Abn logo
Aug 1 2021 @ 22:29PM

వెలుగు సిబ్బంది జీవితాల్లో చీకట్లు

- 30 డ్వాక్రా సంఘాలు ఉంటేనే జీతం

- ఆందోళనలో యానిమేటర్లు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) 

వెలుగు సిబ్బంది జీవితాల్లో చీకట్లు కమ్ముకోనున్నాయి. ఒక్కో గ్రామ సంఘం(వీవో) పరిధిలో కనీసం 30 స్వయం సహాయక సంఘాలు ఉండాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉత్తర్వులు జారీచేసింది. అలా అయితేనే యానిమేటర్లకు జీతాలు చెల్లిస్తామని నిబంధన విధించింది. దీంతో యానిమేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో పది, మరికొన్ని గ్రామాల్లో 15, ఇంకొన్ని చోట్ల 20, 25 చొప్పున స్వయం సహాయక సంఘాలను ఒక గ్రామ సంఘంగా ఏర్పాటు చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా 1,580 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘానికి ఒక్కో యానిమేటర్‌ చొప్పున ఉన్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు 2012లో గ్రామ సంఘాల సహాయకుల వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు యానిమేటర్లకు రూ. 3వేల పారితోషికం ప్రకటించారు. దీంతో పాటు గ్రామ సమాఖ్యల నుంచి మరో రూ.2వేలను కలిపి మొత్తం రూ. 5వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా ఈ మొత్తాన్ని సీఎం జగన్‌ రూ.10వేలకు పెంచారు. ఇందులో రూ.8వేల జీతంతో పాటు గ్రామ సమాఖ్యల నుంచి రూ.2వేలు ఇచ్చేలా ఉత్తర్వులు జారీచేశారు. కానీ.. ఒక్కో వీవో పరిధిలో 30 సంఘాలు ఉంటేనే ఆగస్టు నుంచి వేతనం మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సాంకేతిక కారణాలు చూపుతూ.. సుమారు 100 మంది యానిమేటర్లకు మార్చి నుంచి జూన్‌ వరకు వేతనాలు మంజూరు చేయలేదు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో యానిమేటర్ల సంఖ్య కూడా తగ్గనుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జీతాలు పెంచినట్టే పెంచి.. తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


రేషనలైజేషన్‌ కోసం

- శాంతిశ్రీ, డీఆర్డీఏ పీడీ

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒక్కో వీవో పరిధిలో 30 స్వయం సహాయక సంఘాలు ఉండాల్సిందే. దీనివల్ల యానిమేటర్ల సంఖ్య తగ్గదు కానీ, రేషనలైజేషన్‌ జరుగుతుంది. ప్రస్తుతం యానిమేటర్ల పనితీరును సమీక్షిస్తున్నాం. వారి ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.