పౌరసరఫరాలో.. పాతజీతాలే

ABN , First Publish Date - 2022-08-03T05:50:26+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలులోకి తీసుకొచ్చి ఏడు నెలలు గడిచింది. అయినా పౌరసరఫరాల శాఖలో ఇంకా ఉద్యోగుల సర్వీసు రిజిష్టర్‌లో అవి నమోదు కాలేదు.

పౌరసరఫరాలో.. పాతజీతాలే
గుంటూరులోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం

రిజిష్టర్లలో నమోదు కాని పీఆర్సీ  

నిలిచిపోయిన ఉద్యోగుల ఇంక్రిమెంట్లు

కొత్త జిల్లాలకు బట్వాడా కాని ఎస్‌ఆర్‌లు

ఈ నెలలో అరకొర జీతాలే వస్తాయని ఆందోళన


గుంటూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలులోకి తీసుకొచ్చి ఏడు నెలలు గడిచింది. అయినా పౌరసరఫరాల శాఖలో ఇంకా ఉద్యోగుల సర్వీసు రిజిష్టర్‌లో అవి నమోదు కాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో గుంటూరు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లాలకు నియమితులైన ఉద్యోగుల సర్వీసు రిజిష్టర్లు కూడా ఆయా జిల్లాలకు పంపలేదు. దీంతో ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ వంటి సదుపాయాలేవి పొందలేకపోతున్నారు. పైగా జూలై నెల ప్రారంభంలో జరిగిన సాధారణ బదిలీలతో కేవలం ఎల్‌పీసీ(లాస్టు పే సర్టిఫికేట్‌) మాత్రమే వారు ట్రాన్స్‌ఫర్‌ అయిన ప్రదేశానికి పంపించారు. ఎస్‌ఆర్‌ లేకుండా కేవలం ఎల్‌పీసీ మాత్రమే రావడంతోఆరు, ఏడు రోజుల జీతాలు మాత్రమే జూలై నెలకు సంబంధించి తమ ఖాతాల్లో పడతాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో డీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. జిల్లా పౌరసరఫరాల శాఖ అస్తవ్యస్తంగా తయారైంది. మంజూరైన పోస్టుల్లో అధికారులు లేరు. సాధారణ బదిలీల తర్వాత అన్నీ సర్దుకుంటాయని ఉద్యోగులు భావించగా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఏడు నెలల క్రితం వచ్చిన పీఆర్సీనే ఇంకా అమలుకు నోచుకోలేదంటే ఆ శాఖలో నెలకొన్న దుస్థితి కళ్లకు కడుతోన్నది. ఏ ఉద్యోగికి అయినా సర్వీసు రిజిష్టర్‌ ఎంతో కీలకం. అన్ని విషయాలు అందులోనే ఉంటాయి. అయితే వాటి విషయంలోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఏప్రిల్‌ నెలలో ఉద్యోగుల సర్దుబాటు జరిగిన సమయంలో కేవలం ఎల్‌పీసీలు మాత్రమే పంపించి చేతులు దులుపుకున్నారు. ఎస్‌ఆర్‌లు ఆయా జిల్లాలకు వెళ్లకపోవడంతో అక్కడి అధికారులు ఏమీ చేయలేకపోయారు. ఇటీవల జరిగిన బదిలీల్లో చాలామంది అధికారులు జిల్లాలు మారాల్సి వచ్చింది. ఇప్పుడు వారు సక్రమంగా జీతాలు, ఇంక్రిమెంట్లు వంటి సదుపాయాలు పొందాలంటే తొలుత ఎస్‌ఆర్‌లు ఇక్కడి నుంచి కొత్త జిల్లాలకు వెళ్లి మళ్లీ వారు బదిలీ అయిన ప్రదేశానికి చేరాలి. అప్పటి వరకు సరిగా జీతభత్యాలు కూడా అందుకోలేరు. దీనిపై జిల్లా కార్యాలయానికి విజ్ఞప్తులు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. 


అనాథగా గుంటూరు పౌరసరఫరాల శాఖ

గుంటూరు నగర పౌరసరఫరాల శాఖ అనాథగా మారింది. గతంలో ఒక ఏఎస్‌వో, నలుగురు సీఎస్‌డీటీలు ఉండేవారు. ఇప్పుడు ఒక్క ఏఎస్‌వో మాత్రమే ఉన్నారు. ఆయన్ని కూడా తెనాలి డివిజన్‌కి ఇన్‌చార్జిగా నియమించారు. ఇక సీఎస్‌డీటీలుగా ఇటీవల ఇద్దరిని పోస్టింగ్‌ చేయగా ఒకరు కలెక్టరేట్‌లోనే పోస్టింగ్‌ చేయించుకున్నారు. మరొకరిని జిల్లా అంతా తిప్పుతున్నారు. దీంతో గుంటూరులోని రేషన్‌షాపులు, మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ల ఆపరేటర్లపై పర్యవేక్షణ కొరవడింది. ఇదే అదనుగా రేషన్‌ బియ్యం పెద్దఎత్తున పక్కదారి పడుతున్నది. ఇటీవల కాలంలో విజిలెన్స్‌, పోలీసు శాఖల అధికారులే దాడులు చేసి రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖపరంగా ఒక్క చోట కూడా రేషన్‌ సరుకుల అక్రమ రవాణాను పట్టుకున్న దాఖలాలు లేవు. 

Updated Date - 2022-08-03T05:50:26+05:30 IST