‘అమరరాజా’ వేతనాల కోత

ABN , First Publish Date - 2020-06-04T05:57:18+05:30 IST

కొవిడ్‌-19 కారణంగా తలెత్తిన అసాధారణ పరిస్థితులు, అనిశ్చితిని పరిగణనలోకి తీసుకుని సిబ్బంది, మేనేజిమెంట్‌ ఉద్యోగుల వేతనాలను 10ు నుంచి 25ు మేరకు తగ్గించాలని అమరరాజా బ్యాటరీస్‌ గ్రూప్‌ నిర్ణయించింది...

‘అమరరాజా’ వేతనాల కోత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌-19 కారణంగా తలెత్తిన అసాధారణ పరిస్థితులు, అనిశ్చితిని పరిగణనలోకి తీసుకుని సిబ్బంది, మేనేజిమెంట్‌ ఉద్యోగుల వేతనాలను 10శాతం నుంచి 25ు మేరకు తగ్గించాలని అమరరాజా బ్యాటరీస్‌ గ్రూప్‌ నిర్ణయించింది. జూనియర్‌, సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. తగ్గించిన మొత్తాన్ని వ్యాపార పనితీరుతో ముడిపడిన చెల్లింపు (బీపీఎల్‌పీ) కింద ఉంచుతారు. అలానే 2020-21కి  పారితోషికాలను 50 శాతం వరకూ తగ్గించుకోవాలని మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయిలో పని చేస్తున్న  అమరరాజా గ్రూప్‌ ప్రమోటర్లు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. శ్రామికులు, వర్కింగ్‌ గ్రేడ్‌ ఉద్యోగులకు మాత్రం పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించనున్నట్లు అమరరాజా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ (గ్రూప్‌ హెచ్‌ఆర్‌) బీ జైకృష్ణ తెలిపారు. ఉద్యోగులందరికీ 2020-21 ఏడాదికి ఇంక్రిమెంట్లు, వేతన సవరణలను వాయిదా వేసింది. 


జీవీకే గ్రూప్‌లో..

జీవీకే గ్రూప్‌ ఉద్యోగుల వేతనాలను మే నుంచి 30 శాతం వరకూ తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 1,800 మంది జీవీకేలో పని చేస్తున్నారు. ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ కాస్ట్‌-టు-కంపెనీ (సీటీసీ) ఉన్న ఉద్యోగులపై 10 శాతం కోత విధించినట్లు తెలుస్తోంది. రూ.25 లక్షల కంటే అధికంగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 20 శాతం తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్‌, ఉన్నత స్థాయి మేనేజిమెంట్‌ ఉద్యోగుల వేతనం 30 శాతం తగ్గించింది. జీఎంఆర్‌ గ్రూప్‌ సైతం మే నెల వేతనాల్లో 50 శాతం వరకూ కోత విధించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2020-06-04T05:57:18+05:30 IST