్చా? ఏ పద్ధతిలో వెళితే ఎంత నష్టం వస్తుంది? తక్కువ నష్టంతో వడ్లను ఎలా వదిలించుకోవాలి? అనే అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎస్‌, కమిషనర్‌లను మంత్రులు ఆదేశించినట్లు తెలిసింది. ఈ వ్యవధిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా సమావేశం ఉంటుందని, అధికారులంతా సిద్ధంగా ఉండాలని, సమగ్ర వివరాలు, ప్రతిపాదనలతో సీఎం వద్దకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.


ఆరుబయట 15 లక్షల మెట్రిక్‌ టన్నులు

రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వలు ఎంత ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే వివరాలను మంత్రులు హరీశ్‌రావు, కమలాకర్‌ సేకరించారు. ప్రస్తుతం మిల్లర్ల వద్ద 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, వాటిలో 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఆరు బయట ఉందని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉందని కమిషనర్‌ అనిల్‌కుమార్‌, జనరల్‌ మేనేజర్‌ రాజిరెడ్డి మంత్రులకు తెలిపారు. మొదట ఈ ధాన్యం పాడైపోకుండా మిల్లింగ్‌ జరిగేట్లు చూడాలని, సాధ్యమైతే మిల్లింగ్‌ చేసి బియ్యం నిల్వ చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చింది.


రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం విక్రయించాలనే నిర్ణయానికి వస్తే... మొత్తం నిల్వలను ఒకేసారి కాకుండా విడతలవారీగా విక్రయించాలని మిల్లర్లు భావిస్తున్నారు. తక్కువ పరిమాణానికి టెండర్లు పిలిస్తే మార్కెట్‌ సమతుల్యంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 5 లక్షల టన్నుల చొప్పున వారం పది రోజులకు ఒక టెండరు పిలిస్తే... క్రమపద్ధతిలో జరుగుతుందని భావిస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం.. యాసంగి బియ్యాన్ని ముడి బియ్యంగా మార్చాల్సి ఉంది. ఒకవేళ రైస్‌ మిల్లర్లే కొనుగోలు చేస్తే ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌) ఉత్పత్తి చేసుకుంటారు. అప్పుడు నూకల సమస్య కూడా ఉండదు. ఉప్పుడు బియ్యాన్ని విదేశీ మార్కెట్లో విక్రయించుకుంటారు. అయితే, ఇప్పటికిప్పుడు 25 లక్షల టన్నులు కొనే శక్తి తెలంగాణ మిల్లర్లకు ఉందని చెబుతున్నారు. దీనితో, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగినా.. మిగిలిన నిల్వల పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకం!


నేడు రైస్‌ మిల్లర్ల సమావేశం

కేంద్ర ప్రభుత్వం కస్టమ్‌ మిల్లింగ్‌ నిలిపివేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో ఆందోళనకు గురవుతున్న రైస్‌మిల్లర్లు శనివారం హైదరాబాద్‌లో సమావేశం అవుతున్నారు. రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంఘం కార్యవర్గంతోపాటు 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు దీనికి హాజరవుతున్నారు. ధాన్యం నిల్వలు, మిల్లర్ల సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి... తక్షణం చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్‌ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నారు.

Updated Date - 2022-06-25T08:47:33+05:30 IST