వాయిదాల్లో వేతనం!

ABN , First Publish Date - 2020-04-01T09:30:47+05:30 IST

వేతనాల చెల్లింపునకు వాయిదా పద్ధతి అనుసరించనున్నారు. సీఎం నుంచి స్థానిక సంస్థల వరకు అన్ని స్థాయుల ప్రజా ప్రతినిధులకు ఈ నెల జీతం...

వాయిదాల్లో వేతనం!

రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ సర్కారు తరహాలో ఉద్యోగుల వేతనాలను వాయిదా పద్ధతుల్లో చెల్లించాలని నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని... వనరులు కూడా సన్నగిల్లాయని తెలిపింది. మరోవైపు... కరోనాపై పోరుకోసం వైద్య రంగంపై భారీ స్థాయిలో ఖర్చు పెట్టాల్సి వస్తోందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జీతాలు, పెన్షన్లలో కోత పెడుతున్నట్లు మంగళవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు.

  • ఉద్యోగులకు 50 శాతమే చెల్లింపు..
  • ఏఐఎస్‌ అధికారులకు 60 శాతం కోత
  • మిగిలిన మొత్తం తర్వాత చెల్లింపు
  • ప్రజా ప్రతినిధులకు పూర్తిగా నిలిపివేత
  • జీవో జారీ చేసిన ప్రధాన కార్యదర్శి
  • కొత్తగా వేతన బిల్లులు పంపాలని ఆదేశం
  • నిధులున్నా తెలంగాణ తరహాలో నిర్ణయం
  • ఆ సొమ్ముతో అత్యవసర చెల్లింపులు?
  • రూ.వెయ్యి ఇచ్చేందుకు 1300 కోట్లు


అమరావతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): వేతనాల చెల్లింపునకు వాయిదా పద్ధతి అనుసరించనున్నారు. సీఎం నుంచి స్థానిక సంస్థల వరకు అన్ని స్థాయుల ప్రజా ప్రతినిధులకు ఈ నెల జీతం చెల్లించరు.  ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ తదితర అఖిల భారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారుల జీతంలో 60 శాతం కోత పెట్టారు. మిగిలిన ఉద్యోగులకు   50 శాతం మాత్రమే చెల్లిస్తారు. నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌, గ్రామ-వార్డు సచివాలయ సిబ్బందికి పది శాతం తగ్గించి ఇస్తారు. ఇప్పుడు వేతనంలో తగ్గించిన మొత్తాన్ని ఆయా ఉద్యోగులు, అధికారులు తర్వాత చెల్లిస్తారు. ఉద్యోగుల వేతనాల బిల్లులను తాజా జీవో ప్రకారం మళ్లీ పంపించాలని ఆదేశించారు.


తెలంగాణ తరహాలోనే... 

నిజానికి... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల బిల్లులు ఇప్పటికే ఆర్థిక శాఖకు వెళ్లాయి. ఖజానాలో నిధులు కూడా ఉన్నాయి! అయినప్పటికీ, కరోనా కల్లోలం నేపథ్యంలో జీతాలకు కోత పెట్టాలని నిర్ణయించడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వం వేతనాలు, పెన్షన్లు కలిపి నెలకు రూ.6200 కోట్లు చెల్లింపులు చేస్తోంది. ప్రతి నెలా ఒకటో తేదీన రూ.2,500 కోట్లు వేతనాల రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో పడతాయి. మిగిలిన వేతనాలు, పెన్షన్లను వీలును, నిధుల లభ్యతను బట్టి 10వ తేదీలోగా ఆర్థిక శాఖ చెల్లిస్తోంది.


ఇప్పుడు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం ద్వారా నెలకు ప్రభుత్వానికి రూ.2,500 కోట్ల వరకు మిగిలే అవకాశం ఉంది. అలా మిగిలిన నిధులతో అత్యవసర బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు... ‘లాక్‌డౌన్‌’ నేపథ్యంలో ఒకటో తేదీన ప్రతి ఇంటికీ రూ.వెయ్యి చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. దీనికోసం రూ.1300 కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వేతనాల ‘వాయిదా చెల్లింపు’ తప్పలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను వాయిదాలలో చెల్లించాలనే యోచన తొలుత లేదని, మార్చి 30న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసిన తర్వాతే ఇక్కడ ఆ దిశగా అడుగులు వేయడం మొదలైందని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి నెలలాగానే ఈ నెల కూడా వేతనాల బిల్లులను పూర్తిస్థాయిలో ఆర్థిక శాఖ స్వీకరించిందని చెప్పారు. ఇప్పుడు ‘కోత’ జీవో ప్రకారం వేతనాల బిల్లులు పంపి, చెల్లింపులు చేసేందుకు మరింత సమయం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల ‘వేతనాల’ను వాయిదా పద్ధతి అమలు చేస్తుండగా... ప్రైవేటు పరిశ్రమలు తమ ఉద్యోగులు, కార్మికులకు జీతాలను ఆపి వేయడానికి వీల్లేదని, ఎప్పట్లాగానే నిర్దిష్ట సమయానికి చెల్లించాలని పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.


Updated Date - 2020-04-01T09:30:47+05:30 IST